Share News

ఆరోగ్యం కోసం ‘ఈవీ’లకు మారుదాం!

ABN , Publish Date - May 01 , 2026 | 01:55 AM

ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని దేశాలనూ కలవరపరుస్తున్న ప్రధాన సమస్య కాలుష్యం! ముఖ్యంగా నగర ప్రాంతాలలో వాహనాలు, అవి ఉత్పత్తి చేసే పొగ వల్ల సంభవిస్తున్న వాయు కాలుష్యం అన్ని ప్రభుత్వాలను...

ఆరోగ్యం కోసం ‘ఈవీ’లకు మారుదాం!

ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని దేశాలనూ కలవరపరుస్తున్న ప్రధాన సమస్య కాలుష్యం! ముఖ్యంగా నగర ప్రాంతాలలో వాహనాలు, అవి ఉత్పత్తి చేసే పొగ వల్ల సంభవిస్తున్న వాయు కాలుష్యం అన్ని ప్రభుత్వాలను, స్వచ్ఛంద సంస్థలను, పర్యావరణ సంస్థలను ఆందోళనకు గురిచేస్తున్నది. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల ఆధారంగా నడిచే వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగి, అవి నగర వాతావరణంలోకి కాలుష్య కారక ఉద్గారాలను వదిలివేస్తున్నాయి. దీనివల్ల నగరాలు ప్రస్తుతం తీవ్ర వాహన కాలుష్యంతో సతమతమవుతున్నాయి.

ఈ సమస్యలకు పరిష్కారంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం, ఇతర అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు పర్యావరణ కాలుష్యాన్ని, నగర కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాల ఉపయోగాన్ని పెంచాలని, సంప్రదాయంగా పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల ద్వారా నడుపుతున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో కొత్త సంస్కరణలకు, ప్రజోపయోగమైన కాలుష్య రహిత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ఎన్నో చర్యలను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగానూ, నగర ప్రాంతాలలోనూ, ముఖ్యంగా హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాలలో– ప్రభుత్వ ఆర్టీసీ విభాగంలోనూ, ఇతర ప్రైవేటు వాహనాల పరంగానూ విద్యుత్తు వాహనాలను ఉపయోగించే విధంగా ప్రోత్సాహక చర్యలను చేపట్టింది. దీని కోసం కావలసిన సబ్సిడీలను కూడా అందిస్తూ ముందుకు వెళుతోంది. అదే సమయంలో భారత్ స్టాండర్డ్స్ అనుసరించి పదిహేను సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్న వివిధ వాహనాలను నిరుపయోగం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన ‘స్క్రాపింగ్ పాలసీ’ కూడా రూపొందించి దానిని సక్రమంగా నిర్వహిస్తూ కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలను అమలుపరుస్తూంది.


ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్జీవోలు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఇతర ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రభుత్వోద్యోగి ఎవరైనా విద్యుత్ వాహనం కొనుగోలు చేస్తే వారికి ప్రభుత్వ పక్షాన 20శాతం వరకూ ధరలో మినహాయింపు ఇచ్చే లాగా వివిధ విద్యుత్ వాహనాల ఉత్పత్తి సంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంది. వీటివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు సొంత వాహనం కొనుక్కోవాలి అనే కల తీరడం మాత్రమే గాక, మొత్తం వ్యయంలో దాదాపు 20శాతం వరకు తగ్గింపు ధరలకే ఆయా వాహనాలు లభిస్తాయి. దీనికితోడు మెయింటినెన్స్ పరంగా పెట్రోల్ డీజిల్‌తో నడిచే వాహనాల ద్వారా ప్రతి రోజూ అయ్యే ఖర్చు ఇక్కడ తగ్గుతుంది. మరొకవైపు ఇటీవల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, ఇరాన్–అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం, ఇంకా ఇతర అంతర్జాతీయ కారణాల వల్ల పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరల్లో పెరుగుదల, ఇంధన కొరత వంటి సమస్యలు భవిష్యత్తులో వచ్చినా వాటిని తట్టుకుని నిలబడగలిగే యంత్రాంగం మనకు సమకూరుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలను 20శాతం తగ్గింపు రేట్లకు ఇచ్చే నవ్య పథకానికి శ్రీకారం చుట్టి దేశంలోనే తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పర్యావరణానికి, కాలుష్య రహిత నగరాల సాధన దిశగా చేస్తున్న కార్యక్రమాలకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్య చెప్పకనే చెప్పినట్లయింది.

