గూగుల్‌తో ‘సిలికాన్ కోస్ట్’ కానున్న విశాఖ తీరం
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:49 AM
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఏప్రిల్ 28, 2026 ఒక సువర్ణ అధ్యాయానికి నాందిగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం వేదికగా గూగుల్ సంస్థ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు నేడు శంకుస్థాపన చేయబోతోంది. రూ.1.35 లక్షల కోట్ల...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఏప్రిల్ 28, 2026 ఒక సువర్ణ అధ్యాయానికి నాందిగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం వేదికగా గూగుల్ సంస్థ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు నేడు శంకుస్థాపన చేయబోతోంది. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో పెట్టడంతో పాటుగా రాబోయే దశాబ్దంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించబోతోంది.
గూగుల్ తన అనుబంధ విభాగం రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా నిర్వహించే ఈ గూగుల్ డేటా సెంటర్, భారతదేశ పారిశ్రామిక రంగంలో ఇప్పటివరకు అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ప్రాథమికంగా రూ.1.35 లక్షల కోట్ల ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్, సెమీకండక్టర్ల కొరత, అత్యాధునిక ఏఐ చిప్స్ ధరల పెరుగుదల దృష్ట్యా ఈ మొత్తం పెట్టుబడి రూ.1.50 లక్షల కోట్లకు పైగా చేరవచ్చు. విశాఖ శివారులోని అడవివరం, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో 601 ఎకరాలలో మూడు భారీ క్యాంపస్‌లుగా గూగుల్ సెంటర్ వస్తున్నది. భద్రత, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ, డేటా రిడెండెన్సీ కోసం గూగుల్ ఈ మూడు ప్రదేశాల మోడల్‌ను ఎంచుకుంది.
డేటా సెంటర్ నిర్మాణం అనేది ఒక ‘డిజిటల్ ఫోర్ట్రెస్’. వేలాది సర్వర్ల బరువును భరించే శక్తి, నిరంతర విద్యుత్ సరఫరాను తట్టుకునే ఇన్సులేషన్, క్లిష్టమైన కూలింగ్ వ్యవస్థల సమాహారం. సుమారు 80లక్షల చదరపు అడుగుల బిల్ట్–అప్ విస్తీర్ణంతో సుమారు 70 లక్షల బస్తాల కంటే ఎక్కువ సిమెంట్, 2లక్షల టన్నుల స్టీల్‌తో పాటుగా ఫైర్–ప్రూఫ్ ఇన్సులేషన్ మెటీరియల్స్, వేలాది కిలోమీటర్ల కాపర్ కేబుల్స్ దీనికి వాడతారు. సిమెంట్, స్టీల్‌పై ఉన్న 18శాతం జీఎస్టీ నిబంధనల ప్రకారం, కేవలం నిర్మాణ దశలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు రూ.4 వేల కోట్ల పైన ఆదాయం జీఎస్టీ పన్నుల రూపంలో లభిస్తుంది. ఇది స్థానిక విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, రాష్ట్రంలోని సిమెంట్ పరిశ్రమలకు గతంలో లేని భారీ ఆర్డర్లను తెచ్చిపెడుతుంది. డేటా సెంటర్ సర్వర్ల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ప్రతి ఐదేళ్లకు ఒకసారి గూగుల్ ఈ పాత సర్వర్ల స్థానంలో కొత్త తరం ఏఐ చిప్స్‌ను మళ్ళీ కొనుగోలు చేయాలి. ఈ ‘రిఫ్రెష్ సైకిల్’ వల్ల రాష్ట్రానికి రికరింగ్ జీఎస్టీ రూపంలో భారీ లబ్ధి చేకూరుతుంది. ఇది ఏ ఇతర పరిశ్రమలోనూ సాధ్యం కాని రికరింగ్ రెవెన్యూ.
నిరంతరం వేడిని విడుదల చేసే డేటా సెంటర్ల సర్వర్లను చల్లబరచడానికి 1 గిగావాట్ సామర్థ్యానికి రోజుకు దాదాపు 35 మిలియన్ లీటర్ల నీరు అవసరం. విశాఖ నగర తాగునీటిపై భారం పడకుండా గూగుల్ పర్యావరణ స్పృహతో అప్పికొండ సమీపంలో ఏర్పాటు చేసే భారీ డీశాలినేషన్ ప్లాంట్ ద్వారా సముద్రపు నీటిని శుద్ధి చేసి వాడుకుంటారు. నగరంలోని మురుగునీటిని అత్యున్నత స్థాయిలో శుద్ధి చేసే ‘టెర్షియరీ వాటర్ ట్రీట్మెంట్’ ద్వారా కూలింగ్ అవసరాలు తీరుస్తారు కాబట్టి తాగునీటిని వాడుకొనే అవసరం ఉండదు. వాటర్ పాజిటివ్ కావడానికి 2030 నాటికి తాను వాడే ప్రతి లీటర్ నీటికి బదులుగా, అంతకంటే ఎక్కువ నీటిని భూగర్భంలోకి పంపడం లేదా స్థానిక చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రకృతికి తిరిగి ఇస్తామని గూగుల్ హామీ ఇచ్చింది.
గూగుల్ తన సోలార్ ఉత్పత్తి ద్వారా ఒక విద్యుత్ విప్లవాన్ని సృష్టిస్తోంది. గూగుల్ డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ డిస్కామ్ లైసెన్స్ మంజూరు చేసింది. విశాఖలో గూగుల్ తన 1 గిగావాట్ అవసరాల కోసం 15వేల కోట్లతో 3 గిగావాట్ల నుంచి 4 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెడుతున్నది. ప్యానెళ్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కొనుగోలుపై ప్రభుత్వానికి రూ.2,100 కోట్ల జీఎస్టీ లభిస్తుంది.
