కోటి ఆశలతో కొత్త విద్యా సంవత్సరంలోకి...
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:36 AM
గత పాలకుల అనాలోచిత విధానాలతో జారుడు మెట్ల మీద నుంచి సర్కారీ పాఠశాలలు జారిపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేసి ఉన్నత పాఠశాలలో కలపడం, పర్యవేక్షణాధికారుల...
గత పాలకుల అనాలోచిత విధానాలతో జారుడు మెట్ల మీద నుంచి సర్కారీ పాఠశాలలు జారిపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేసి ఉన్నత పాఠశాలలో కలపడం, పర్యవేక్షణాధికారుల హడావిడి, టీచర్ల కొరత, బోధనా సమయాన్ని హరించే ఆన్‌లైన్ యాప్‌లు తదితర సమస్యలు ప్రభుత్వ పాఠశాలల మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏటా గణనీయంగా తగ్గుతూ ప్రైవేట్ పాఠశాలల బాట పట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యాశాఖ మీద దృష్టి సారించి పాత విధానాలకు చరమగీతం పాడి, పలు సంస్కరణలు తీసుకువచ్చింది. జీవో 117 రద్దు చేసింది. దీంతో ప్రాథమిక పాఠశాలలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. డీఎస్సీ నిర్వహించి 15,941 వేల టీచర్లను నియమించింది. ఈ ఏడాది వేసవి సెలవుల కంటే ముందు నుంచే ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టింది విద్యాశాఖ. దీంతో ఈ ఏడాది బడి తెరిచే నాటికే రమారమి లక్ష మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కుటుంబంలో అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం నగదు ప్రోత్సాహం, పరీక్షలకు ఆధునిక పద్ధతుల్లో ఎసెస్మెంట్ పుస్తకాలు, అత్యాధునిక పరిజ్ఞానం నైతిక విలువలు రంగరించి కూర్పు చేసిన గ్లోబల్ స్టాండర్డ్‌తో కూడిన సరికొత్త సిలబస్ పుస్తకాలు, పిల్లలకు అందించే స్కూల్ బ్యాగ్, షూస్, టై, బెల్టు వంటి వాటిలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చింది.
గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పదవ తరగతి విద్యార్థులు 78.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఫోటోలతో సహా కార్పొరేట్ తరహాలో పత్రికల్లో ప్రచారం చేయటం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పటిష్టం చేయడానికి 9,620 ఆదర్శ పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి తరగతికి కచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో రాజకీయ పార్టీలు, ప్రైవేట్ కార్యకలాపాలను నిషేధిస్తూ గత ఏడాది ఆగస్టు 1న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది పాఠశాల విద్యా వాతావరణాన్ని పటిష్టం చేసే ఒక గుణాత్మక చర్య.
చిలుకూరి శ్రీనివాసరావు
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News