Share News

పుస్తక వనం.. ఫ్యూచర్‌ లైబ్రరీ!

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:51 AM

నార్వే రాజధాని ఓస్లో సమీపంలో ‘నార్డ్‌మార్కా’ అటవీ ప్రాంతంలోని వెయ్యి స్ప్రూస్ వృక్షాల వెనుక ఒక భావోద్వేగభరితమైన కథ దాగి ఉంది. ఇవి కలప కోసమో, నేటి వ్యాపార కాగితం కోసమో పెరుగుతున్న చెట్లు కావు. రాబోయే...

పుస్తక వనం.. ఫ్యూచర్‌ లైబ్రరీ!

నార్వే రాజధాని ఓస్లో సమీపంలో ‘నార్డ్‌మార్కా’ అటవీ ప్రాంతంలోని వెయ్యి స్ప్రూస్ వృక్షాల వెనుక ఒక భావోద్వేగభరితమైన కథ దాగి ఉంది. ఇవి కలప కోసమో, నేటి వ్యాపార కాగితం కోసమో పెరుగుతున్న చెట్లు కావు. రాబోయే శతాబ్దంలో, అంటే 2114వ సంవత్సరంలో ముద్రించబోయే వంద రహస్య గ్రంథాలకు శ్వేత పత్రాలుగా మారేందుకు, ప్రకృతి ఒడిలో లాలించబడుతున్న అక్షర శిశువులు. ఈ ప్రకృతి సంపద.. భవిష్యత్ తరాల మేధస్సుకు కానుకగా ఇవ్వబోతున్న జీవ గ్రంథాలయం.

ఎక్కడికైనా సమాచారం క్షణాల్లో చేరిపోతున్న డిజిటల్‌ యుగమిది. ప్రతిదీ వేగంగా, తక్షణమే జరిగిపోవాలనుకునే ఈ ఆధునిక ప్రపంచంలో... ఒక కళాకారిణి మాత్రం శతాబ్దకాలం పాటు నిరీక్షించే ఓర్పును నమ్ముకుంది. స్కాట్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత దృశ్య కళాకారిణి (Visual Artist) కేటీ పాటర్సన్ 2014లో ‘ఫ్యూచర్ లైబ్రరీ’ అనే ఈ అపూర్వ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆమె ఆలోచన ప్రకారం, 2014 నుంచి ప్రతి ఏడాది ప్రపంచంలోని ఒక ప్రముఖ రచయిత లేదా రచయిత్రి ఒక సరికొత్త రచనను ఈ లైబ్రరీకి సమర్పిస్తారు. అయితే, ఆ రచనను చదివే హక్కు, ప్రచురించే హక్కు, కనీసం అందులో ఏముందో తెలుసుకునే హక్కు కూడా ఈ తరానికి లేదు. 2014 నుంచి 2114 వరకు... అంటే వందేళ్ల పాటు ప్రతి ఏటా సేకరించే వంద అద్భుత రచనలను ఒకేసారి ఆ నూరేళ్ల తర్వాతే ఒక మహా సంకలనంగా ముద్రిస్తారు. ఆ పుస్తకాల ముద్రణకు ఉపయోగించే కాగితాన్ని కూడా సమీప ఓస్లో అడవిలో పెంచుతున్న ఆ వెయ్యి స్ప్రూస్ చెట్ల నుంచే తయారు చేయాలన్నది సంకల్పం.


ఈ వందేళ్ల సాహిత్య యజ్ఞంలో భాగంగా ప్రతి ఏటా ఒక విశిష్ట రచయితను ‘ఫ్యూచర్‌ లైబ్రరీ’ బాధ్యులు ఎంపిక చేస్తారు. వారు భవిష్యత్ తరాలను, ఇంకా పుట్టని పాఠకులను ఊహిస్తూ తమ అంతరంగాన్ని అక్షరబద్ధం చేస్తారు. ఆ రచనను పూర్తి చేసిన తర్వాత, వారు దాన్ని ఎవరికీ చూపించకుండా, కేవలం హార్డ్ కాపీ రూపంలో ఒక పెట్టెలో పెట్టి సీల్ వేస్తారు. ఓస్లో ప్రాంతంలోనే ఉన్న డైక్‌మెన్‌ బ్యోర్వికా అనే ప్రజాగ్రంథాలయంలో ప్రత్యేకంగా నిర్మించిన ‘సైలెంట్‌ రూమ్‌’లో వీటిని భద్రపరుస్తారు. అక్కడ రచయిత పేరు, శీర్షిక, ప్రచురించిన సంవత్సరం మాత్రమే సందర్శకులకు కనిపిస్తాయి. ఈ సాహిత్య యజ్ఞానికి మొదటి సమర్పకురాలిగా ప్రపంచప్రసిద్ధ కెనడియన్ నవలా రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత మార్గరెట్ అట్వుడ్ ఎంపికయ్యారు. ఆమె 2014లో ‘స్క్రిబ్లర్ మూన్’ అనే ప్రచురితం కాని నవలను ఈ ప్రాజెక్టుకు అప్పగించారు.

