‘అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్’ ఆలాపన గతమేనా?
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:49 AM
ఇరవై సంవత్సరాల క్రితం ఒక విద్యా గోష్ఠిలో పాల్గొనేందుకై లాహోర్‌కు వెళ్లాను. శాస్త్రీయ సంగీత గాయకుడిగా పేరు పొందాలని అభిలషిస్తున్న ఒక యువకుడు అక్కడ నాకు పరిచయమయ్యాడు. శాస్త్రీయ సంగీతాన్ని...
ఇరవై సంవత్సరాల క్రితం ఒక విద్యా గోష్ఠిలో పాల్గొనేందుకై లాహోర్‌కు వెళ్లాను. శాస్త్రీయ సంగీత గాయకుడిగా పేరు పొందాలని అభిలషిస్తున్న ఒక యువకుడు అక్కడ నాకు పరిచయమయ్యాడు. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించేందుకు అతడు ప్రతి వారం కరాచీలోని తన ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లేవాడు. నాకు సంగీత ప్రతిభ నాస్తి. అయితే హిందుస్థానీ సంగీతంపై విశేష ఆసక్తి ఉన్నది. ఆ స్వరసుధకు నేను జీవితపర్యంతం ప్రగాఢాభిమానిని.
తన సంగీత గురువు ఒక నిర్దిష్ట రాగం గురించి చులకనగా మాట్లాడుతూ, అది హిందువుల రాగమని హేళన చేశారంటూ ఆ యువకుడు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. భారత్‌లోని శాస్త్రీయ సంగీత విద్వాంసులకు అటువంటి దురభిప్రాయాలు లేవని ఆ పాకిస్థానీకి చెప్పేందుకు నాకు మనసురాలేదు. అతడు ఎంతగానో అభిమానించే రోషనారా బేగం, పాకిస్థాన్‌లో స్థిరపడిన తరువాత కూడా శంకర, దుర్గ రాగాలను ఆలపించడం కొనసాగించారనీ చెప్పలేకపోయాను. ఆ రాగాలకు హిందూ దేవతల పేర్లు ఉన్నప్పటికీ ఆమె వాటిని ఆలపించేవారని కూడా అనలేకపోయాను. పాకిస్థాన్‌లో నివసించే సలామత్ అలీఖాన్ గానం చేసిన ఠుమ్రీ ‘నదియా కినారే మోరా గావ్’ గురించి కూడా నేను ప్రస్తావించి ఉండాల్సింది.
నిన్నటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, నేటి ప్రైమ్ మినిస్టర్స్ మెమోరియల్ లైబ్రరీలో గాంధీకి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు లాహోర్‌లో నాటి సంభాషణ గుర్తుకు వచ్చింది. లైబ్రరీలో ఉన్న గాంధీ పేపర్స్ చాలావరకు స్వాతంత్ర్య సమరయోధుడిగా, సాంఘిక సంస్కర్తగా ఆయన చేసిన కృషికి సంబంధించినవే. అయితే ఆశ్చర్యంగా శాస్త్రీయ సంగీత విద్వాంసులతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్న ఫైల్ ఒకటి నా దృష్టికి వచ్చింది. 1944 నవంబర్‌లో ప్రముఖ హిందుస్థానీ గాయకుడు ఓంకార్‌నాథ్ ఠాకూర్ గాంధీకి రాసిన లేఖ ఒకటి ఆ ఫైల్‌లో ఉంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మ్యూజిక్‌ను ప్రారంభించేందుకు మహాత్ముని సహాయాన్ని కోరుతూ ఠాకూర్ రాసిన లేఖ అది. ‘ప్రతిపాదిత ఫ్యాకల్టీ భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సమస్త సంప్రదాయాలను క్రమబద్ధంగా అధ్యయనం చేస్తుంది. ఏ శైలి పట్లా ఎటువంటి పక్షపాతం లేదా వివక్ష చూపడం జరగదు. భారతీయ సాంస్కృతిక జీవనంలో సంగీతానికి ఉన్న ప్రముఖ స్థానం, భారతీయ నాగరికతలో మిళితమైన వివిధ ప్రవృత్తులు, ధోరణులను సమన్వయం చేయడంలో శాస్త్రీయ సంగీతానికి ఉన్న విలువ, ప్రాధాన్యం అందరికీ తెలిసినవే’నని ఠాకూర్ పేర్కొన్నారు.
