జెన్‌జీ: కొత్త తరమా, పాత చట్రమా?
ABN , Publish Date - Aug 13 , 2026 | 04:47 AM
‘జెన్ జీ’ అన్నది ఇప్పుడు నూతన ఉత్సాహాన్ని గుర్తుకు తెచ్చే పదం. ఈ ‘జెన్ జీ’ తరానికి ఇప్పుడో హీరో వర్షిప్ ఏర్పడింది. ఈ తరం ముందు తరాల్లా కాదనీ; భిన్నమైన ఆలోచనలతో ప్రతిదాన్నీ ప్రశ్నించే తరమనీ అంతా చెప్పుకుంటున్నారు....
‘జెన్ జీ’ అన్నది ఇప్పుడు నూతన ఉత్సాహాన్ని గుర్తుకు తెచ్చే పదం. ఈ ‘జెన్ జీ’ తరానికి ఇప్పుడో హీరో వర్షిప్ ఏర్పడింది. ఈ తరం ముందు తరాల్లా కాదనీ; భిన్నమైన ఆలోచనలతో ప్రతిదాన్నీ ప్రశ్నించే తరమనీ అంతా చెప్పుకుంటున్నారు.
ప్రతి ఉద్యమం ఏదో ఒక తాత్కాలిక లక్ష్యంతోనే మొదలవుతుంది. కానీ అది వదిలివెళ్లే పాదముద్రలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. మన స్వాతంత్ర్యోద్యమం మొదలుకొని, చైనా సాంస్కృతిక విప్లవం దాకా ఎన్నో ఉద్యమాలు తాత్కాలిక విజయం కోసమే పని చేసినప్పటికీ, తదనంతరం ఆయా సమాజాల్లోని విలువలను ఎలా తలకిందులు చేశాయో చూశాం. ప్రతి ఉద్యమం తెచ్చే మార్పు ఆహ్వానించదగ్గదే. అయితే ఆ ఉద్యమం ప్రకటించిన భావనలు, విధానాలు, తీరుతెన్నులు... ప్రతి ఒక్కటీ సరైనదే అని మాత్రం చెప్పలేం. కార్పొరేట్ పరిభాషలో చెప్పాలంటే– ప్రొడక్ట్ మంచిదే కావచ్చు, కానీ అది తయారు చేయడానికి వాడిన టెక్నాలజీ కలగజేసిన వాతావరణ కాలుష్యం, దాని పరిణామాలు కొంతకాలం తర్వాతే తెలుస్తాయి.
జెన్ జీ అన్నది నేటి యువతరానికి వాడుతున్న పర్యాయపదం. అంటే మానవ చరిత్రలో, పుట్టుకతోనే మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీని చూస్తూ వచ్చిన మొట్టమొదటి తరం. దీని ముందుతరం ‘మిలీనియల్స్’ (1981–96 మధ్యలో పుట్టినవాళ్లు). ‘అనలాగ్’, ‘డిజిటల్’ తరాన్ని ఒకేసారి చూస్తూ దానిని ‘అడాప్ట్’ చేసుకున్న మొదటి తరం ఈ మిలీనియల్స్. వీళ్లను సాధారణంగా ‘అడాప్టబిలిటీ’కి ప్రతీకలుగా చూస్తారు. అంటే ఏ కొత్త మార్పుకైనా సులువుగా మారిపోతారు అని.
ఇంతకు ముందు కూడా యువతరాలు సమాజాన్ని ప్రశ్నించి ఉద్యమాలు చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ‘నవనిర్మాణ్ ఆందోళన్’ అని గుజరాత్‌లో 1974లో హాస్టల్ మెస్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం చివరకు అక్కడి ముఖ్యమంత్రి రాజీనామాకు దారితీసింది. తమాషాగా అదే రాజకీయ నాయకుడు చిమన్‌భాయ్ పటేల్ సొంత పార్టీని స్థాపించి (కిసాన్ మజ్దూర్ లోక్ పక్ష్) 1975 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు, ఆపై 1990లో మళ్లీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారు. అది వేరే సంగతి. తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరుండి నడిపింది అప్పటి యువతరమైన విద్యార్థులే. రోహిత్ వేముల మరణాన్ని నిరసిస్తూ నడిచింది అప్పటి తరం విద్యార్థులే. ఇలా చరిత్ర చూస్తే, ప్రతి తరమూ తమ కాలంలో ఏవో ఉద్యమాలు చేసి సంచలనాలు సృష్టించినదే. ఆ యువత తర్వాత ఎదిగి మళ్లీ అవే సామాజిక దురాచారాలను వెంటవేసుకునే తరాల్లో కలిసిపోయింది. ఇది చరిత్ర చెప్పిన నిజం.
