ఫ్రాన్స్ ప్రజల్లాగా నిరసన చేయలేమనా..?
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:43 AM
భారతీయులు గొప్ప ప్రజాస్వామికవాదులు. శాంతి, సహనం, క్షమాగుణం వంటి విశిష్ట మానవీయ లక్షణాలు వారి డీఎన్ఏలోనే ఉన్నాయి. కనుకనే తరతరాలుగా పేద, మధ్యతరగతి వర్గాలు...
భారతీయులు గొప్ప ప్రజాస్వామికవాదులు. శాంతి, సహనం, క్షమాగుణం వంటి విశిష్ట మానవీయ లక్షణాలు వారి డీఎన్ఏలోనే ఉన్నాయి. కనుకనే తరతరాలుగా పేద, మధ్యతరగతి వర్గాలు ఈతిబాధలతో సహజీవనం చేస్తూ, పేదరికం కారణంగా పట్టిపీడిస్తున్న సకల రుగ్మతలను మౌనంగా భరిస్తున్నారు. రెండు పూటలా కడుపు నింపుకోవటానికి అవసరమయ్యే నిత్యావసరాల ధరలు అందుబాటులో లేకున్నా, నాణ్యమైన విద్య, వైద్యం ఆమడ దూరంలో ఉన్నా, తలదాచుకోవటానికి కాసింత గూడు లేకున్నా లోలోపల కుమిలిపోతారే తప్ప ఫ్రాన్స్‌లో లాగానో, ఇతర దేశాల్లో లాగానో వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయరు. తమ దుస్థితికి కారణమైన ప్రభుత్వాల మీద కలిగే ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి ఐదేళ్లపాటు నిరీక్షిస్తుంటారు. తమ ఓటుతో ప్రభుత్వాలను మార్చగలమని, కొత్తగా వచ్చే ప్రభుత్వాలు తమ సమస్యలను తీరుస్తాయని భ్రమపడుతుంటారు.
అంతర్గత అల్లర్లతో ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఫ్రాన్స్ దేశ జనాభా రమారమి ఆరున్నర కోట్లు. అందులో దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రజలు అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనలు వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున ఆందోళనలకు దిగి, అక్కడి ఇమాన్యుయేల్ మాక్రన్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వివిధ నగరాల్లో నిరసనను హింసాత్మక రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కళలకు, సౌందర్యానికి పర్యాయపదమైన పారిస్‌లో ఎటుచూసినా విధ్వంసమే. ఈ నిరసనలకు మొదటగా అక్కడి ప్రజలను ప్రేరేపించింది పాఠశాలల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి. ఫ్రాన్స్ పాఠశాలల్లో సగటున 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాల్సి ఉండగా 40 నుంచి 50 మంది పిల్లలకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఈ అంశంపై పెల్లుబికిన నిరసనలు క్రమంగా ఇతర రూపాలను సంతరించుకున్నాయి.
మరోపక్క మన దేశంలో ఎన్నడూ పాఠశాల ముఖం చూడని బాలల సంఖ్య 4.5 కోట్ల పైమాటేనని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్) సంస్థ వెల్లడించింది. ఒక్కో తరగతిలో ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని మన జాతీయ విద్యా విధానం నిర్దేశించగా, కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. అంతేకాదు, దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లక్ష వరకూ ఉన్నాయి. అంటే ఒకటి నుంచి ఐదు తరగతులలో ఉన్న విద్యార్థులందరికీ ఒక్క టీచరు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలవారు అప్పోసప్పో చేసి పిల్లలకు నాణ్యమైన చదువు కోసం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు తప్ప, ఎన్నడూ ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు పెంచాలని, టీచర్లను పెంచాలని వీధుల్లోకి వచ్చి నిరసన దీక్షలు చేపట్టిన దాఖలాలు కనపడవు.
