Share News

బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:05 AM

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి పౌరుడికీ సమాన హక్కులు ఉన్నాయి. అదే సమయంలో, దేశం అభివృద్ధి చెందడానికి, సామాజిక సమగ్రత కాపాడడానికి పౌరులందరిపై కొన్ని బాధ్యతలు కూడా...

బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి పౌరుడికీ సమాన హక్కులు ఉన్నాయి. అదే సమయంలో, దేశం అభివృద్ధి చెందడానికి, సామాజిక సమగ్రత కాపాడడానికి పౌరులందరిపై కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. హక్కులు, బాధ్యతలు ఆధునిక ప్రజాస్వామ్యంలో పరస్పరం విడదీయలేనివి. హక్కులు మనకు స్వేచ్ఛ, గౌరవం, సమానత ఇస్తే... బాధ్యతలు ఆ స్వేచ్ఛను సరిగా ఉపయోగించడానికి మార్గనిర్దేశం చేస్తాయి. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించడం ఎంత ముఖ్యమో, తన బాధ్యతలను నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యం.

భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పుడు ప్రజలకు స్వేచ్ఛ, రక్షణ, న్యాయం వంటి విలువలను అందించే మౌలిక హక్కులను దాంట్లో చేర్చారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అణచివేతకు ముగింపు పలుకుతూ, ప్రతి వ్యక్తికి గౌరవం, భద్రతను ఇచ్చే విధంగా ఈ హక్కులను రూపొందించారు. అయితే మౌలిక కర్తవ్యాలను అప్పట్లో రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చలేదు. 1970వ దశకంలో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత, విలువల క్షీణత, ప్రజా క్రమశిక్షణ తగ్గిపోవడం వంటి సమస్యల నేపథ్యంలో కర్తవ్యాలను కూడా స్పష్టంగా చేర్చాల్సిన అవసరం వచ్చింది. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరులు పాటించాల్సిన పదకొండు మౌలిక కర్తవ్యాలను రాజ్యాంగంలో చేర్చారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామరస్యం, పర్యావరణ రక్షణ, సంస్కృతి పరిరక్షణల వంటి విలువలను మనలో పెంపొందించే విధంగా వీటిని రూపొందించారు.


హక్కులు ఉన్నాయని ఇతరుల హక్కుల్ని కించపరచడం, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతిని కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం– ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. పౌరులు బాధ్యతలను పాటించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు, మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. మన అభిప్రాయాన్ని చెప్పడానికి ఎవ్వరూ అడ్డంకి కల్పించరు. కానీ మన మాట వల్ల ఇతరుల గౌరవానికి భంగం కలగకుండా చూడటం ఒక బాధ్యత. తనకు నచ్చని విషయాన్ని ఎవరైనా మాట్లాడితే, కోపంతో హింసను ప్రేరేపించడం, దుర్భాషలాడడం స్వేచ్ఛా హక్కును తప్పుగా వినియోగించడమే.

అలాగే, సమానత్వ హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ, మన సమాజంలోని విభిన్నతను గౌరవించడం, ఇతరుల పట్ల వివక్ష చూపకుండా ఉండడం మన బాధ్యత. జాతి, కులం, మతం, భాష, లింగం ఆధారంగా ఎవరికీ అవమానం కలిగించకపోవడం అనేది మనలో ప్రతి ఒక్కరూ పాటించి తీరవలసిన పౌర ధర్మం. హక్కులు మనకు సమానతకు హామీ ఇస్తాయి, బాధ్యతలు ఆ సమానతను కాపాడే నైతిక బాధ్యతలను గుర్తుచేస్తాయి. దేశాన్ని గౌరవించడం, దాని చిహ్నాలను పరిరక్షించడం కూడా మన బాధ్యతే. జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల గౌరవం చూపడం కేవలం ఒక ఆచారం కాదు; అది మనలో దేశభక్తిని పెంపొందించే ఒక విలువ. ఈ విలువలు ఉన్నప్పుడే మన హక్కులు సురక్షితంగా ఉంటాయి. దేశం మనకు ఇచ్చే విద్యా హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో మంచి పౌరుడిగా మారడం, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా ఉద్యోగం చేయడం, అవినీతి వంటి చెడు పనులకు దూరంగా ఉండడం అనేవి బాధ్యతల్లో భాగం.

పర్యావరణాన్ని కాపాడటం కూడా ప్రతి పౌరుడి ప్రధాన బాధ్యత. శుభ్రమైన గాలి పీల్చడం, స్వచ్ఛమైన నీరు త్రాగడం మనకు ఒక హక్కు. అలాగే చెట్లు నాటడం, వన్యప్రాణులను కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవడం మన బాధ్యత. మనం ఈ బాధ్యతను పట్టించుకోకపోతే, రేపటి తరాలకు ఈ హక్కులు అందుబాటులో ఉండవు. ప్రభుత్వ బస్సులు, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు ఇవన్నీ ప్రజల డబ్బుతోనే నిర్మిస్తారు. వీటిని ధ్వంసం చేయడమంటే మన ఆస్తిని మనమే నాశనం చేసినట్టు. ప్రజల ఆస్తి మన హక్కులతో ముడిపడి ఉందని అర్థం చేసుకుంటే వాటిని కాపాడాలనే అవగాహన సహజంగానే మనకు వస్తుంది.


మన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కు ఇచ్చింది. కాబట్టి మహిళలు కూడా సమాన గౌరవానికి అర్హులే. వారి భద్రత, విద్య, అవకాశాలు వారికి సమాజం ఇచ్చే హక్కులు. అయితే వారిని అవమానించడం, వేధించడం, హింసించడం అనేవి బాధ్యత మరచిన జీవనశైలి అవుతుంది. మనం మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించినప్పుడే వారు తమ హక్కులను నిజంగా అనుభవించగలరు. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం కూడా ఒక బాధ్యత. మూఢ నమ్మకాలను, అజ్ఞానంతో కాలం చెల్లిన ఆచారాలను ప్రోత్సహించడం వల్ల సమాజం వెనకడుగు వేస్తుంది. విజ్ఞానాన్ని, తర్కాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమాజం ముందుకు సాగుతుంది. శాస్త్రీయ దృక్పథం కలిగిన ప్రజలు ఉన్నప్పుడే దేశం నూతన ఆవిష్కరణలు చేసి, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది.

మొత్తం మీద, హక్కులు, బాధ్యతలు వాహనానికి రెండు చక్రాలవంటివి. ఒక చక్రం లేకపోతే వాహనం ముందుకు కదలనట్లే, బాధ్యతలను విస్మరిస్తే జీవనం సజావుగా సాగదు. మనం హక్కులను మాత్రమే డిమాండ్ చేసి, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్యం తన బలాన్ని కోల్పోతుంది. పౌరులు తమ హక్కులను గౌరవిస్తూ, బాధ్యతలను నిజాయితీగా పాటించడంతోనే దేశం బలమైనదిగా, శాంతిమయమైనదిగా అభివృద్ధి చెందుతుంది. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా నిలబడుతుంది.

పి.వేణుగోపాల్‌రెడ్డి

ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 01:05 AM