కాబట్టి ప్రస్తుతం ‘జెన్ జీ’కి ఒక అసాధారణమైన హీరో వర్షిప్ కట్టబెట్టే ముందు ఆలోచించాల్సింది ఏమంటే– ఈ తరం ఏ విలువలను ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అన్నది. ఈ జెన్ జీ ఇంటికెళ్లాక మళ్లీ అదే ‘ఎండోగమీ’లో పడిపోయి ఎవరి కులాల పిల్లలను వాళ్లు పెళ్లి చేసుకుని, తర్వాత ఆ కులాల్లోనే పిల్లల్ని కని, కంటిన్యూ చేయడమే జరుగుతుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే– ‘జెన్ జీ’ అనేది ఒక హోమోజీనస్ గుంపు కాదు. దీనికి ఒక ఐడెంటిటీని ఆపాదించలేం. ఇది నిర్ద్వంద్వంగా ‘హెటిరోజీనస్ గ్రూప్’ (విభిన్నతల సమూహం).
ఈ ఉద్యమంలో సినిమా పాటలకు డాన్స్‌లు వేస్తూ, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేసే యువతను చూసినప్పుడు ఇది సమస్యపై తీవ్రంగా పోరాడే గుంపులా గాక, తమకుండే మూక బలాన్ని ఎంజాయ్ చేసే గుంపులా మాత్రమే కనిపించింది. ఆ వినోదం వాళ్లను ఒకటి చేసింది, వాళ్లంతా కలిసి ఒక సమస్యను ఎదుర్కొన్నారు. అది సంతోషదాయకమైన విషయం. కానీ ప్రతి ఉద్యమమూ ఒక దుఃఖ సన్నివేశం నుంచి పుడుతుంది. ఉద్యమ క్రమంలో ఆ భావావేశాన్ని వెనక్కు నెట్టివేయడం ‘జెన్ జీ’ ఏ కాదు, అది ఎవరు చేసినా అసంబద్ధమే.
ఒక మూర్ఖత్వాన్ని తృణీకరించాలంటే అందుకు సరైన మాధ్యమం వ్యంగ్యం (సెటైర్ లేదా సర్కాజం). ‘జెన్ జీ’ విషయంలో ఇది వ్యంగ్యాన్ని దాటి, బూతు రూపం కూడా తీసుకుంది, సందట్లో సడేమియా లాగా దానికి ఒక ఆమోద ముద్ర కూడా పడిపోతున్నది. ఇప్పటికిప్పుడు ‘జెన్ జీ’ ఉద్యమానికి అనుబంధంగా పుట్టిన విలువలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ విలువలను విమర్శనాత్మకంగా గమనించాల్సి ఉంది. గాంధీ పక్కన అంబేడ్కర్ ఫొటో పెట్టడంతోటే ఈ ఉద్యమంలో ఉన్న తీవ్రమైన రాజీ స్వభావం లీలగా అర్థం అవుతున్నది.
రోహిత్ వేముల మరణం తర్వాత మిలీనియల్స్ వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత పోరాటం చేశారు. కానీ అది ఒక కులానికి సంబంధించిన పోరాటంగా ఉండిపోవడం వల్ల, ఆ తరానికి హీరోయిజం ఆపాదించబడలేదు. ఇప్పుడు ‘జెన్ జీ’కి దొరికిన సింపతీని నాడు అన్యాయానికి నిర్ద్వంద్వంగా ఎదురు తిరిగి, యూనివర్సిటీ హాస్టల్స్ నుంచి వెలివేయబడ్డ మిలీనియల్స్ దక్కించుకోలేకపోయారు.
సెప్టెంబర్ 2025లో ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలను గమనిస్తే, ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అది అలా గెలిచింది ఈ ‘జెన్ జీ’ ఓట్లతోనే. ఇదే ‘జెన్ జీ’ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో కూడా ఏబీవీపీనే ఎన్నుకుంది. కాబట్టి ఈ ‘జెన్ జీ’ తరం ఇంతకుముందు తరాలకు భిన్నంగా ఏమీ లేదు, ముఖ్యంగా ఇందులో హెటిరోజినిటీని తగు మోతాదులో కలుపుకునే ఉంది.
