ఆందోళనా తరానికి ఆశాదీపమైత్రి!
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:03 AM
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, భీంరావ్ రాంజీ అంబేడ్కర్‌లు ఆధునిక భారతదేశ మానవతా మహా శిఖరాలు. ఒకరు రాజకీయ దాస్యం నుంచి దేశాన్ని విముక్తం చేసిన మహానాయకుడు. మరొకరు సామాజిక దాస్యాన్ని....
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, భీంరావ్ రాంజీ అంబేడ్కర్‌లు ఆధునిక భారతదేశ మానవతా మహా శిఖరాలు. ఒకరు రాజకీయ దాస్యం నుంచి దేశాన్ని విముక్తం చేసిన మహానాయకుడు. మరొకరు సామాజిక దాస్యాన్ని నిర్మూలించేందుకు అనితరసాధ్యమైన కృషి చేసిన విప్లవకారుడు. ఇరువురూ సమకాలికులే, కానీ తమ జీవితకాలంలో స్నేహితులు కారు. దేశాన్ని ఉద్ధరించడమే ఇరువురి లక్ష్యం. అయినా తమ సామాజిక, రాజకీయ స్థానాలలోని దూరం వల్ల స్నేహితులు కాలేకపోయారు. అయితే జాతికి బాపూగా వందనీయుడు అయిన గాంధీ, బాబాసాహెబ్‌గా గౌరవం పొందుతున్న అంబేడ్కర్ ఇప్పుడు స్నేహితులయ్యారు! మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇరువురి ఆలోచనా ధోరణుల మధ్య ఒక ఏకీభావం, ఒక సమన్వయం సాధ్యమవుతోంది. మన గణతంత్ర రాజ్య భవిష్యత్తు విషయమై ఆందోళన చెందుతున్నవారికి, బహుశా మన ధరిత్రి శ్రేయస్సును పట్టించుకునేవారికి ఆ కొత్త స్నేహసంబంధం ఒక శుభసూచకం. కాలం వెలిగించిన ఆశాదీపమిది!
చరిత్రకారుడు రామచంద్రగుహ తన కొత్త రచన ‘ఆర్గ్యుమెంట్స్ విత్ గాంధీ’లో గాంధీ, అంబేడ్కర్‌ల జీవితకాలంలో వారి మధ్య చర్చలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, ఇరువురి మరణానంతరం వాటి ప్రభావం, ప్రాధాన్యం, ఉపయుక్తత, చరిత్రను విపులంగా విశ్లేషించారు. మరణానంతర చర్చలో రెండు క్లిష్టదశలు ఉన్నాయి. మొదటిది స్వతంత్ర భారతదేశ మొదటి మూడు దశాబ్దాలలో గాంధీకి ఎనలేని ప్రాధాన్యం లభించింది. దైవ సమానుడుగా ప్రజలకు ఆయన ఆరాధ్యుడు అయ్యారు. అంబేడ్కర్ విస్మరణకు గురయ్యారు. ఆయన ఆలోచనలు అలక్ష్యానికి లోనయ్యాయి. 1982లో నేను జేఎన్‌యూలో రాజనీతిశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఆధునిక భారతీయ రాజకీయ చింతనపై మాకు ఒక పాఠ్యాంశం ఉండేది. అందులో అంబేడ్కర్ ఆలోచనల గురించిన ప్రస్తావన మచ్చుకు కూడా లేదు. రెండో దశ 1990ల్లో ప్రారంభమయింది. 1991లో అంబేడ్కర్ శతజయంతి. అదే కాలంలో బాంసెఫ్ (కాన్షీరాం నెలకొల్పిన అఖిల భారత వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగుల జాతీయ సమాఖ్య) జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందడం ప్రారంభమయింది. అదే కాలంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయింది. కమ్యూనిస్టు రాజ్య వ్యవస్థలు కూలిపోయాయి. ఆ సందర్భంలో అంబేడ్కర్‌కు మేధో ప్రపంచంలోనూ, దేశ రాజకీయాలలోనూ మున్నెన్నడూ లేని ప్రాధాన్యం లభించడం మొదలయింది. కోట్లాది ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యారు. గాంధీ భావజాలంపై సంశయాలు పెరిగాయి. అంబేడ్కర్‌ను దైవసమానుడుగా భావించేవారు అంతకంతకూ పెరిగారు, ఇంకా అధికమవుతున్నారు. గాంధీపై ఏకకాలంలో హిందువుల శత్రువుగాను, కుల వ్యవస్థకు కుటిల రక్షకుడుగాను నిందలు వెల్లువెత్తాయి.