భారతదేశం రోజు రోజుకీ విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ కావటం వల్ల, అందుకు తగ్గట్టే వివిధ రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు పెరగడం వల్ల వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు, ఇతర వ్యాపార వాణిజ్య కేంద్రాలన్నీ ప్రధానంగా మెట్రో నగరాలు లేదా టైర్ 2, 3 నగరాలలో కేంద్రీకృతం కావడం వల్ల ఆ ప్రాంతాలలోనే వాహనాల ఉపయోగం రాకపోకలు విస్తృతంగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రతి ఏటా నగర వాయు కాలుష్యంలో 20 నుంచి 30శాతానికి ఈ వాహనాలే కారణమవుతున్నాయి. ఇవి నిరంతరం కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రో కార్బన్‌లు, సల్ఫర్ డై ఆక్సయిడ్, పర్టిక్యూలెట్ మ్యాటర్ (పి.ఎం.) వంటి ఎన్నో కాలుష్య కారక వాయువులను గాలిలో వదులుతున్నాయి. దీనివల్ల నగర ప్రజలలో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులు గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగినట్లుగా వైద్య ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


తెలంగాణలో ఇప్పుడు ప్రతి రోజూ సగటున 3వేలు, సంవత్సరానికి 9.3 లక్షల వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలో 2014లో 25 లక్షలుగా ఉన్న వాహనాల సంఖ్య 2018 నాటికి 50 లక్షలకు, ప్రస్తుతం 92 లక్షలకు చేరుకుంది. 2023–24లో మొత్తం వాహనాల సంఖ్య 1.63 కోట్లు కాగా, మార్చి 2025 నాటికి వాటి సంఖ్య 1.73 కోట్లకు, ప్రస్తుతం 1.82 కోట్లకు పైగా వాహనాలు ప్రతిరోజు రోడ్లపై సంచరిస్తున్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు అత్యధికంగా 56శాతం పైగా ఉండగా, త్రిచక్ర వాహనాలు 30శాతం, చతుర్ చక్ర వాహనాలు 14శాతం వరకు ఉన్నాయి. ఇవి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలే కాకుండా, ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా నిరంతరం తిరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ నగర జనాభా కోటీ 40లక్షలకు చేరుకుని, ఎంఎంటీఎస్, మెట్రో వంటి లోకల్ పబ్లిక్ రైల్వే రవాణా విధానం ద్వారా రోజూ లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ప్రైవేటు వాహనాల వినియోగ సంఖ్య కూడా విస్తృతంగా పెరుగుతోంది.

ప్రభుత్వపరంగా ఆర్టీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల రవాణా అవసరాలను తీరుస్తుండటమే గాక, మహిళల కోసం ఉచిత రవాణా సదుపాయాన్ని అందిస్తున్నప్పటికీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన వాహనాల సంఖ్య అంతకుమించి ఉండటం వల్ల నగరాల్లో వాహనాల ద్వారా ఉత్పత్తయ్యే కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణలో ఈ వాహన కాలుష్య తీవ్రతని పరిమితికి మించి ఎదగకుండా చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టమైన వ్యూహ రచనతో విద్యుత్ వాహనాల పాలసీని తీసుకువచ్చింది. అంతేగాక ప్రజలు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు విద్యుత్ వాహనాలను వాడటం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిర్ణయించింది. ఈ విద్యుత్ వాహనాలు కాలుష్య కారక వాయువులను పూర్తిగా నిరోధించడమే గాక, ధ్వని కాలుష్యం విషయంలో కూడా జీరో స్థాయిని చూపెడతాయి. విద్యుత్ వాహనాలు, వాటి ఇంజన్లు, ఇతర మెకానిజం అంతా బ్యాటరీలతో నడవడం వల్ల వాహనాల నడకలో ఏ మాత్రం ధ్వని కాలుష్యం ఏర్పడే అవకాశం లేదు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ విద్యుత్ వాహనాల ప్రోత్సాహక లక్ష్యాన్ని ప్రజలు, పౌరులందరూ గమనించి హైదరాబాద్ నగరాన్ని ‘ఈవీ హబ్’ (ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ హబ్‌)గా మార్చే దిశగా ప్రభుత్వానికి సహకరించాలని, తద్వారా తాము కూడా వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా లాభాన్ని ప్రయోజనాన్ని పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

పొన్నం ప్రభాకర్

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 01:55 AM