వెనక్కి నడుస్తోన్న కాలచక్రం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:58 AM
భవిష్యత్తును నూటికినూరుపాళ్లూ ఊహించటం కష్టం! నాయకుల ప్రవర్తనలు, రాజకీయ పరిణామాల విషయంలో అది మరింత నిజం! సమకాలీన పరిస్థితులను ఎంతో సునిశిత పరిశీలనాశక్తితో...
భవిష్యత్తును నూటికినూరుపాళ్లూ ఊహించటం కష్టం! నాయకుల ప్రవర్తనలు, రాజకీయ పరిణామాల విషయంలో అది మరింత నిజం! సమకాలీన పరిస్థితులను ఎంతో సునిశిత పరిశీలనాశక్తితో చూసేవారు కూడా భవిష్యత్తు పరిణామాల్లో కొన్నిటినే అంచనావేయగలరు. జరిగిన చరిత్రను లోతుగా మధించి, జరుగుతోన్న చరిత్రనూ సమగ్రంగా అవగాహన చేసుకుంటున్నప్పటికీ భవిష్యద్దర్శనానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాలు అంచనాలను తారుమారు చేస్తాయి. కానీ కొన్ని పరిస్థితులు కొంతకాలం ఒకే ఒరవడిలో బలంగా కొనసాగుతూ ఉంటే భవిష్యత్తు రూపురేఖలు కాస్త స్పష్టంగానైనా తెలుస్తాయి.
ప్రొఫెసర్ చాల్మర్స్ జాన్సన్ 19 ఏళ్లక్రితం ‘నెమిసిస్’ (కర్మఫలం) అనే పేరుతో ప్రచురించిన పుస్తకంలో చేసిన విశ్లేషణే ఇందుకు నిదర్శనం. 1945 తర్వాత అమెరికా తన ఆధిపత్య విస్తరణ కోసం చేసిన అనేక అమానవీయ, అప్రజాస్వామ్య నిర్వాకాలకు కర్మఫలితాలను అనుభవిస్తోందనీ, ఒక్కొక్కటిగా అవన్నీ కళ్లముందు రూపుకడుతున్నాయనీ జాన్సన్ విశ్లేషించారు. ఆయన అంతటితో ఆగలేదు. అమెరికన్ సామ్రాజ్యవాదానికి చివరిరోజులు సమీపిస్తున్నాయని భవిష్యద్దర్శనంలాగా అంచనా వేశారు. ఆయన చేసిన పదునైన సూత్రీకరణలనూ, వ్యాఖ్యలను చూస్తే అవి ఎంతగా ఇప్పటి పరిస్థితులకు సరిపోతాయో స్పష్టంగా తెలుస్తుంది. ‘నెమిసిస్’ (2007) రాసే నాటికి డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లో ఒక శక్తిగా మారతారనీ సమీప భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు అవుతారనీ ఎవరూ భావించలేదు. విచిత్రం ఏమిటంటే ‘నెమిసిస్’లో వేసిన అంచనాలన్నిటినీ శక్తివంచన లేకుండా ట్రంప్ నిజసాక్షాత్కారం చేస్తున్నారు.
‘‘ఒక దేశం ప్రజాస్వామ్యంగానో, సామ్రాజ్యంగానో ఉండగలదు. ఏకకాలంలో రెండుగా ఉండలేదు’’.
‘‘రిపబ్లిక్ వ్యవస్థ ఒకసారి సామ్రాజ్యంగా మారితే.. తిరిగి పూర్వస్థితికి చేరుకోలేని రీతిలో దాని పతనం మొదలవుతుంది’’.
‘‘అధ్యక్షపదవి అనేది రాజ్యాంగబద్ధంగా ఉండటం కాకుండా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని స్థాపించే సంస్థగా మారిపోతుంది’’.
‘‘సామ్రాజ్య ఆధిపత్యం కోసం చేసే ఖర్చులు కేవలం ఆర్థికపరమైనవే కావు, ప్రజాస్వామ్య జవాబుదారీతనం నాశనం కూడా వాటిల్లో భాగమే’’.
‘‘సామ్రాజ్యాలు తప్పనిసరిగా ప్రతిఘటనను సృష్టిస్తాయి’’.
‘‘చరిత్ర చెబుతున్న నిజం ఏమిటంటే ఏ సామ్రాజ్యమైనా తన ప్రజల స్వేచ్ఛను నాశనం చేయకుండా ఎక్కువకాలం ఉండలేదు’’.
