ఈపీఎస్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు చేయాలి
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:34 AM
ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద పింఛనుదారులకు ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. 2014 తర్వాత ఈ పెన్షన్ మొత్తాన్ని నేటి వరకు పెంచలేదు. భారీగా పెరిగిపోతున్న...
ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద పింఛనుదారులకు ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. 2014 తర్వాత ఈ పెన్షన్ మొత్తాన్ని నేటి వరకు పెంచలేదు. భారీగా పెరిగిపోతున్న జీవన వ్యయం కారణంగా ఈ పరిమితిని పెంచాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఈపీఎస్ పింఛనుదారులు ఉన్నారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కనీస పెన్షన్ పెంచాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కనీస పెన్షన్ పొందడం కోసం అర్హతగా ఉన్నటువంటి గరిష్ట వేతన పరిమితిని 12 ఏళ్ల అనంతరం ఇటీవల రూ.15,000 నుంచి రూ 25,000 వరకు పెంచారు. మధ్యతరగతితో సహా అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారాలు తీవ్రమైన ప్రస్తుత పరిస్థితులలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, కార్మికశాఖ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి కనీస పెన్షన్ను రూ.తొమ్మిది వేలకు పెంచాలి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)–2025 తీసుకువచ్చారు. ఈ పథకం క్రింద రోజుకు కనీస వేతనంగా అనేక రాష్ట్రాల్లో రూ.300కు పైగా చెల్లిస్తున్నారు. హర్యానా, కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో అయితే రోజుకు చెల్లించే వేతనం రూ.400 కంటే అధికంగా ఉన్నది. లక్షలాది మంది ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడూ తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఏ స్థాయిలో కూడా సమీక్షలు జరగడం లేదు. ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు, భారీగా పెరిగిన వైద్యం ఖర్చులు, ఇతర జీవితావసరాలను దృష్టిలో పెట్టుకుని ఈపీఎస్ కనీస పెన్షన్ను తొమ్మిదివేల రూపాయలకు పెంచడం సముచితంగా ఉంటుంది.
వి.వి.కె. సురేష్
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News