Share News

వైదేశిక నీతిపై బెంగాల్‌ నీడలు

ABN , Publish Date - May 06 , 2026 | 02:55 AM

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితం దేశీయ రాజకీయాలను మలుపు తిప్పడంతో పాటు భారత విదేశాంగ విధానంలోని ఇరుగుపొరుగు కోణాన్ని కూడా గణనీయంగా...

వైదేశిక నీతిపై బెంగాల్‌ నీడలు

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితం దేశీయ రాజకీయాలను మలుపు తిప్పడంతో పాటు భారత విదేశాంగ విధానంలోని ఇరుగుపొరుగు కోణాన్ని కూడా గణనీయంగా ప్రభావితం చేయనున్నది. విదేశీ చొరబాటుదారుల ఏరివేత నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నది.

పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య భారత రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌తో భౌగోళిక సామీప్యత ఉన్నది. ఈ రాష్ట్రాలలో విదేశీ చొరబాటుదారులు గణనీయంగా ఉన్నారనేది మొదటి నుంచీ బీజేపీ ఆరోపణ. ఈ కారణంగానే మూడు ‘డి’లు– డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ (గుర్తింపు, తొలగింపు, బహిష్కరించు లేదా వెనక్కి పంపించు) అనేది ఆ రాష్ట్రాలలో బీజేపీ వ్యూహాత్మక రాజకీయ కార్యక్రమంగా ఉన్నది. రాజకీయంగా ప్రతికూలురు, ప్రత్యేకించి ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యూహాత్మక రాజకీయం తొలుత 1980వ దశకంలో అసోంలో ఆరంభమయింది. తాజాగా బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆ వ్యూహం చరిత్రాత్మకంగా సఫలమయింది. విదేశీ చొరబాటుదారులను వారి వారి దేశాలకు తిరిగి పంపించివేయడం అన్ని దేశాలకు పరిపాటి. అమెరికా, గల్ఫ్ రాజ్యాలు నిరంతరం ఈ పని చేస్తుంటాయి. ఇప్పుడు భారత సరిహద్దు రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు సైతం ఈ పని చేస్తామంటున్నాయి. జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న ఈ ప్రక్రియ విదేశాంగ విధానంలో ఒక భాగం.

బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో భారత రాయబారులుగా నియమితులు అయ్యే దౌత్యవేత్తలు భారత విదేశాంగ విధానంలో తలపండిన అనుభవజ్ఞులు అయి ఉండడం కద్దు. ఈ కారణంగా ఢాకా, ఇస్లామాబాద్‌లోని భారత రాయబారులకు ఎనలేని ప్రాధాన్యముంటుంది. ఢాకాలో భారతీయ రాయబారిగా పనిచేయడం అనేది భారతీయ దౌత్యవేత్తల ప్రతిభకు పురస్కారమనే భావన ఉన్నది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో పనిచేసిన భారతీయ రాయబారులు అందరూ అసాధారణ దౌత్య ధురీణులే. ఢాకాలో కొత్త రాయబారిగా కేంద్ర మాజీ మంత్రి దినేశ్‌ త్రివేదిని నియమించడంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన, అసాధారణమైన నిర్ణయం తీసుకున్నదని చెప్పవచ్చు. త్రివేది బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఒకప్పుడు మమతా బెనర్జీకి ఆప్తుడు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌కు చెందిన దౌత్యవేత్తలు చేయజాలని పనులను రాయబారులుగా నియమితులయ్యే రాజకీయ నాయకులు సునాయాసంగా చేయగలుగుతారు. తనను నియమించిన పాలకపక్షానికి అనుకూలంగా రాజకీయ కోణం నుంచి ఆలోచించి తదనుగుణంగా వ్యవహరించగలుగుతారు. ఇదిగో ఇందుకే దినేశ్‌ త్రివేదిని ఢాకాలో రాయబారిగా నియమించారు.


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత్‌కు అనుకూలంగా వ్యవహరించేవారు. విద్యార్థుల తిరుగుబాటులో ఆమె పదవీచ్యుతురాలు అయిన అనంతరం బంగ్లాదేశ్ రాజకీయాలలో పెనుమార్పులు సంభవించాయి. ఈ హఠాత్పరిణామాల్లో ఏకాకి అయి, ఉక్కిరిబిక్కిరి అయిన భారత్, ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన తారిక్‌ రహెమాన్‌కు స్నేహ హస్తం అందించింది.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బంగ్లాదేశ్‌కూ సహజ వాయువు, ఎరువుల కొరత అనివార్యమయ్యింది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు.. తమను ఆదుకోవాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరింది. భారత ప్రభుత్వం సమ్మతించింది. బంగ్లాదేశ్ నూతన విదేశీ వ్యవహారాల మంత్రి న్యూఢిల్లీకి వచ్చి పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పూరితో సమావేశమయ్యారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రకమైన ప్రకటనలు చేసినప్పటికీ, సువిశాల జాతి ప్రయోజనాల దృష్ట్యా బంగ్లాదేశ్‌తో భారత్‌ సుస్థిర మైత్రినే కోరుకుంటోంది, సందేహం లేదు. మైత్రిని కోరుకుంటోందనడానికి బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలే నిదర్శనం.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఏరివేతకై ఈశాన్య భారత సరిహద్దు ప్రాంతాలలో అనుమానాస్పద భారత పౌరులుగా పలువురిని గుర్తిస్తున్నారు. ఈ అక్రమ వలసదారులలో బంగ్లాదేశ్ జాతీయులుగా నిర్ధారణ అయ్యేవారు తక్కువేమీ కాదు. అయితే వారిని వెనక్కు పంపించడం అత్యంత కష్టతరమైన వ్యవహారమే. దౌత్యపరమైన సమాచారం లేకుండా అడ్డదారిన, రాష్ట్రాల పోలీసులు కేంద్ర సరిహద్దు భద్రతా దళాల సహాయంతో, అర్ధరాత్రి సరిహద్దు అవతలకు ఆ ‘అక్రమ వలసదారు’లను నెట్టివేయడం వివాదాస్పదమవుతోంది.

సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అసలైన భారతీయ ముస్లింలపై సైతం విదేశీ చొరబాటుదారులుగా ముద్ర వేసే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే 30 లక్షల మంది ఓటర్లను అనుమానాస్పద భారత పౌరులుగా గుర్తించి, వారి ఓటు హక్కును తొలగించిన విషయం ఇక్కడ ప్రస్తావించి తీరాలి. భవిష్యత్తులో వారందరినీ బలవంతంగా బంగ్లాదేశ్‌కు పంపించే ప్రయత్నం చేస్తామంటే ఎలా? గంగా నదీ జలాల పంపిణీ ఒప్పందం గడువు వచ్చే ఏడాది ముగియనున్నది. తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం.. మొదలైన వాటిని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వానికి బెంగాల్‌లో అధికారాన్ని చేపట్టనున్న నూతన బీజేపీ సర్కారు సైతం గతంలో మమతా బెనర్జీ వలే పూర్తిగా సహకరించకపోవచ్చు. అసోంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నది. ఇరుగు పొరుగులో చైనా ప్రాబల్యం, పాకిస్థాన్‌ దుర్నీతి.. ఇత్యాది అంశాలన్నీ కూడా ఇక్కడ పరస్పరం ముడిపడిపోయి భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయడం ఖాయం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 02:55 AM