భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
ABN , Publish Date - May 08 , 2026 | 12:28 AM
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల ఆణిముత్యాలకు హృదయపూర్వక అభినందనలు. మీరు సాధించిన ఈ విజయం మీ తల్లిదండ్రుల నమ్మకం, మీ గురువుల శ్రమ...
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల ఆణిముత్యాలకు హృదయపూర్వక అభినందనలు. మీరు సాధించిన ఈ విజయం మీ తల్లిదండ్రుల నమ్మకం, మీ గురువుల శ్రమ, ప్రభుత్వ కృషికి దక్కిన గొప్ప గౌరవంగా భావించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు, పక్కా ప్రణాళికకు పదో తరగతి ఫలితాలే నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సామాన్యుడి బిడ్డలు గెలుపు బావుటా ఎగురవేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారిలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలే ఎక్కువగా ఉంటారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం భుజానికెత్తుకుంది.
ప్రభుత్వాలు తమ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పరిస్థితి మారింది. సమాజ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నాయి. ప్రతి కుటుంబం నుంచి ఉన్నత విద్యావంతులు రావాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలు సాకారం కావాలంటే పౌరులందరి భాగస్వామ్యం, సహకారం, తోడ్పాటు ఎంతో అవసరం. ముఖ్యంగా దేశానికి సంపదగా నిలుస్తున్న యువతరాన్ని విలువైన మానవ వనరులుగా, ఉన్నత విద్యావంతులుగా, సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ బాధ్యతను గుర్తించి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మించే దిశగా పనిచేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, మధ్యాహ్న భోజనం... వంటి అనేక సదుపాయాలను అందించడంతో పాటు, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం డబ్బులు జమచేస్తోంది. ‘ప్రతిభ కలిగిన చిన్నారులు పేదరికం కారణంగా విద్యకు దూరం కారాదు’ అనే ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ‘పది’ ఫలితాల్లో మన పేదింటి పిల్లలు సాధించిన ఈ విజయం భవిష్యత్ తరాలకు పదింతల స్ఫూర్తిని ఇస్తుంది.
వేదుల నరసింహం
విశాఖపట్నం
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest AP News And Telugu News