ఠాకూర్ ప్రతిపాదనను విస్తరిస్తూ దక్షిణ భారతీయ సంగీతవేత్త పరూర్ సుందరం అయ్యర్ రాసిన లేఖ కూడా ఆ ఫైల్‌లో ఉన్నది. కర్ణాటక సంగీత విద్వాంసుడు అయిన ఈ మలయాళీ, విష్ణుదిగంబర్ పలూస్కర్ నెలకొల్పిన ‘గాంధర్వ మహా విద్యాలయం’ అనే సంగీత పాఠశాలలో బోధించేందుకు అప్పట్లో బొంబాయిలో ఉన్నారు. ఆ పాఠశాలలో ఓంకార్‌నాథ్ ఠాకూర్, నారాయణరావు ఖరే మొదలైనవారు అయ్యర్ సహచర అధ్యాపకులు. ఖరే ఆ తరువాత గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో సంగీత ఉపాధ్యాయుడిగా ఉన్నారు. 1944 నవంబర్ 7న గాంధీజీకి అయ్యర్ రాసిన లేఖలో సంగీత సంప్రదాయాల అధ్యయనంలో తన ఆసక్తులు, సంగీతవేత్తగా తన శిక్షణ నేపథ్యాల గురించి రాస్తూ... ‘1927లో కాంగ్రెస్ మహాసభ సందర్భంగా మీరు మద్రాసులో ఉన్నప్పుడు, మిమ్ములను నా వయొలిన్‌తో ఉల్లాసపరిచిన గౌరవం నాకు దక్కింది’ అని పేర్కొన్నారు. ఆ తరువాత ఇలా రాశారు– ‘భారతదేశానికి ఒక సంగీత విశ్వవిద్యాలయం అవసరం. దానిని ఏర్పాటు చేయడమనేది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న వివిధ సంగీత మహాసభల కార్యక్రమాలకు తలమానికం అవుతుంది. కనుక ఒక సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మీరు తోడ్పడాలి’. అయ్యర్ ఇంకా ఇలా రాశారు– ‘మీ ఆశీస్సులు ఉంటే ఏదైనా గొప్పగా సఫలమవుతుంది. హిందువులు, ముస్లింల మధ్య సహోదరభావాన్ని నెలకొల్పేందుకు సంగీతం ప్రభావశీలంగా తోడ్పడుతుంది. హిందూ, ముస్లిం గాయకులు ఎటువంటి వివాదాలకు తావులేకుండా న్యామత్ ఖాన్ (సదారంగ గా సుప్రసిద్ధుడు), కబీర్, తులసి, మీరా గీతాలను గానం చేస్తున్నారు’. అయ్యర్ తన లేఖను ఇలా ముగించారు– ‘మహాత్మాజీ త్వరలోనే సంగీత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, మన మహోదాత్త సంగీత సంస్కృతి గౌరవాన్ని కాపాడతారని ఆశిస్తున్నాను. విశ్వవిద్యాలయం ప్రారంభమైన వెంటనే హిందూ ముస్లిం ఐక్యత సత్వరమే విస్తరిస్తుంది. మనకు శీఘ్రగతిన స్వరాజ్యం సిద్ధిస్తుంది’.
