Share News

ఏది స్వార్థం? ఎవరిది స్వార్థం?

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:41 AM

‘స్వార్ధం వీడితేనే సామాజిక విప్లవం!’ అనే పేరుతో, (జూలై 17, ఆంధ్రజ్యోతి) వచ్చిన వ్యాసంలో, వ్యాసకర్త (అయిరబోయిన భిక్షపతి) చెప్పిన విషయాలు తర్కానికి నిలబడేవి కావు...

ఏది స్వార్థం? ఎవరిది స్వార్థం?

‘స్వార్ధం వీడితేనే సామాజిక విప్లవం!’ అనే పేరుతో, (జూలై 17, ఆంధ్రజ్యోతి) వచ్చిన వ్యాసంలో, వ్యాసకర్త (అయిరబోయిన భిక్షపతి) చెప్పిన విషయాలు తర్కానికి నిలబడేవి కావు.

(1) స్వార్ధానికి తగ్గట్టు మారిపోయే మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి- అన్నది వ్యాసకర్త వాదన. ఏ శ్రమలూ చెయ్యకుండా ప్రవచనాలు చెప్పిన పురాతన యోగులూ, రుషులూ; విదేశాలలో కూడా బోధనలు చెయ్యడానికి విలాసవంతమైన ఏర్పాట్లు చేసే ధనిక శిష్యులు గల అధునాతన గురువులూ -వంటి వారు చెప్పినవీ, చెప్పేదీ ఇవే మాటలు: ‘స్వార్ధాన్ని’ విడనాడాలీ, ‘మనిషి మనస్తత్వం’ మారాలీ- అనే! ఆ ప్రవచన కర్తలు గానీ, ఈ వ్యాసకర్త గానీ, బానిస యజమానుల కాలం నించీ ఈ నాటి పెట్టుబడిదారీ యజమానుల కాలం వరకూ జరుగుతున్న ‘శ్రమ దోపిడీ’ని మించిన స్వార్ధం లేదనీ, సమాజానికి మూలం అదే అనీ మాత్రం చెప్పలేదు!

(2) బుద్ధుడూ, అంబేద్కరూ, మార్క్సూ- ఈ ముగ్గురూ కూడా, మనిషిలో వున్న స్వార్ధ మనస్తత్వాన్ని తక్కువ అంచనా వేశారని వ్యాసకర్త అభిప్రాయం. కానీ, వాస్తవం అది కాదు. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గంలో స్వార్ధానికి చోటులేదు. అంబేద్కరు చెప్పిన కుల నిర్మూలనా మార్గంలో, అగ్రకులాల స్వార్ధానికి వీలులేదు. మార్క్సు చెప్పిన శ్రమ దోపిడీ వ్యతిరేక సిద్ధాంతంలో, శ్రమ దోపిడీయే అసలైన స్వార్ధం అనే భావన వుంది. బుద్ధుడూ, అంబేద్కరూ, ఇంకా అనేకమంది తత్వవేత్తలు, స్వార్ధాన్ని రకరకాలుగా వివరించారు గానీ, దాన్ని ఎలా నిర్మూలించాలో, దానికి వీలునివ్వని సమాజాన్ని ఎలా ఏ మార్గంలో ఏర్పర్చుకోవాలో మాత్రం మార్క్సులాగా చెప్పలేకపోయారు. అది వారి అవగాహనలకు వున్న పరిమితి.