నెమిసిస్‌లో చేసిన ఈ సూత్రీకరణల్లో ఇప్పటి పరిస్థితులకు పూర్తిగా పొసగనిది ఒక్కటి కూడా లేదని చెప్పలేం. తీవ్రతలో తేడా ఉండొచ్చు. అన్నీ ఏదోవిధంగా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. సుంకాలపేరుతో దేశాలన్నిటినీ ఠారెత్తించటానికి తాను తీసుకుంటున్న చర్యలకూ నిర్ణయాలకూ ఆమోదముద్ర వేయకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని సుప్రీంకోర్టును ఉద్దేశించి పరోక్షంగా, ప్రత్యక్షంగా ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే న్యాయవ్యవస్థ ఎంత ఒత్తిడులకు గురవుతోందో అర్థమవుతోంది. అలాగే చట్టసభల్లో చర్చల్లేకుండా, ఆమోదం లేకుండా డిక్రీలెన్నో జారీ అవుతున్నాయి. విదేశాంగ విధానాలను విమర్శించే వారందరిపై నిఘాలు తీవ్రమయ్యాయి. విశ్వవిద్యాలయాల్లో భావప్రకటనా స్వేచ్ఛపై కట్టడులు పెరిగిపోతున్నాయి. గాజా నరమేధాన్ని విమర్శించే వారందరినీ యూదు వ్యతిరేకులుగా ముద్రవేసి వేధించటమూ ఇంకా ముగియలేదు. ప్రసారమాధ్యమాలపై ఎదురుదాడులూ సాధారణమయ్యాయి. బయటదేశాలపై చూపిస్తున్న సామ్రాజ్యవాద పోకడలతో అంతర్గతంగా ప్రజాస్వామ్యం బలహీనమవుతున్న పరిణామాలకు ఇవన్నీ నిదర్శనాలు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్–మాగా) మార్చటానికంటూ చేపడుతున్న ప్రతిచర్యా సామ్రాజ్యవాద ధోరణులకు పెద్దపీట వేస్తుంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నోరెత్తలేని స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల నుంచీ, సంస్థల నుంచీ వైదొలగటమే కాకుండా అవన్నీ అమెరికా ప్రయోజనాలకు అడ్డంకిగా మారాయని పదేపదే విమర్శలు చేయటంతో ప్రపంచమే ఇటీవలకాలంలో ఎరగని రాజకీయ సంక్షోభంలోకి జారుకుంటోంది. ‘మాగా’ అనేది అసలుసిసలైన జాతీయవాదమనీ దానికి అనుగుణంగా చేపట్టే ఏ చర్యనూ విమర్శించకూడదనే వైఖరి ముదిరిపోతోంది. అందుకే వెనెజువెలాపై దాడినీ ఆ దేశ అధ్యక్షుడి అరెస్టునూ తప్పని చెప్పటానికి అమెరికాలోని ప్రధాన ప్రసార మాధ్యమాలన్నీ సంకోచించాయి.