కోడింగ్ నుంచి క్షేత్రస్థాయి వరకు ఐటీ ఉద్యోగాలు చూస్తే, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 1.88 లక్షల నుంచి 2.10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గూగుల్ డీపీఆర్ పేర్కొంటోంది. ఇన్–షాప్ ఉద్యోగాలుగా, సుమారు 10 వేల మంది నిపుణులు నేరుగా గూగుల్ క్యాంపస్ లోపల అత్యున్నత సాంకేతికతతో పనిచేస్తారు. గూగుల్ జెమిని ఏఐ మోడల్స్ నిర్వహణ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులైన వీరి సగటు వార్షిక వేతనం రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్యలో ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇంజనీర్లు 3 వేల మంది ఈ 1 గిగావాట్ విద్యుత్ లోడ్‌ను, సంక్లిష్టమైన కూలింగ్ సిస్టమ్స్‌ను పర్యవేక్షిస్తారు. సబ్–సీ కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్ వద్ద పని చేస్తూ, ఇంటర్నల్ సర్వర్ కనెక్టివిటీ చూసే నెట్‌వర్కింగ్ ఎక్స్‌పర్ట్స్ నిపుణులు వీరు.
ప్లాంట్ బయట ఉద్యోగాలు చూస్తే, వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ల నిర్మాణంలో సుమారు 45 వేల మంది సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, కార్మికులు అవసరం అవుతారు. సర్వీస్, సపోర్ట్ రంగంలో డేటా సెంటర్ చుట్టూ ఏర్పడే హోటళ్లు, రవాణా, క్యాటరింగ్, సెక్యూరిటీ, హౌసింగ్ రంగాల్లో సుమారు 1,50,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ గూగుల్ ప్రాజెక్ట్ అతిపెద్ద బలం మల్టిప్లైయర్ ఎఫెక్ట్. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం... ఒక డేటా సెంటర్ డైరెక్ట్ ఉద్యోగం స్థానికంగా కనీసం 15 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. విశాఖలో గూగుల్ పెట్టే ప్రతి రూపాయి, స్థానిక కిరాణా దుకాణం నుంచి సాఫ్ట్‌వేర్ స్టార్టప్ వరకూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.
విశాఖను ‘గ్లోబల్ డిజిటల్ హబ్’గా మార్చే అసలు శక్తి, సముద్రం అడుగున ఉండే కేబుల్స్. గూగుల్ వేయబోయే ‘‘అమెరికా– ఇండియా– కనెక్ట్’’ సబ్–సీ కేబుల్స్ విశాఖను సింగపూర్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికాలతో నేరుగా కలుపుతాయి. సముద్ర గర్భంలో కేబుల్ వేయడం, ల్యాండింగ్ స్టేషన్ల నిర్మాణం, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 500 మంది మెరైన్ ఇంజనీర్లు పనిచేస్తారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా చెన్నై లేదా ముంబై మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విశాఖలోనే ‘ల్యాండింగ్ స్టేషన్’ ఉండటం వల్ల డేటా ట్రాన్స్‌మిషన్ వేగం (Latency) విపరీతంగా పెరుగుతుంది. ఇది హై–స్పీడ్ గేమింగ్, ఏఐ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీలను విశాఖకు ఆకర్షిస్తుంది. గూగుల్ రాకతో విశాఖలో అవకాశం ఉన్న రంగాల్లో ముఖ్యమైనవి చిప్ డిజైన్, ఏఐ రీసెర్చ్, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ అనే నాలుగు స్తంభాలపై ఒక బలమైన ఎకో–సిస్టమ్‌ను నిర్మిస్తూ విశాఖను ఒక దశాబ్ద కాలంలో దేశంలో సంపన్న నగరాల్లో ఒకటిగా నిలబెడుతుంది.
గూగుల్ కేవలం ఒక కంపెనీ కాదు, అది ఒక ఎకో సిస్టమ్. గూగుల్ ఎక్కడ ఉంటే అక్కడకు ఇతర కంపెనీలు వరుస కడతాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి గూగుల్ విశాఖలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లను నడపనుంది. దీనివల్ల విశాఖలోని ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచ స్థాయి ఏఐ శిక్షణను స్థానికంగానే పొందుతారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం అనేది ఒక ఒంటరి ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక టెక్నాలజీ మ్యాగ్నెట్. సిలికాన్ వ్యాలీ లేదా సింగపూర్ వంటి నగరాల్లో, గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్ ఎక్కడ ఉంటే, దానికి అనుబంధంగా పనిచేసే వందలాది ఇతర కంపెనీలు అక్కడ చేరాయి.
‘డెస్టినీ సిటీ’ అని చెప్పబడే విశాఖ కేవలం పోర్ట్ సిటీ లేదా టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, విశాఖ ఇకపై భారతదేశపు ‘సిలికాన్ కోస్ట్’ కూడా. నేడు వేయబోయే ఈ పునాదిరాయి ఆంధ్రప్రదేశ్ యువత కలలకూ, రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకూ బలమైన భరోసా కల్పిస్తుంది. గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్ ఒక రాష్ట్రాన్ని ఎంచుకుందంటే, అక్కడ సుస్థిర పాలన, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పడమే. విశాఖ తీరంలో మొదలవ్వబోతున్న ఈ డిజిటల్ యజ్ఞం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక కీలక మైలురాయి.
నీలయపాలెం విజయ్‌కుమార్
జాతీయ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ
ఈ వార్తలు కూడా చదవండి..
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్
కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్
For More AP News And Telugu News