ఓంకార్‌నాథ్ ఠాకూర్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఒక సమన్వయకర్తగా అభివర్ణించగా అయ్యర్ అది హిందూ–ముస్లిం ఐక్యతకు ఒక ముఖ్య సాధనమని స్పష్టంగా పేర్కొన్నారు. అయ్యర్ తన సొంత జీవితానుభవాలతోనే ఈ మాట చెప్పారు (కిరాణా ఘరానా ఉస్తాద్ అబ్దుల్‌కరీమ్‌కు ఆయన గొప్ప అభిమాని మాత్రమే కాకుండా బాగా సన్నిహితుడు కూడా). దురదృష్టవశాత్తూ అయ్యర్ లేఖకు గాంధీ ప్రత్యుత్తరమిచ్చిన దాఖలాలు కనిపించలేదు. ఠాకూర్ లేఖకు మాత్రం క్లుప్తంగా సమాధానమిచ్చారు. రాజకీయ ప్రాపకం, కార్పొరేట్ నిధులతో సంగీతం వర్ధిల్లదని, ఒక సంస్థలో సహజసిద్ధంగా మాత్రమే ఆ గాంధర్వ కళ వికసిస్తుందని, ఈ విషయంలో రవీంద్రుని శాంతినికేతన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఠాకూర్‌కు గాంధీ సూచించారు.
గాంధీ 1948లో కీర్తిశేషుడు అయ్యారు. రెండు సంవత్సరాల అనంతరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మ్యూజిక్ (సంగీత అధ్యయన విభాగం) ఏర్పాటయింది. ఓంకార్‌నాథ్ ఠాకూర్ ఆ ఫ్యాకల్టీ ప్రధానాచార్యుడు. అదే కాలంలో సుందరం అయ్యర్ మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా సంగీత అధ్యయనాలను సమున్నతం చేస్తున్నారు. ఇదిలావుండగా కర్ణాటక సంగీత సంప్రదాయంలో సుశిక్షితురాలు, యువ వాయులీన (వయొలిన్) విద్వాంసురాలు ఒకరు ఠాకూర్ విద్యార్థి అయ్యేందుకు బనారస్‌కు వెళ్లారు. ఆయన మార్గదర్శకత్వంలో సంగీత శిఖరాలను అధిరోహించడమే ఆ యువ సంగీత విద్వాంసురాలి లక్ష్యం. ఆ గాంధర్వి ఎన్.రాజం. అష్టపదుల వయసులో ఉన్న రాజం ఇప్పటికీ సంగీత కచేరీలు నిర్వహిస్తూ స్వరలయల రసికులను అలరిస్తున్నారు. సజీవ భారతీయ శాస్త్రీయ సంగీతకారులలో మహోన్నత వాద్య విద్వాంసురాలిగా ఎన్.రాజంకు సువిఖ్యాతి ఉన్నది.
బనారస్‌లో నివసిస్తున్న ఈ తమిళ మహిళ... ఆ పుణ్యక్షేత్ర స్థానికుడు, గంగామాయి బిడ్డ అయిన బిస్మిల్లాఖాన్‌తో కలిసి కొన్ని మరపురాని జుగల్బందీలను నిర్వహించారు. హిందూ ముస్లింల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో సంగీతం ఎంత శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందో చెప్పడానికి రాజం–బిస్మిల్లా సంయుక్త కచేరీలే (యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి) అద్భుత నిదర్శనాలు. హిందుస్థానీ సంగీతానికి షహనాయి ఎలాంటిదో కర్ణాటక సంగీతానికి నాదస్వరం అలాంటిది. బిస్మిల్లాఖాన్ సంగీత సరస్వతికి దక్షిణ భారత ప్రతిరూపం నాదస్వర విద్వాంసుడు షేక్ చిన్న మౌలానా. మౌలానా సాహెబ్ దేవాలయ పట్టణమైన శ్రీరంగంలో నివసిస్తూ నిత్యం నాదస్వర వాద్యంతో దైవార్చన చేస్తుండేవారు. గాంధీకి రాసిన లేఖలో పరూర్ సుందరం అయ్యర్ కొనియాడిన మత సామరస్యానికి ఇది మరొక నిదర్శనం.