దేశభక్తి, జాతిగొప్ప పేరుతో చరిత్రలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. జాతిగొప్ప పరిరక్షణ పేరుతో అసమ్మతిని అణచివేయవచ్చు. మైనారిటీలను దేశ వ్యతిరేకులుగా ముద్రవేయవచ్చు. మతాల్లోని చెడులను విమర్శించే వారిని దేశ సంస్కృతికి ద్రోహంచేసే మహాపాపులుగా చిత్రీకరించవచ్చు. జాతి ఆధిక్యత కోసం విదేశీ భూభాగాలపై అనుచితంగా హక్కులనూ కోరొచ్చు. ఖండాలపైనే సర్వాధిపత్యమూ తమదేనని చాటనూవచ్చు. జాతిభద్రత కోసం గ్రీన్‌ల్యాండ్‌ను కట్టబెట్టాలన్న దాన్ని సహజ కోరికగానూ భావించొచ్చు. అక్కడి ప్రజల ఇష్టాయిష్టాలతో పనిలేదు. మీరు డబ్బులకు అమ్ముడు పొండి.. అని గద్దిస్తే మారుమాట్లాడటానికి వీల్లేదు. మీ తలలకు వెలలు కడతాం అంటే.. సార్వభౌమత్వాన్ని వదులుకోవాల్సిందే. జాతిగొప్ప భావనలతో ఊగిపోయే నేతలకు పర్యావరణం పట్టదు. ఆర్కిటిక్ మంచు మహాఫలకాలు కరిగిపోయి, జలప్రవాహాలు ఏర్పడి, కొత్త సముద్రమార్గాలు ఏర్పడుతుంటే ప్రాకృతిక విపత్తులుగా అవి అనిపించవు. ఖనిజాలు (25–34 రకాల విలువైనవి), చమురు అన్వేషణలకు భారీ అవకాశాలుగానే అవి కనపడతాయి. పర్యావరణ బీభత్సాన్ని ఎదుర్కోవాలన్న తపన ఏ కోశానా ఉండదు. మానవాళికి కలిగే సమష్టిముప్పు గురించి గ్రహింపు ఉండనే ఉండదు. పశ్చిమార్ధగోళంలో గ్రీన్‌ల్యాండ్ ఉంది కాబట్టి దానిపై సహజ ఆధిపత్యం అమెరికాకే దక్కాలని వాదిస్తారు. వలసపాలన (1820లు) నుంచి విముక్తమై అప్పుడప్పుడే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న అమెరికాఖండ దేశాల్లో యూరపు సామ్రాజ్యశక్తుల జోక్యం వద్దని నిర్దేశించిన రెండువందల ఏళ్లనాటి మన్రో సిద్ధాంతాన్ని పైకితెచ్చి దానికి డొన్రో సిద్ధాంతంగా కొత్తపేరుపెట్టి పశ్చిమార్ధగోళంలోని ఏ భాగంలోనైనా సైనికంగా వేలుపెట్టే హక్కు ఉందనీ దర్జాగా ప్రకటిస్తారు.
కెనడా మినహా పశ్చిమార్ధగోళంలో అన్ని దేశాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఆధిపత్యం కోసం అమెరికా జోక్యం చేసుకుంది. ఇప్పుడా పరిస్థితి పోయింది. అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ఆహ్వానాలనూ, ఆ తర్వాత అలా చేరితే మీకే మంచిదన్న హెచ్చరికలనూ కెనడా అందుకోవాల్సి వచ్చింది. అవమానభారంతోనూ ఆగ్రహంతోనూ ఉన్న కెనడా చైనాతో బహుముఖ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోటానికి నడుంకట్టింది. ట్రంప్‌కు అది ఆగ్రహాన్ని తెప్పించింది. 100 శాతం సుంకాలు తప్పవన్న హెచ్చరిక వెంటనే జారీ అయ్యింది. ట్రంప్ ఆరోపిస్తున్నట్లుగా గ్రీన్‌ల్యాండ్ పరిసరాల్లో చైనా, రష్యాలు కొత్తగా కార్యక్రమాలను ముమ్మరం చేయలేదు. ఒకవేళ చేసినా వాటితో చర్చలు జరిపి అంగీకారానికి రావొచ్చు. ఆ పని చేయకుండా గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో కలిపివేయాలని డిమాండు చేయటమే అసంబద్ధంగా ఉంది. అమెరికాకు పక్కనే గ్రీన్‌ల్యాండ్ ఉంటే అలా కలపమనటానికి కనీసం అర్థమైనా ఉంటుంది. అలాస్కా నుంచి లెక్కవేసుకున్నా రెండు దేశాల మధ్య దూరం 3,952 కిలోమీటర్లు ఉంది. ఐక్యరాజ్యసమితి నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా స్వయంప్రతిపత్తి ఉన్న ఒక ప్రాంతంపై అగ్రరాజ్యం సార్వభౌమిక ఆధిపత్యం కావాలని పట్టుపట్టటం ఇదే మొదటిసారి. నాటోలో సాటి సభ్యదేశం ప్రాదేశిక సమగ్రతను కాపాడాల్సిన అమెరికా దానికి వ్యతిరేకంగా వ్యవహరించటం, అందుకు యూరప్ యూనియన్ ససేమిరా అనటం అంతర్జాతీయ రాజకీయాలను సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. నిజానికి 1951లో అమెరికా–డెన్మార్క్ మధ్య కుదిరిన ఒప్పందంతో అవసరమనుకుంటే అక్కడ సైనికబలగాన్ని పెంచే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఒకప్పుడు అక్కడ పదివేల మంది అమెరికన్ సైనికులు ఉండేవారు. 1990ల నుంచి ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం అక్కడ 200 మంది మాత్రమే ఉన్నారు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత నాటో దేశాలకు రష్యా నుంచి ముప్పు ఉండదని గ్రహించిన తర్వాతే అక్కడ బలగాలను తగ్గించారు. నిజానికి జర్మనీ ఏకీకరణ సమయంలో తూర్పు యూరపులో ఒక్క అడుగు కూడా నాటో విస్తరణ ఉండదని ఇచ్చిన హామీని విస్మరించటంతో రష్యానే అభద్రతలోకి వెళ్లింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ఇదీ ఒక కారణమే.
