ఉచితాలు.. అభివృద్ధికి ఆటంకాలు!
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:20 AM
ఈ నెలలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. పోటాపోటీగా పలు వాగ్దానాలు చేశాయి. ఫించన్ల పెంపు,...
ఈ నెలలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. పోటాపోటీగా పలు వాగ్దానాలు చేశాయి. ఫించన్ల పెంపు, బంగారం– నగదు పంపిణీ, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణాలు, వడ్డీ లేని రుణాలు, ఉచిత గ్యాస్ సిలెండర్లు, పట్టుచీరలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, ట్యాబ్‌లు... ఒకటేమిటి జననం నుంచి మరణం దాకా అన్నీ మేమే అందిస్తామంటూ వరాల వర్షం కురిపించాయి. ప్రజలు ఎవరి వాగ్దానాలను నమ్మి అధికారం కట్టబెడతారో వచ్చే నెల నాలుగు వరకు వేచి చూడాలి.
గెలుపే లక్ష్యంగా ప్రకటించే అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి గుదిబండలుగా మారుతున్నాయి. ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం గర్హనీయం. ‘‘హేతుబద్ధత లేని వాగ్దానాలు ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీస్తున్నాయి. అన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేస్తారు? ఎన్నాళ్లీ ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటులోనే ఉన్నాయి. నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు అన్న రెండు పనులు తప్పితే, మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఉద్యోగావకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా?’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం గమనార్హం.
ఉచితాలపై మానవ సహజ గుణాన్ని, బలహీనతను ఆసరాగా తీసుకుని ఓట్లు దండుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కానుకల రాజకీయమే చేస్తున్నాయి. అంతేకానీ ఎలాంటి మార్పులు తీసుకొస్తే సమాజంలో నిజమైన పరివర్తన వచ్చి జనం లాభం పొందగలరు అన్న ఆలోచన చేయడం లేదు. ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం అంటే వారి జీవితాలను వారే తీర్చిదిద్దుకోగలిగే మార్గాలను నిర్మించడం అన్న స్పృహ పార్టీలకు కొరవడింది. అధికారంలోకి రావడానికి జనం ఓట్లే మార్గం కనుక, ఆ ఓట్లను సర్కారీ సొమ్ముతో కొనుగోలు చేయడానికి పూనుకునే పెడపోకడలు శృతిమించుతున్నాయి.
ప్రజలలోని ఆలోచనాశక్తిని, పనిచేసే తత్వాన్ని, ప్రశ్నించే లక్షణాన్ని చంపేయకూడదు. నిజానికి ప్రజలు కోరుకుంటున్నది కొంతకాలం భ్రమల్లో ముంచెత్తి, తరువాత చేదు నిజాలను చవిచూపించే తాత్కాలిక వరాలను, జనాకర్షక పథకాలను కాదు. తమ సమస్యలను చిత్తశుద్ధితో, నిజాయితీతో, శాశ్వతంగా పరిష్కరించేవారు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. రాజకీయ పక్షాలు ఓటర్లకు రాయితీలు, వివిధ రకాల సహాయాలు, పథకాలను ప్రకటించడంలో తప్పులేదు. అయితే అందుకు ఒక విధానం, ఒక నిర్దిష్టత ఉండాలి. సంక్షేమంతో ఎటువంటి సంబంధం లేకుండా హామీలివ్వడం అంటే మాత్రం అది కచ్చితంగా ఓటర్లకు లంచమివ్వడమే. చట్టబద్ధమైన ఎన్నికల హామీకి, చట్టబద్ధమైన ప్రలోభానికి ఉన్న విభజన రేఖను దాటడమే. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడానికి తక్షణ సహాయంగా రాయితీలు, ఊతాలు ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఉపాధి లేక ఆకలిబాధతో ఉన్నవారికి సబ్సిడీ బియ్యాన్ని అందించవచ్చు. అలాగే ఇళ్లులేని వారికి ఇళ్ళు కట్టివ్వడం, ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న రైతాంగానికి ఉచిత విద్యుత్ వంటివి ఇవ్వొచ్చు. సాధ్యం కాని, ప్రజాప్రయోజన ప్రాతిపదిక ఏ కోశానా లేని హామీలనిచ్చి, వాటికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసంతో, నిబద్ధతతో వ్యవహరిస్తామని ప్రమాణం చేసి, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు రాజ్యాంగ విరుద్ధ హామీలనిస్తే వాటి గుర్తింపు రద్దుచేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే లక్ష్యంతో చేసే ఎన్నికల హామీలపై కఠిన చర్యలు చేపట్టాలి. అప్పుడే రాజకీయ పార్టీలు కొంత జాగరూకత పాటిస్తాయి.
అధికార క్రీడలో మైమరచిపోతున్న పార్టీలు, రాజకీయ నాయకులు ఒక్కసారి కళ్ళు తెరిచి, నిజమైన సమస్యల మీద దృష్టిని సారించాలి. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, మంచి పాలన– ఇవే మన బిడ్డలకు సగర్వంగా మనమివ్వగల వారసత్వమని పాలకులు గ్రహించాలి. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం, కుటీర పరిశ్రమలను, స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం లాంటివి చిత్తశుద్ధితో చేపట్టాలి. అభివృద్ధిని పక్కనపెట్టి సంక్షేమం పైనే దృష్టి పెడితే రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని గ్రహించాలి. ప్రజలు కూడా తమను దోచుకునే రాజకీయం స్థానే స్వేచ్ఛగా, సగర్వంగా, జవజీవాలతో బతకడానికి వీలు కల్పించే వాతావరణం ఏర్పరచే పార్టీలకే అధికారం ఇవ్వాలి. ఆలోచన, ముందుచూపు, నిజాయితీ ఉన్న లీడర్లనే ఎన్నుకోవాలి.
‘‘ఉత్పాదకతను పెంచేలా ఖర్చులు ఉండాలనేదే తమ సర్కారు నిర్ణయించుకున్న గీటురాయి అని, అందుకే బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లలేదని, ఉద్యోగావకాశాలకు, సుస్థిరాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామని’’ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే బాటలో నడిస్తేనే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు గ్రహించాలి.
కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News