దేశంలో బియ్యం, గోధుమలు, పప్పులు నూనెలు వంటి నిత్యావసరాల ధరలు ప్రతి ఏటా సగటున 5శాతం నుంచి 7శాతం మేర పెరుగుతున్నాయని, ఇది సాధారణ ఆహార ద్రవ్యోల్బణమేనని ప్రభుత్వాలు చెబుతాయి. కానీ ఆహారంలో ముఖ్య భాగమైన కూరగాయలు, పండ్లు, మాంసం మొదలైన వాటి ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా కాఫీ పొడి, టీ పౌడర్ల ధరలు ఏటా 15 నుంచి 20శాతం వరకూ పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంచదార, బెల్లం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వంటనూనెలు, పప్పుల ధరలు అయితే ఏకంగా ఏటా 20శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఇంటి అద్దెల భారాన్ని ద్రవ్యోల్బణంలో లెక్కించకపోవడం వల్ల వార్షిక ద్రవ్యోల్బణం 5శాతం కూడా దాటడంలేదని ప్రభుత్వాలు తప్పుడు లెక్కలతో ప్రజల్ని మభ్యపెడుతున్నాయి.
పేద, మధ్యతరగతి వర్గాలను ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఇంటి అద్దెల భారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎనిమిది దశాబ్దాలుగా పేదల కోసం అనేక గృహ నిర్మాణ పథకాలను ప్రవేశపెట్టి ఇళ్లు నిర్మిస్తున్నాయి. అయినప్పటికీ సొంతిల్లు లేని కుటుంబాలు నేటికీ దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ప్రకృతిలో పక్షులు, మృగాలు సైతం సూర్యాస్తమయం కాగానే గూట్లోకి చేరిపోతాయి. అటువంటి అవకాశం లేనిది ఒక్క మనిషికే. తలదాచుకోవడానికి సరైన గూడు లేని ప్రజలున్న కారణంగానే దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలకు దూరంగా మురికివాడలు ఏర్పడుతున్నాయి. ఐటీ, ఫార్మా తదితర రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందడంతో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగాలు చేస్తున్నవారు తమ సంపాదనలో 40 నుంచి 60శాతం వరకు ఇంటి అద్దె కోసం చెల్లించాల్సి వస్తోంది. అద్దె నియంత్రణ చట్టం (రెంట్ కంట్రోల్ యాక్ట్) ఉన్నప్పటికీ అది కేవలం కాగితాలకే పరిమితం. పైగా కొన్ని పట్టణాలు, నగరాలలో అడ్వాన్స్‌గా రెండు నెలల నుంచి ఆరు నెలల ఇంటి అద్దెను ఒకేసారి చెల్లించాలి. దీనికి తోడు ఇళ్ల బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్ల యజమానులు అద్దె పెంచేసినా చేసేది ఏమీ ఉండదు. పట్టణాలకు వలస వస్తున్న కూలీలు, డ్రైవర్లు, చిన్న చిన్న పనులు చేసే వారి సంపాదన తక్కువ. చాలీచాలని ఆదాయంతో అత్యధిక మొత్తం ఇంటి అద్దెకు పోగా మిగిలిన కొద్దిపాటి సొమ్ముతో వారు పౌష్టిక ఆహారం తీసుకోలేకపోతున్నారు. తమ పిల్లలను చదివించుకోలేకపోతున్నారు. పని కోసం వలస వచ్చే ఈ వర్గాల వారికి స్థానిక చిరునామా ధ్రువీకరణ పత్రాలు ఉండని కారణంగా ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు సైతం అందడం లేదు.
ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారనిదే దేశంలో పేదరికం తగ్గదు. ఏవో కొన్ని సబ్సిడీలు అందించి అదే సంక్షేమం అని డప్పు కొట్టుకోవడంవల్ల ఉపయోగం లేదు. భారతీయులు ఎంత సహనశీలంగా ఉన్నప్పటికీ దానికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఫ్రాన్స్ ప్రజల చైతన్యం, దానివల్ల ఉత్పన్నమైన పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి ఓ కనువిప్పు కాగలగాలి.
సి. రామచంద్రయ్య
ఏపీ శాసనమండలి సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News