చైనాకు దగ్గర అవుతుందనే ఆలోచనతో వెనెజువెలాపై దాడిచేసి, ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకువెళ్లారు. ఆ దేశ చమురు, సహజవాయువు వ్యవహారాలను నియంత్రించటమే తమ అసలు లక్ష్యమని కూడా అమెరికా నేతలు ప్రకటించారు. ఇక ఆర్కిటిక్ ప్రాంతానికి తాము దగ్గరవుతున్నట్లుగా పేర్కొంటూ ‘పోలార్ సిల్క్‌రోడ్’ అనే భావనను విపులీకరిస్తూ చైనా 2018లో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నిజానికి ఆర్కిటిక్ ప్రాంతం చైనాకు చాలా దూరం. రష్యాకు మాత్రం దగ్గర. రష్యాతో కలిసి చైనా ఆ ప్రాంతంలో కార్యకలాపాలకు పాల్పడుతుందనే భావన ఆ శ్వేతపత్రంతో కలిగింది. అప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను చేజిక్కించుకోటానికి అమెరికా పావులను వేగంగా కదుపుతోంది.
పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎన్నో దేశాల్లో సైనికంగా జోక్యం చేసుకుని, తిరుగుబాట్లకు ఊతమిచ్చిన అమెరికా ఒకప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ, కమ్యూనిస్టు ప్రాబల్య నియంత్రణ పేరుతో వాటిని సమర్థించుకునేది. ఇప్పుడు ఆ సమర్థనలూ లేవు. ఆ ప్రజాస్వామ్య ఆదర్శ ప్రకటనలూ లేవు. తాను ప్రధాన భాగస్వామిగా ఉండి సృష్టించిన అంతర్జాతీయ సంస్థలనూ, ఏర్పరిచిన నిబంధనలనూ, రూపొందించిన చట్టాలనూ కాలదన్నుతూ తన ఆధిపత్యానికి అడ్డుగా ఉన్నాయని భావిస్తున్న అన్నిటినీ తోసిపుచ్చటమే ప్రవృత్తిగా మారుతోంది. అందుకే రెండో ప్రపంచయుద్ధం (1945) అనంతరం ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోతోందంటూ ఎన్నో వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.
విపరీత అధికారాలను చలాయించే నేతలను నియంత్రించలేని అశక్తతకు పలుదేశాల్లో వ్యవస్థలన్నీ చేరుకుంటున్నాయి. ఒక వ్యవస్థ దారితప్పితే మరో వ్యవస్థ పరిస్థితిని చక్కదిద్దటం తగ్గిపోతోంది. జనాకర్షణ నేతలు ప్రజాస్వామ్యానికి బలం అనుకునే రోజులూ పోతున్నాయి. సామాజిక మాధ్యమాల ఆసరాతో, జనాకర్షణ నినాదాలతో ప్రజాస్వామ్య పద్ధతులను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి, వాటికే ఎసరుపెట్టటం పెద్దస్థాయిలో మొదలైంది. ‘నేనే ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్యమే నేను’ అనే నియంతృత్వ పోకడ 1945 ముందునాటి ప్రపంచానికి మనల్ని తీసుకువెళుతున్న దృశ్యం లీలామాత్రంగా ప్రస్తుతం కనపడుతోంది. అది బలపడితే జరిగేది ఆనాటి ఘోర చరిత్ర పునరావృతమే! సామ్రాజ్యాలు తప్పనిసరిగా ప్రతిఘటననూ సృష్టిస్తాయని జాన్సన్ చెప్పినదే నిజమైతే ఆశనిరాశల్లో మొదటిదానికే మనం మొగ్గుతాం!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News