Share News

అలీన దేశాల గళం.. ఫిడేల్‌!

ABN , Publish Date - Aug 13 , 2026 | 04:45 AM

ఆగస్టు 13న ఫిడేల్ కాస్ట్రో శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ, నా జ్ఞాపకాలు 1987 నాటి క్యూబా పర్యటన వైపు మళ్లాయి. హవానాలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ (ఐయుఎస్) 15వ మహాసభలో...

అలీన దేశాల గళం.. ఫిడేల్‌!

ఆగస్టు 13న ఫిడేల్ కాస్ట్రో శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ, నా జ్ఞాపకాలు 1987 నాటి క్యూబా పర్యటన వైపు మళ్లాయి. హవానాలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ (ఐయుఎస్) 15వ మహాసభలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొన్నాను. ఒక మారుమూల గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన నాకు, అంతర్జాతీయ విప్లవాగ్ని వెలిగించిన క్యూబా గడ్డపై ఫిడేల్ విప్లవ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినే అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 16న హవానా విశ్వవిద్యాలయం ముందు జరిగిన ప్రారంభోత్సవానికి 5 వేల మంది క్యూబన్ విద్యార్థులు విచ్చేశారు. వివిధ దేశాల సంస్కృతులు, ప్రతిధ్వనించిన విప్లవ నినాదాలతో హవానా నగరమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

మహాసభ చివరి దశకు చేరుకుంటున్నది. ఒక్కసారిగా హడావుడి మొదలై, ‘రెడ్ సెల్యూట్ టు ఫిడేల్!’ అంటూ హాలంతా దద్దరిల్లింది. క్యూబా దేశాధ్యక్షుడు, అలీనోద్యమ నేత, ప్రపంచ విప్లవోద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఫిడేల్ కాస్ట్రో సభలోకి ప్రవేశించారు. కాస్ట్రో రాక అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సభలో ఆయన ప్రసంగించబోతున్నారన్న విషయాన్ని నిర్వాహకులు అప్పటివరకూ అత్యంత రహస్యంగా ఉంచారు. కారణం, ఆయనను హతమార్చడానికి సామ్రాజ్యవాద అమెరికా నిఘా సంస్థ సీఐఏ, అప్పటికే లెక్కకు మించినసార్లు విఫల ప్రయత్నాలు చేసింది. ఆయన స్పానిష్ భాషలో చేసిన గంభీరమైన, ఉత్తేజకర ప్రసంగాన్ని హెడ్‌ఫోన్ల ద్వారా తర్జుమాలో వింటున్నా, ఆయన హావభావాలు, గంభీరమైన గళం, ముఖకవళికలు వర్ణనాతీతమైన విప్లవస్ఫూర్తిని నింపాయి.

కాస్ట్రో తన ప్రసంగంలో తృతీయ ప్రపంచ దేశాల సమస్యలపై లోతైన విశ్లేషణ చేశారు. ఆ దేశాలపై ఉన్న విదేశీ అప్పులు తీర్చడం ఆర్థికంగా, నైతికంగా అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. ఆ రుణాలు చెల్లించడం అంటే పేద దేశాల ప్రజల విద్య, వైద్య బడ్జెట్‌లను కొల్లగొట్టడమేనని నిరసించారు. ప్రపంచ విద్యార్థిలోకం ఈ రుణ విముక్తి కోసం, నూతన అంతర్జాతీయ ఆర్థిక విధానం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనాలు, కుట్రలను తిప్పికొడుతూ తన దేశం సాధించిన ప్రగతిని, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం దిశగా సాగిస్తున్న ప్రయాణాన్ని వివరించారు. విద్య విప్లవీకరణలో భాగంగా 1960ల నుంచి క్యూబా అమలు చేస్తున్న ‘చదువు–పని’ విధానాన్ని వివరించారు. విద్య వ్యాపారీకరణ కాకూడదని, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఉద్బోధించారు. నేను క్యూబా వెళ్లేనాటికే తృతీయ ప్రపంచ దేశాలకు చెందిన 22 వేల మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉచితంగా చదువుకుంటున్నారు. ఆనాటికే క్యూబాలో ప్రతి 325 మందికి ఒక డాక్టర్ ఉన్నారు, శిశు మరణాల రేటు అత్యల్పం.


ఫిడేల్ ఆనాడు లేవనెత్తిన ఆర్థిక అసమానతలు, విదేశీ రుణ భారం, విద్యా హక్కుల అంశాలు, అమెరికన్ ఆధిపత్యం నేటికీ అత్యంత ప్రాధాన్యమైనవి. లాటిన్ అమెరికా దేశాలను అమెరికా తన ‘పెరటిస్థలం’గా భావిస్తూ వస్తోంది. 1823 నాటి ‘మన్రో సిద్ధాంతం’ ఆధారంగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ ఒత్తిళ్లు–ఆర్థిక ఆంక్షలకే పరిమితమైన అమెరికా, ఇటీవలి కాలంలో ప్రత్యక్ష జోక్యాల ద్వారా ఆ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తోంది. దీనికి స్పష్టమైన ఉదాహరణ వెనెజువెలాలో ఇటీవల సంభవించిన పరిణామాలే.

1960ల నుంచి క్యూబాపై అమెరికా అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమలుచేస్తోంది. ఇటీవల మరిన్ని కొత్త ఆంక్షలను విధించింది. రష్యా, చైనాలతో క్యూబాకు ఉన్న వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా, క్యూబాను తమ జాతీయ భద్రతకు ముప్పుగా అమెరికా అభివర్ణిస్తోంది. క్యూబాపై సైనిక చర్యలు ఉంటాయంటూ ట్రంప్ పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక, ఇంధన ఆంక్షలు ప్రస్తుతం ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఆంక్షలను ఇటీవల మరింత కఠినం చేయడంతో, క్యూబాలో కనీస మౌలిక వసతులు పూర్తిగా స్తంభించిపోయే స్థితి ఏర్పడింది. వ్యవసాయం, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆహార ఉత్పత్తి పడిపోయింది. విదేశాల నుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలపై అమెరికా నిఘా ఉంచింది. దీంతో ఆహార భద్రతకు ముప్పు ఏర్పడింది. అయినా, అమెరికాకు క్యూబా ఎదురొడ్డి నిలుస్తోంది. క్యూబాలో సోషలిస్ట్ పతాకాన్ని ఎగురవేసి, అణచివేతకు గురవుతున్న ప్రపంచ దేశాలకు అండగా నిలిచిన గొప్ప విప్లవకారుడు ఫిడేల్ కాస్ట్రోకు ఆయన శత జయంతి సందర్భంగా ‘రెడ్ సెల్యూట్’.

టి. లక్ష్మీనారాయణ

ఏఐఎస్ఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి

(ఆగస్టు 13: ఫిడేల్ కాస్ట్రో శతజయంతి)

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 04:45 AM