భారతీయ శాస్త్రీయ సంగీత జగత్తులోని విశిష్ట మానవీయ అంశం మత సామరస్యం మరే ఇతర రంగంలో కంటే శాస్త్రీయ సంగీతంలోనే హిందువులు–ముస్లింలు పరస్పర సోదరభావంతో జీవించారు, కలిసి శ్రమించారు. సప్తస్వరాల సృజనసాధనల్లో కలిసికట్టుగా ద్రష్ట, స్రష్టలుగా వెలుగొందారు. హిందువులు అయిన మహోన్నత సంగీతవేత్తలు ముస్లిం ఉస్తాద్‌ల మార్గదర్శకత్వంలో సుశిక్షితులై వారికి ఎంతగానో రుణపడి ఉన్నారు. కేసరిబాయి కేర్కర్‌కు అల్లాదియా ఖాన్ ఎలాంటివారో, లేదా అల్లావుద్దీన్‌ఖాన్ పండిట్ రవిశంకర్‌కు ఎలాంటివారో శాస్త్రీయ సంగీత రసికులందరికీ తెలుసు. ముస్లింల సంగీత సృజన పద్ధతులపై హిందూ సంగీతవేత్తల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఆగ్రా ఘరానా విద్వాంసులు షరాఫత్, లతాఫత్ హుస్సేన్‌ఖాన్‌లు యమన్ రాగంలో గానం చేసిన కృతులను వినండి.. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే గానలహరులవి. వాటిలో ఒకటి ‘దర్శన్ దేవో శంకర్ మహదేవా’. ఆ కృతి ఆలాపనతో ఆ ముస్లిం గాయకులు హిందూ దేవుడైన శివుడిని తన దివ్యరూపాన్ని సాక్షాత్కరింపజేయమని ప్రార్థిస్తారు.
మన సంగీత సంప్రదాయాల విశాల, సమ్మిళిత సంస్కృతిని దేశ విభజన విచ్ఛిన్నం చేసింది. ఈ సాంస్కృతిక నష్టం మొదట పాకిస్థాన్‌లో వాటిల్లింది. శాశ్వతమైన నష్టమది. ఈ కారణంగానే యువ పాకిస్థానీ గాయనీగాయకులకు రోషనారా బేగమ్, సలామత్ అలీఖాన్‌ల సంగీతంలోని హిందూ ఇతివృత్తాల గురించి అవగాహన లేదు. ఈ అజ్ఞానాన్ని సహించలేకనే బడే గులామ్ అలీఖాన్ 1950ల్లో ముస్లింల పవిత్రభూమి నుంచి భారత్‌కు తిరిగివచ్చేశారు.
ప్రతి భారతీయుడికీ ప్రీతిపాత్రమైన బాలీవుడ్ సినిమారంగం ఇప్పుడు మోదీ ప్రభుత్వ మెజారిటేరియన్ భావజాలం ప్రభావంలోకి చాలావరకు వెళ్లిపోయింది. ఆరున్నర దశాబ్దాల క్రితం నాటి ‘హమ్ దోనో’ సినిమాలో లతా మంగేష్కర్ ఆలపించిన (సాహిర్ లూధియాన్వి గీతానికి జయదేవ్ స్వరాల కూర్పు) ‘అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్’ వంటి పాట ఈనాటి హిందీ సినిమాలలో ఉండే అవకాశమున్నదా? భారతీయ నాగరికత సాధించిన ఘన విజయాలలో మన శాస్త్రీయ సంగీతం మహోన్నతమైనది. విభిన్న సంస్కృతుల కలయికతో, అందరినీ సమ్మిళితంగా కలుపుకుపోయే స్వభావం మన శాస్త్రీయ సంగీత విశిష్టత. మరి ఈ లోకోత్తర నాదకళ హిందుత్వ సంకుచిత ధోరణుల బారినపడి తన విలక్షణ ఉనికిని కోల్పోతే అంతకంటే విషాదం మరేముంటుంది?
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలూ చదవండి:
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో