Share News

విశ్వాసాన్ని వైద్యాన్ని కలిపితేనే..!

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:53 AM

జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 2019 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ‘దవా సే దువా తక్‌’ (ఔషధం నుంచి ప్రార్థన దాకా) అనే కార్యక్రమం నడుస్తోంది. దేశంలో అధిక జనాభా కలిగిన...

విశ్వాసాన్ని వైద్యాన్ని కలిపితేనే..!

జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 2019 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ‘దవా సే దువా తక్‌’ (ఔషధం నుంచి ప్రార్థన దాకా) అనే కార్యక్రమం నడుస్తోంది. దేశంలో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మానసిక రుగ్మతలతో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రత్యేక మానసిక వ్యాధులు ఉన్నవారిని వారి కుటుంబీకులు ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా మతపరమైన స్థలాల (చర్చి, గుడి, దర్గా)కు తీసుకువెళుతుంటారు. అక్కడ మంత్రం, తాయెత్తు లేదా ప్రార్థనల ద్వారా చికిత్స చేస్తారు. ఈ ‘దవా సే దువా తక్’ కార్యక్రమంలో ముజావర్ల (ప్రీస్టులు)కు శిక్షణ ఇచ్చి, వారి సహకారంతో అక్కడే మానసిక ఆరోగ్య నిపుణులు క్యాంపులు నిర్వహించి మందులు, వైద్య చికిత్స కూడా అందిస్తారు. ఇది గుజరాత్, తమిళనాడులో అమలవుతున్న ఫెయిత్‌–బేస్డ్, మెడికల్ ఇంటిగ్రేషన్ మోడల్. మూర్ఛరోగం, ఇతర మానసిక రుగ్మతలకు ఈ క్యాంపుల్లో సైకియాట్రిస్ట్‌లతో అవగాహన కల్పించి రోగులను తర్వాతి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు పంపిస్తారు. గుజరాత్‌లోని మీరా దాతార్ దర్గాలో ఈ మోడల్‌ క్లినిక్‌ను 2008లోనే ప్రభుత్వం ఎన్జీవోల సహకారంతో ప్రారంభించింది. 2014 నుంచి ఇదే పద్ధతిలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఎర్వాడి దర్గా అనుబంధ క్లినిక్‌లో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ సైకియాట్రిస్టులు, నర్సులు, సోషల్ వర్కర్లు మతపరమైన నమ్మకాలను గౌరవిస్తూ, ప్రార్థనలతో పాటు మందులు, కౌన్సెలింగ్‌ అందిస్తారు. ఈ ప్రదేశాల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ గొలుసులతో బంధించే పద్ధతి దాదాపు పోయింది. ఈ కార్యక్రమం చికిత్సను సులభతరం చేస్తోంది.

దేవుడూ దెయ్యమూ లేవు, వాటి ఆధారంగా వైద్యం ఏమిటని ప్రశ్న రావడం సహజమే. కానీ ప్రజల విశ్వాసాన్ని తిరస్కరించడం కంటే, దానిని వైద్యంతో కలపడమే సరైనది. దైవంపై నమ్మకం ఉన్నవారికి ‘దవా–దువా’ రెండింటి సమతుల్యమే నిజమైన చికిత్స. మన జీవితం మొత్తం భక్తి, కుటుంబం, నమ్మకాల చుట్టూ తిరుగుతుంటుంది. చిన్నప్పటి నుంచే ‘దేవుడు ఉన్నాడు’, ‘‘అన్నీ ఆయన చూస్తాడు’’ అని నేర్పిస్తారు. ఏదైనా కష్టం వస్తే ‘‘ఇది దేవుడు పెట్టిన పరీక్ష’’ అని మనల్ని మనమే ఓదార్చుకుంటాం. నిజమే, ఈ నమ్మకం మనిషిని నిలబెడుతుంది. ప్రార్థన, జపం, ధ్యానం ఇవన్నీ మనలో ప్రశాంతతను కలిగిస్తాయి. శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రార్థన చేస్తున్నప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చురుకుగా మారుతుంది. అది మనల్ని శాంతంగా ఉంచుతుంది. అమీగ్డాలా అనే భాగం ప్రశాంతత పొందినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. సెరోటోనిన్, డోపమైన్ వంటి ‘హ్యాపీ కెమికల్స్’ పెరిగి మనసు తేలికగా ఉంటుంది. అందుకే ప్రార్థన తరువాత మనసూ శరీరం కూడా తేలికపడినట్టు అనిపిస్తుంది. ఇదేమీ ఊహ కాదు, శాస్త్రీయమైన మార్పు.


మన సమాజంలో ‘దైవ చికిత్స’ అనేది ఒక పెద్ద భాగం. చాలా కుటుంబాలు సమస్యలతో ముందుగా దేవాలయాలు, మసీదులు, జ్యోతిషుల దగ్గరకే వెళ్తాయి. అయితే దృష్టి, పాప ప్రతిఫలం అనుకుంటూ కొందరు మందులు వాడరు. మానసిక ఆరోగ్యం విషయంలో భక్తి మనసుకు బలం ఇవ్వవచ్చు, కానీ వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. భక్తి మనసుకు బలం అయితే, వైద్యం మనసుకు ఉపశమనం. మసీదు, చర్చి, దేవాలయం దగ్గరే మానసిక ఆరోగ్య బూత్‌లు ఏర్పాటు చేయడం వల్ల రోగులు ప్రార్థన చేస్తూనే కౌన్సెలింగ్ కూడా తీసుకుంటారు. మంచి కుటుంబం, ప్రార్థన, వైద్యం ఈ మూడు కలిసి ఉన్నప్పుడు రోగులు వేగంగా కోలుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మానసిక రుగ్మతల విషయంలో ఈ తరహా వైద్య విధానంపై చర్చ జరగాలి.

డా. సనా కౌసర్

ఎండీ, సైకియాట్రీ

ఈ వార్తలు కూడా చదవండి...

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన

ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 02:53 AM