ఈ తరాన్ని ‘ఇన్‌స్టా’ తరం అనవచ్చు. మిలీనియల్స్ ‘ఫేస్‌బుక్’ను ఆదరించినంతగా వీళ్లు ఆదరించలేదు. ఇది 2017 నుంచి కనిపించడం మొదలుపెట్టింది. రెండు నిమిషాల రీల్స్‌లో విషయం అంతా తెలియాలని తాపత్రయపడే ఈ తరానికి అనుగుణంగా మార్కెటింగ్ యాడ్స్ రూపుదిద్దుకోవడం మొదలైంది. ఈ జెన్ జీ ఇన్‌స్టా తరం పూర్తిగా డిజిటల్ యుగంలో పెరగడం వల్ల సులువైన పనులకు అలవాటుపడిన తరంగా మారింది. అలాగే ఈ తరం తమ వ్యక్తిగత ఆస్పిరేషన్స్ విషయంలో రాజీపడని తరం. ఉదాహరణకు, జెన్ జీ తమ కెరీర్ ఆరంభ దశలో ఒక ఉద్యోగంలో సగటున కేవలం 1.1 సంవత్సరాలు మాత్రమే కొనసాగుతున్నారు; మిలీనియల్స్‌కు ఇది 1.8 సంవత్సరాలు కాగా, అంతకుముందు తరం జెన్ ఎక్స్‌కు 2.8 సంవత్సరాలు. ఈ తరం హోమోజినిటీ (ఏకరూపత) కేవలం వ్యక్తిగత ఆస్పిరేషన్స్ వరకు మాత్రమే పరిమితం. ఇది సామాజిక ఆస్పిరేషన్స్‌తో కలగాపులగం చేసి మనం కన్‌ఫ్యూజ్ అవకూడదు. సామాజిక ఆశయాల విషయంలో ఈ తరం ముందు తరాల లాగానే ఒక హెటిరోజీనస్ గ్రూప్. దీని హెటిరోజినిటీని (విభిన్నతలను) గమనించిన మొదటి వ్యవస్థ ‘సంఘ్ పరివార్’. అందుకే అది ఇప్పుడు ఈ ‘జెన్ జీ’ తరాన్ని రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం చేస్తున్నది. ఇటీవల ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు కొద్ది రోజుల్లోనే యాభై లక్షల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు.
కుల ఆధారిత కంటెంట్‌ను ప్రచారం చేస్తూ ఎక్కువ ఎంగేజ్మెంట్ పొందుతున్న 30కి పైగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి 100కు పైగా రీల్స్‌ను ‘ది క్వింట్’ వెబ్‌సైట్ విశ్లేషించింది. ఆ విశ్లేషణలో ఒక విషయం స్పష్టమైంది: ఆధిపత్య కులాల ఆధిక్యత భావజాలాన్ని ఇప్పుడు సోషల్ మీడియా అల్గోరిథమ్‌లకు అనుగుణంగా, ‘గర్వం (ప్రైడ్)’ అనే పేరుతో కొత్త రూపంలో ప్రజలకు చేరవేస్తున్నారు. ఇది జరుగుతున్నదీ ‘జెన్ జీ’ తరంలోనే. అధికారాన్ని ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, మార్పు కోసం సంఘటితమవడం– ఇవి జెన్ జీ కనిపెట్టిన కొత్త సంస్కృతి కాదు. ఆధునిక భారత చరిత్రలో దాదాపు ప్రతి తరం యువత తమ కాలంలోని వ్యవస్థను సవాలు చేస్తూ ఉద్యమాలు నడిపింది. అంతకుమించి ‘జెన్ జీ’ అసామాన్యంగా సాధించింది లేదు. ఏది ఏమైనా రెండు నిమిషాల రీళ్లతో సమయం గడిపే ఈ యువతరం, ఎక్కడా కుదురుగా ఒకేచోట పనిచేసే ఓపిక లేని ఈ యువతరం, ఒక దేశ సమస్యను ఎదిరించడానికి తమ విభిన్నతలను దాటి ఒక ఏకరూప సమూహంగా ప్రగతివాదంతో ముందుకెళ్లడం జరిగితే, అప్పుడు ఈ దేశంలో నిజమైన విప్లవాన్ని ఆశించవచ్చు.
పి. విక్టర్ విజయ్‌కుమార్
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News