Share News

Panchayati Raj Reforms: కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు మహర్దశ

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:48 AM

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్ముడి మాటలను స్ఫూర్తిగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను బలోపేతం...

Panchayati Raj Reforms: కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు మహర్దశ

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్ముడి మాటలను స్ఫూర్తిగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను బలోపేతం చేస్తోంది. గ్రామాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం, గ్రామీణుల అవసరాలూ వారి సమస్యలను గుర్తించడం, వాటిని సహేతుకంగా పరిష్కరించడం అనే పంచాయతీ పాలన ప్రాథమిక లక్ష్యాలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను సర్పంచులకు కూడా తెలియకుండా దారి మళ్లించే నయవంచక పోకడలు గత ప్రభుత్వంలో జరిగాయి. స్థానిక ప్రభుత్వాల పీక నులిమే ఇటువంటి పెడ పోకడలకు స్వస్తి పలుకుతూ రాజ్యాంగబద్ధమైన విధులు, అధికారాలతో పంచాయతీలను పరిపుష్టం చేసే మౌలిక సంస్కరణలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 35 సంవత్సరాల క్రితం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు ఇచ్చిన జీవోను మార్చేసి, నిధులు భారీగా పెంచుతూ కొత్తగా జీవో విడుదల చేసింది. 5 వేల జనాభా కంటే తక్కువగా ఉన్న పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు, 5 వేల జనాభా దాటిన పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు నిధులు పెంచింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఒకేరోజు 13,326 పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డ్స్ యూనియన్ తన రికార్డ్స్‌లో నమోదు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గత ఏడాది చేపట్టిన పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్ణీత సమయానికి పూర్తిచేశారు. రైతులకు అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించారు. 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు చేయూతనిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది చేపట్టిన ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో రూ.6,500 కోట్లతో వివిధ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 1,107 పంచాయతీల్లో 55 కి.మీ మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. కొన్ని పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రెయిన్లు మిగతా పంచాయతీలకూ విస్తరిస్తున్నారు. పీఎం జన్మన్ పథకం, నరేగా నిధుల సాయంతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 12,999 రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. రూ.2,123 కోట్లతో 4,007 కి.మీ మేర పల్లె రోడ్లను నిర్మించనున్నారు. 157 నియోజకవర్గాల్లోని 484 మండలాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను తీర్చేందుకు రూ.1,000 కోట్లతో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డోలీమోతల రహిత మన్యం ప్రాంతాన్ని లక్ష్యంగా పెట్టుకొని సుదూర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారు.


ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికీ రక్షిత నీరు లక్ష్యంగా జలజీవన్ మిషన్ పనులు రాష్ట్రంలో ఊపందుకునేలా కార్యక్రమాలు చేపట్టారు. గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించి జలజీవన్ లక్ష్యాలను దెబ్బతీసి, నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తితే... కూటమి ప్రభుత్వ అభ్యర్థనతో జలజీవన్ మిషన్ నిర్దేశిత గడువును కేంద్రం నాలుగేళ్లు పొడిగించింది. పథకం విస్తరణలో భాగంగా ఏడాదిలో ఐదు జిల్లాలలో రూ.7,910 కోట్ల విలువైన పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవి పూర్తయితే కోటి మందికి దాహార్తి తీరుతుంది. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన పొట్టి శ్రీరాములును సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేశారు. రూ.3,050 కోట్లతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సురక్షిత తాగు నీరందించే అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో శంకుస్థాపన చేశారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయడంతో పాటు, ప్రజలలో సంతృప్తస్థాయి పెంచే విధంగా మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేయడం ఆహ్వానించదగ్గది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం ఆయన చేస్తున్న కృషి ఫలితమే. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో శక్తి, సామర్థ్యాలు పెంచడంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఈ శాఖల విషయంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ... డిప్యూటీ సీఎం చొరవతో అగ్రస్థానానికి ఎదిగింది. స్వాతంత్ర్యానంతరం ఎప్పుడూ చేపట్టని సంస్కరణలను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ శాఖలో డీపీవో, జడ్పీ, గ్రామ పంచాయతీలు... ఇలా మూడు రకాలుగా ఉన్న వ్యవస్థలను ఏకం చేయడం ద్వారా పాలనను సులువు చేశారు. దీంతో పాటు గ్రామ సచివాలయాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది కీలకం కావడంతో మరిన్ని అవకాశాలు ఈ శాఖ ఉద్యోగులకు దక్కాయి. గత ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకోవడంలో విఫలమైంది. కూటమి ప్రభుత్వం వారి సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియారిటీకి, సిన్సియారిటీకి ప్రాధాన్యమిస్తూ ఈ శాఖలో 10వేల మందికి పైగా పదోన్నతులు లభించాయి. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామ సచివాలయాల్లో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించడంతో పదోన్నతులకు అవకాశం ఏర్పడింది. తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించడంతో పాటు 77 డీడీవో కార్యాలయాలు ప్రారంభించారు. పంచాయతీల్లో క్లస్టర్ విధానాలను రద్దు చేసి, గ్రేడ్లుగా విభజించి ప్రతీ పంచాయతీల్లోనూ కార్యదర్శులను నియమించారు. జడ్పీ సీఈవోలకు తొలిసారి పదోన్నతులు కల్పించారు.


వీధి దీపాలు, పారిశుధ్యం, రక్షిత మంచినీరు, విద్య, ఆరోగ్యం, స్థానిక వనరుల నిర్వహణ వంటి పనులన్నీ స్థానికంగా సంస్థలే నిర్వహించుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు పైస్థాయిలో చేయాల్సిన పెద్ద పనుల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించి స్థానిక ప్రభుత్వాల్లో గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేస్తోంది. ప్రతీ సమస్యకు సులభ పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలకు కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కావలసిందల్లా చిత్తశుద్ధి, సంకల్పబలం, మంచిపాలన, నిజాయితీతో కూడిన రాజకీయం, సేవ చేసే యంత్రాంగం. రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న ఈ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి సత్ఫలితాలు సాధించవచ్చో కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి..

కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

For More AP News And Telugu News

Updated Date - Jan 08 , 2026 | 12:48 AM