Share News

A Memorable Literary Moment: ఘోస్ట్‌ రైటర్‌ ఉన్నాడా అన్నారు సినారె

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:41 AM

అది 1979. ‘పుస్తకాలు చదువుతూ పెరిగినవాణ్ణి. నా పుస్తకం వేసుకోకుంటే ఎట్లా?’ అన్న ప్రశ్న అంతరంగంలో గోల చేయసాగింది. వేసి తీరాలనే నిర్ణయం తీసుకున్నాను. ఒక రోజు సి. నారాయణ రెడ్డి గారిని...

A Memorable Literary Moment: ఘోస్ట్‌ రైటర్‌ ఉన్నాడా అన్నారు సినారె

అది 1979. ‘పుస్తకాలు చదువుతూ పెరిగినవాణ్ణి. నా పుస్తకం వేసుకోకుంటే ఎట్లా?’ అన్న ప్రశ్న అంతరంగంలో గోల చేయసాగింది. వేసి తీరాలనే నిర్ణయం తీసుకున్నాను. ఒక రోజు సి. నారాయణ రెడ్డి గారిని కలిసి నా కవితా సంపుటిని వారికి అంకితం ఇస్తున్నానని చెప్పాను. వారు వెంటనే ఒప్పుకున్నారు. ‘సృజన’వారి రాష్ట్ర స్థాయి కవితా రచన పోటీలో మొదటి బహుమతి వచ్చి అప్పటికి 13 సంవత్సరాలు. ‘ఇప్పటికే ఆలస్యం చేశారు’ అన్నారు నా సహాధ్యాయి కన్నసామి (కె.వి.ఎన్‌. ఆచార్య) గారు. కవితలు వెతికే పనిలో పడ్డాను. కొన్ని చెన్నకేశవరెడ్డి దగ్గర, కొన్ని లక్ష్మీనారాయణ దగ్గర దొరికాయి. నా దగ్గర ఉన్న వాటిలో కలిపితే 38 అయ్యాయి. అంధుల మీద 1967లో రాసిన ‘చీకటిలో బతుకు నీడ’ మంచి పేరు అవుతుందని ఒకరిద్దరు మిత్రులు అంటున్నా, ‘మిణుగురు’ పేరు బాగుందనిపించింది. అది– చిన్నది, స్వయం ప్రకాశం కలిగింది, చీకటిని వెలిగించేది!

ఒక ‘ముందుమాట’ నా అభిమాన విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారితో రాయించాలని ముందే నిర్ణయించుకున్నాను. కారణం ‘సృజన’లో బహుమతి పొందిన నా కవితను చదివి ‘‘అనుభూతి తీవ్రతలో వేణుగోపాల్‌ కవిత ఉత్తమంగా ఉంది’’ అని 1968లోనే తమ ‘సంవేదన’ పత్రికలో సమీక్షలో అని ఉన్నారు. 1979 నాటికి వారు రష్యా నుంచి తిరిగివచ్చి సీనియర్‌ పాత్రికేయులుగా ఒక పత్రికలో పని చేస్తున్నారు. ఆఫీసుకు వెళ్ళి కలిసాను. వారి ప్రశంసను వారికే గుర్తు చేసి ‘ముందుమాట’ రాయమని కోరాను. ‘నాకే పరీక్ష పెట్టారు’ అని నవ్వుతూ లిఖిత ప్రతిని తీసుకున్నారు.


నాకు ఇంగ్లీషు లెక్చరర్లన్నా, ఇంగ్లీషు సాహిత్యాన్ని చదువుకున్న రచయితలన్నా అభిమానం. వాళ్ళు షేక్‌స్పియర్‌, కీట్సుల వారసులనిపిస్తుంది. వేగుంట మోహనప్రసాద్‌ కవిత్వమన్నా ఇష్టమే. అందుకే వారికి ‘ముందుమాట’ రాయమని ఉత్తరం రాశాను. ఒప్పుకున్నారు. నెలలోపు ఇద్దరి ముందుమాటలూ వచ్చాయి. కన్నసామితన పాత్రికేయ మిత్రుడు, చిత్రకారుడు ‘అంజన్‌’తో ముఖచిత్రం వేయించారు.