(3) సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి, తన అనుచరులను సమానంగా చూడడని ఆశ్చర్యపోయారు వ్యాసకర్త. అలా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే, ఆ ‘పోరాడిన వ్యక్తి’కి సమానత్వం అంటే వున్న అవగాహనే తప్పుడు అవగాహన- అని ఈ వ్యాసకర్తకి అర్ధం కాలేదు. ఉదాహరణకి, ఫ్రెంచి విప్లవంలో వచ్చిన నినాదాలలో ‘సమానత్వం’ అనేది ఒకటి. ఆ నినాదాన్ని ఇచ్చింది, ఆ విప్లవానికి నాయకత్వం వహించిన పెట్టుబడిదారీ వర్గం, ఈ వర్గం, తనకి కావలిసిన విధంగా, అప్పటికి అధికారంలో వున్న రాచరిక వర్గంతో సమానత్వాన్ని కోరిందే గానీ, తన కిందే వున్న కార్మిక వర్గానికి తనతో సమానత్వం వుండాలని కోరలేదు. కాబట్టి, ‘సమానత్వం’ అని ఒక వ్యక్తి గానీ, ఒక వర్గం గానీ, ఒక కులం గానీ, అడిగితే, వాళ్ళు శ్రమ దోపిడీకి వీలునిచ్చే అసమానత్వ సంబంధాలను సమూలంగా మార్చాలని కోరుతున్నారో, లేదో చూస్తేనే, అది సమానత్వమో కాదో తెలుస్తుంది.


(4) మనిషి తనను తను పరిశీలించుకుని, ప్రశ్నించుకోవడం మొదలుపెట్టిన రోజునే, ‘అసలు విప్లవం’ మొదలవుతుందని వ్యాసకర్త తేల్చారు. మనిషి తన తప్పుని తెలుసుకోవడానికి, ఏ విప్లవ సిద్ధాంతమూ అక్కరలేదా? సరైన విప్లవ మార్గం తెలియకుండానే మనిషి, తనని తను ప్రశ్నించుకోవడం ఎలాంటిదంటే: ‘నిన్ను నువ్వు తెలుసుకో! అంతా నీకే బోధపడుతుంది!’ అని వేదాంతులు చెప్పేదానికీ, దీనికీ తేడాలేదు. మార్క్సు సిద్ధాంతం ఏమి చెపుతుందంటే: ‘నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే, నీ వర్గం ఏమిటో తెలుసుకోవడమే! వర్గాలే లేని, స్వార్ధానికి చోటులేని, నూతన సమాజం కోసం ఏమి చెయ్యాలో తెలుసుకో!’ అని.

(5) ‘స్వార్ధం! స్వార్ధం!’ అని పదే పదే ఉపదేశించే వారిని అడగవలిసిన ప్రశ్నలు కొన్ని: ఏది స్వార్ధం? బతకడానికి కావలిసిన ఉత్పత్తి సాధనాల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న వారిది స్వార్ధమా; ఆ సాధనాలతో శ్రమలు చేసి, శ్రమ దోపిడీకి గురి అయ్యే శ్రామికులది స్వార్ధమా? బానిసలది స్వార్ధమా, బానిస యజమానులది స్వార్ధమా? కష్టపడి పండించి కౌళ్ళు చెల్లించే కౌలు రైతులది స్వార్ధమా, ఏ శ్రమా చెయ్యకుండా, కేవలం భూమి మీద ఆస్తి హక్కు వల్ల కౌళ్ళ మీద బతికే భూస్వాములది స్వార్ధమా? అదనపు శ్రమలు చేసే కార్మికులది స్వార్ధమా, వారి శ్రమని దోస్తూ, పెట్టుబడుల్ని పోగుచేసుకునే పరిశ్రమల యజమానులది స్వార్ధమా?

చివరిగా: సమాజంలో వున్న శ్రమ సంబంధాలని పట్టించుకోకుండా, ‘స్వార్ధం’, ‘మనిషి మనస్తత్వం’ వంటి విషయాల గురించి ఎంత ప్రశ్నించినా, అది ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వదు. ఎందుకంటే, మనుషుల మనస్తత్వాలూ, వాటిలో భావాలూ, అవగాహనలూ, మంచి చెడ్డలూ, అన్నీ సమాజంలో వున్న శ్రమ సంబంధాలను బట్టే ఏర్పడతాయి! ఇది అర్ధం చేసుకోకుండా చెప్తే, ‘కొండను తవ్వి, ఎలకను కూడా పట్టనట్టు’ అవుతుంది!

రంగనాయకమ్మ

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 12:41 AM