ఆ తర్వాత డేవిడ్ మిచెల్, ఐస్లాండ్ కవి స్జోన్, టర్కిష్–బ్రిటిష్ రచయిత్రి ఎలిఫ్ షఫాక్, నోబెల్ బహుమతి గ్రహీత హాన్‌కాంగ్, ప్రఖ్యాత కవి ఓషన్ వువాంగ్, జింబాబ్వే రచయిత్రి త్సిత్సి దంగారెంబ్‌గాతో పాటు మన దేశం నుంచి అమితావ్‌ ఘోష్‌ కూడా ఉన్నారు. వీరంతా తమ అమూల్యమైన రచనలను ఈ అక్షర భాండాగారానికి అందించారు.

ఈ ప్రాజెక్టులో హృదయానికి హత్తుకునే అంశం ఏమిటంటే... ప్రకృతికి, సాహిత్యానికి మధ్య అల్లిన జీవ సంబంధం. నార్వే అడవిలో పెరుగుతున్న ఆ స్ప్రూస్ చెట్లు కాలాన్ని తమ వలయాలుగా మార్చుకుంటున్నాయి. మరోవైపు రచయితల మనసుల్లోని ఆలోచనలు కాగితాలపై అక్షరాలుగా మారి కాలానికి సవాలు విసురుతున్నాయి. నూరేళ్ల తర్వాత... ఈ చెట్లను నరికి కాగితంగా మార్చినప్పుడు, ఆ కాగితంపై ఈ వంద పుస్తకాలు ముద్రించబడతాయి. అంటే ఈ చెట్లు నూరేళ్ల తర్వాత పుస్తకాల రూపంలో మనుషులతో మాట్లాడతాయన్నమాట. ఎంతటి అద్భుతమైన భావన ఇది! ప్రకృతి, రచయిత, కాగితం, పాఠకుడు... ఈ నాలుగు అంశాల మధ్య శతాబ్ద కాలం పాటు సాగే ఒక అదృశ్య, అమర అనుబంధానికి ఈ ప్రాజెక్ట్ ఒక సజీవ సాక్ష్యం.

సాధారణంగా ఏ రచయిత అయినా తను రాసిన పుస్తకాన్ని సమాజం వెంటనే చదవాలని, విమర్శకులు మెచ్చాలని, పాఠకులు ఆదరించాలని కోరుకుంటారు. తాము బతికుండగానే ఆ కీర్తిని ఆస్వాదించాలని ఆరాటపడతారు. కానీ, ఫ్యూచర్ లైబ్రరీ కోసం రాస్తున్న రచయితలు మాత్రం ఆ ఆరాటాన్ని, కీర్తి కాంక్షను పక్కనపెట్టి, నిస్వార్థంగా కలం పడుతున్నారు. తాము రాసే అక్షరాలను తమ జీవితకాలంలో ఎవరూ చదవరు అని తెలిసి కూడా, వారు తమ గుండెల్లోని భావాలను కాగితంపై కుమ్మరిస్తున్నారు. ఇంకా జన్మించని భవిష్యత్ తరాల పాఠకులను మనసులో తలచుకుంటూ ఈ రచనలు చేస్తున్నారు.


నేటి ప్రపంచం వేగానికి బానిస అయిపోయింది. ఇది టెక్నాలజీ సృష్టించిన మాయాజాలం. కానీ ఫ్యూచర్ లైబ్రరీ వీటన్నింటికీ భిన్నంగా, ఉద్దేశపూర్వకంగా ‘వేచి ఉండడాన్ని’ ఒక సంస్కృతిగా మార్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ మనల్ని, మన సమాజాన్ని కొన్ని తీవ్రమైన ప్రశ్నల వైపు మళ్లిస్తుంది.

వందేళ్ల తర్వాత కూడా మానవాళి పుస్తకాలను ప్రేమిస్తుందా? అప్పటికి అసలు అడవులు మిగిలి ఉంటాయా? యంత్రాల యుగంలో మనుషులు కథలను, కవిత్వాన్ని ఆస్వాదించే హృదయాన్ని కలిగి ఉంటారా? ఈ వంద పుస్తకాలు వారికి ఒక అపూర్వ సాహిత్య సంపదగా కనిపిస్తాయా? లేక గత శతాబ్దపు మానవుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే చారిత్రక పత్రాలుగా మిగిలిపోతాయా? లేదంటే ఒక అద్భుతమైన పర్యావరణ – కళా ప్రయోగంగా కీర్తించబడతాయా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలం మాత్రమే సమాధానం చెప్పగలదు.

డా. రవికుమార్ చేగొని

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 12:51 AM