గాంధీ, అంబేడ్కర్ ఆలోచనా ధోరణుల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు మొదటి ప్రయత్నం డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా అనుయాయుల ద్వారా జరిగింది. లోహియా పిలుపు ‘జాతి తోడో’ (కులాన్ని నిర్మూలించండి) అంబేడ్కర్ కుల నిర్మూలన ఆశయాన్ని ప్రతిధ్వనించింది. తననుతాను కుజాత్ (సామాజిక బహిష్కృతుడు)గా ప్రకటించుకున్న లోహియా అన్నిరకాల అన్యాయాలను తొలగించే ఆయుధం గాంధేయ సత్యాగ్రహం అని పరిపూర్ణంగా విశ్వసించిన నాయకుడు. కుల నిర్మూలన ఆశయాలను సత్యాగ్రహంతో ఆయన అనుసంధానించారు. ఆయన ‘జాతి తోడో’ పిలుపు గాంధీ, అంబేడ్కర్ ఆలోచనా ధోరణుల మధ్య సమన్వయానికి మేధో ప్రాతిపదికలను నిర్మించింది. అయితే ఆ సమన్వయం లోహియా జీవితకాలంలో సాకారమవలేదు. 1950ల్లో అంబేడ్కర్ తో సమావేశమై దేశ సమస్యల పరిష్కారానికి, అంతరాలు లేని కొత్త సమాజాన్ని నిర్మించే విషయమై చర్చలు జరపాలని లోహియా నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రతిపాదిత సమావేశం జరగక ముందే అంబేడ్కర్ మరణించారు. అయితే లోహియా రాజకీయ సంప్రదాయాల కొమ్మలు, రెమ్మలు అయిన ‘సమతా సంఘటన్, మహారాష్ట్ర సోషలిస్ట్ ఫ్రంట్, సమాజ్‌వాదీ జన్ పరిషత్, సర్వోదయ కర్ణాటక పక్ష...’ మొదలైనవి గాంధీ, అంబేడ్కర్ ఆలోచనా స్రవంతుల మధ్య ఐక్యతకు తగు రాజకీయ ప్రాతిపదికలను సంసిద్ధపరిచాయి.
అయితే కులంపై గాంధీ వైఖరి ఈ ఐక్యత వర్ధిల్లి, వికసించేందుకు పెద్ద అవరోధమయింది. కులం విషయమై గాంధీ వైఖరిపై అంబేడ్కర్ ప్రతిస్పందన గురించి రామచంద్రగుహ ఇలా వ్యాఖ్యానించారు: ‘గాంధీ ఒక సంకోచించే సంస్కర్త అని అంబేడ్కర్ భావించారు. కుల వ్యవస్థ నిర్మాణాన్ని నేరుగా సవాలు చేసేందుకు ఆయన సిద్ధంగా లేరని బాబాసాహెబ్ అనుకున్నారు. సంప్రదాయ హిందువులు గాంధీని ఒక ప్రమాదకరమైన అతివాద సంస్కర్తగా చూశారు. తమ మతంలోని ప్రధాన విశ్వాసాలను, మౌలిక పునాదులను బలహీనపరచడం ద్వారా తమ విశ్వాసాన్ని నాశనం చేసేందుకు గాంధీ కంకణం కట్టుకున్నారని సంప్రదాయవాదులు విశ్వసించారు’. గాంధీ మరణానంతరం కూడా సంప్రదాయ హిందువుల భయాలు సమసిపోలేదు. గాంధీకి వ్యతిరేకంగా రహస్య ప్రచారం జరిగింది. ఇది ఆరెస్సెస్ నాయకత్వంలో సాగింది. అయితే, గాంధీ కుల వ్యవస్థ రక్షకుడు అనే భావన కుల వ్యతిరేక రాజకీయ, మేధో వర్గాలలో బాగా బలపడింది.
కుల వ్యవస్థపై గాంధీ వైఖరిని అంబేడ్కర్ సంశయంతో చూశారనడంలో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో డి.ఆర్ నాగరాజ్, నిషికాంత్ కోల్గే, శశిభూషణ్ ఉపాధ్యాయ తదితర మేధావుల రచనలు గాంధీ, అంబేడ్కర్ ఆలోచనా ధోరణుల మధ్య వైరుధ్యాలను కొత్తకోణంలో విశ్లేషించాయి. వాటిని వివరంగా చూద్దాం. రాడికల్ రాజకీయాలకు కొత్త వస్త్రాలను తొడిగేందుకు గాంధీ అంబేడ్కర్‌లను పడుగు, పేకలుగా ఉపయోగించిన నవ మేధావి డి.ఆర్ నాగరాజ్. ఈయన చేనేత సామాజిక వర్గానికి చెందిన కన్నడిగుడు. ‘సెల్ఫ్ ప్యూరిఫికేషన్ వెర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్: ఆన్ ది రూట్స్ ఆఫ్ దళిత్ మూవ్‌మెంట్’ అనే వ్యాసంలో గాంధీ, అంబేడ్కర్ ఆలోచనా విధానాల మధ్య వ్యత్యాసాలను ఆయన విశ్లేషించారు. ఈ ఇరువురు నాయకులు ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారని నాగరాజ్ అభిప్రాయపడ్డారు. గాంధీ కేవలం నైతిక వైఫల్యంగా చూసిన అంటరానితనాన్ని అంబేడ్కర్ రాజకీయ వ్యవస్థకు ముడిపెట్టారని, అలాగే గాంధీ ఆలోచనలు అంబేడ్కర్‌లో నైతిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవనం గురించిన అవగాహనను పెంపొందించాయని ఆయన పేర్కొన్నారు.