అప్పుడు నేను మెదక్‌ జిల్లా సదాశివపేటలో పని చేస్తున్నారు. హైస్కూల్‌లో పని చేస్తున్న ఆత్మీయ మిత్రుడు బి. నరసింహారావు శ్రీసంగమేశ్వర ప్రెస్‌ పర్యవేక్షకుడు. అది చాలావరకు పెండ్లి పత్రికలు అచ్చు వేసే ప్రెస్‌. నా పుస్తకం అచ్చు వేయటానికి వెంటనే ఒప్పుకున్నాడు. ఆ ప్రెస్‌లో నరసింగరావు అనే మంచి ప్రెస్‌ కార్మికుడు ఉండేవాడు. అచ్చు తప్పులు ఎక్కువ రాకుండా పని కానిచ్చాడు.

1980 ఏప్రిల్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్తులో ‘మిణుగురు’ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త దేవులపల్లి రామానుజరావు గారు. విశిష్ట అతిథి ఇరివెంటి కృష్ణమూర్తి గారు. తిరుమల శ్రీనివాసాచార్య, చెన్నకేశవరెడ్డి వక్తలు. సభానిర్వహణ పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న కె.కె. రంగనాథాచార్యులు. జనం యాభైమంది దాకా వచ్చారు. రా.రా. కూడా సభకు రావటం విశేషం. శ్రీనివాసాచార్య నా కవితల్ని ఆశువుగా వినిపిస్తూ ప్రసంగించటం ఆకట్టుకుంది. ‘‘నేను ‘మిణుగురు’ను అంకితం తీసుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడటం సముచితం కాదు. వేణుగోపాల్‌ కవితల్ని చదివినప్పుడు వీటిని ఈయనే రాశాడా? వెనక ఎవరైనా ఘోస్ట్‌ రైటర్‌ ఉన్నాడా? అన్న అనుమానం కలుగుతుంది’’ అన్నారు సినారె. అంతా నవ్వారు. కన్నసామి వందన సమర్పణలో సభ ముగిసింది. టి.ఎల్‌. కాంతారావు, కడియాల రామ్మోహన్‌ రావు, తెలిదేవర భానుమూర్తి, రామహనుమాన్‌ (కళాసౌరభం) మొదలైనవారు వివరంగా సమీక్షించారు. ఆరుద్ర, సోమసుందర్‌ ఉత్తరాలు రాశారు. ‘మిణుగురు’లో ఉన్న ఆరేడు మినీ కవితలను బెంగుళూరు యూనివర్సిటీ వారు ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు (’90 దశకంలో). ‘బిచ్చగాడు’ కవితను ఎలనాగ ఆంగ్లంలోకి ‘ది బెగ్గర్‌’గా అనువదించగా, దాన్ని తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు వారు ఇంటర్‌ ఫస్ట్‌ యియర్‌ పాఠ్యాంశంగా పెట్టారు.


చాలామంది మిత్రులు ‘‘నీవు తప్ప నాకు మాత్రం యింకెవరున్నారు చెప్పు’’ అని మొదలయ్యే ‘పొలమారిన హృదయం’ కవితను గుర్తు చేస్తుంటారు. కె.వి.రమణాచారి గారు ‘మేధావి’ కవితను ఇష్టంగా వినిపిస్తారు. నవీన్‌ గారికి ‘ఓ మాట’ ఇష్టం. అందెశ్రీగారిని ఏలె లక్ష్మణ్‌ గారి ఆఫీసులో తొలిసారి కలిసినప్పుడు ‘‘అన్నా! నీ ‘మిణుగురు’ను ఎన్నిసార్లు చదివాన్నో’’ అంటూ ఆశువుగా రెండు మూడు కవితలు వినిపించారు. వేణు సంకోజ్‌, నోముల ‘చీకట్లో సైతం కళ్లు తెరిచి’ కవిత ఇష్టపడ్డారు. నాకు మాత్రం ‘ఎడారిలో – ఎండా కాలం’ బాగా ఇష్టం. ఆవిష్కరణ అప్పుడు డిగ్రీ ఫస్ట్‌ యియర్‌లో ఉన్న ఎండ్లూరి సుధాకర్‌ నా కవిత్వాన్ని తిలక్‌ కవిత్వంతో పోలుస్తూ పెద్ద ఉత్తరం రాశాడు. మూడు నాలుగేండ్లలో 700 కాపీలు అమ్ముడుపోయినై. అన్నట్టు ‘మిణుగురు’ రెండో ముద్రణ (2015) కాపీలు కూడా ఎప్పుడో అయిపోయాయి.

అమ్మంగి వేణుగోపాల్‌

94410 54637

ఈ వార్తలు కూడా చదవండి..

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

For More TG News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 12:41 AM