మార్క్ లిండ్లీ 1997లో రాసిన ‘హౌ గాంధీ కేమ్ టు బిలీవ్ క్యాస్ట్ మస్ట్ బి డిస్మాంటిల్డ్ బై ఇంటర్ మ్యారేజ్’ అనే వ్యాసం కుల వ్యవస్థ, కులాంతర వివాహాల విషయంలో గాంధీ ఆలోచనలలో వచ్చిన సమూలమార్పును వివరించింది. 1920ల్లో వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించిన గాంధీ 1940ల నాటికి కుల వ్యవస్థను నిర్మూలించేందుకు కులాంతర వివాహాలే ఏకైక మార్గమని విశ్వసించారని ఈ వ్యాసకర్త పేర్కొన్నారు. రావుసాహెబ్ కస్బే తన మరాఠీ రచనలలో గాంధీ ఆలోచనలను అంబేడ్కర్ దృక్కోణం నుంచి విశ్లేషించారు. నిషికాంత్ కోల్గే రాసిన ‘గాంధీ ఎగెనెస్ట్ క్యాస్ట్’ (2018) అనే పుస్తకం కుల వ్యవస్థపై గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాల పరిణామాన్ని వివరించింది. వర్ణాశ్రమ ధర్మాలు, కులాల గురించి సంప్రదాయ భావాల నుంచి కాలక్రమేణా బయటపడి, కుల నిర్మూలన వైపు గాంధీ మారిన తీరును కోల్గే విశ్లేషించారు. ఆయనలో ఈ మార్పు ఒక్కసారిగా సంభవించలేదని, అది కాలక్రమేణా వచ్చిందని వివరించారు. శశిభూషణ్ ఉపాధ్యాయ తన పుస్తకం ‘గాంధీ అండ్ ది క్యాస్ట్ క్వశ్చన్ ఇన్ కలోనియల్ ఇండియా’ (2025)లో కులం గురించి గాంధీ ఆలోచనల్లో మార్పువచ్చిన క్రమాన్ని వివరించింది. వర్ణ వ్యవస్థను సమర్థించడం, కులం విషయంలో ఆయన చూపిన ద్వంద్వ వైఖరి ఒక రాజకీయ వ్యూహం మాత్రమే కాదని ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఒంటరివ్యక్తులతో కూడిన పాశ్చాత్య సమాజ నమూనాకు భిన్నంగా ఒక సమష్టి సమాజాన్ని నిర్మించాలని గాంధీ తపనపడ్డారని ఆయన వివరించారు.
గాంధీ, అంబేడ్కర్ ఆలోచనా విధానాల మధ్య ఉన్న విభేదాలను ఈ మేధో అధ్యయనాలు పరిష్కరించలేవు. పరిష్కరించాల్సిన అవసరం కూడా లేదు. అయితే అవి వారి మధ్య ఉన్న విరోధం అనే అడ్డంకిని తొలగించాయి. గాంధీ–అంబేడ్కర్‌ల చర్చ వారి జీవితకాలంలో ఆ ఇరువురి నియంత్రణలో ఉన్నది. వారి మరణానంతరం ఆ చర్చ మనకు చెందినది. మనం దానిని మళ్లీమళ్లీ సరికొత్తగా చేయవచ్చు, లేదా గడచిపోయిన కాలం నాటి అంశాలపై మనం గొడవపడుతూ ఉండిపోవచ్చు. లేదా కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ అన్నట్టు... గాంధీ, అంబేడ్కర్ ఆలోచనల, ఆచరణల స్ఫూర్తిని ఆవాహన చేసుకుని మరింత ప్రగతిశీలంగా ముందుకు సాగిపోవచ్చు. ఇది మనపైనే ఆధారపడి ఉందనేది స్పష్టం. నేటి యువ భారతీయులు చేసిన వీధిపోరాటం ఇప్పటికే అటువంటి పురోగతి సాధించింది. గత జూలైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సమయంలో వేదికపై బాపూ, బాబాసాహెబ్ చిత్రాలు, ‘జై భీమ్’ నినాదాలు విన్పించడంతో పాటు ప్లకార్డులపై గాంధీ సుభాషితాలు కనిపించడం ఒక కొత్త భవిష్యత్తును సూచిస్తున్నాయి. బాపూ, బాబాసాహెబ్ (ఆశావహంగా భగత్‌సింగ్ కూడా) ఇప్పుడు మిత్రులయ్యారు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News