Share News

దేశభక్తికి గీటురాయి ఏది?

ABN , Publish Date - Jun 11 , 2026 | 01:40 AM

మన దేశంలో ‘దేశభక్తి’ అనే పదాన్ని కొందరు తమకు అనుకూలంగా వాడుకుంటూ, నచ్చని వారిపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. లద్దాఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం మంచు కొండల్లో...

దేశభక్తికి గీటురాయి ఏది?

మన దేశంలో ‘దేశభక్తి’ అనే పదాన్ని కొందరు తమకు అనుకూలంగా వాడుకుంటూ, నచ్చని వారిపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. లద్దాఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం మంచు కొండల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన సోనమ్ వాంగ్‌చుక్ అయినా, విద్యా రంగంలోని లోపాలను విశ్లేషించే బీహార్‌కు చెందిన ఖాన్ సర్ అయినా చేస్తున్న నేరం ఒక్కటే... ప్రశ్నించడం! వ్యవస్థలోని అక్రమాలను ప్రశ్నించినందుకు వీరిపై ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’ అని ముద్రలు వేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇదే బాటలో, వ్యవస్థలోని వైఫల్యాలను నిరసిస్తూ జెన్‌జీ యువత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఒక వ్యంగ్య ఉద్యమాన్ని మొదలుపెట్టింది. నిరుద్యోగం, పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థ నిర్వీర్యంపై వీరు చేస్తున్న పోరాటం, అధికారంలో ఉన్న వారికి మాత్రం ‘దేశద్రోహం’లా కనిపిస్తోంది.

నిజానికి, సమాజం కోసం పోరాడే ఈ యువతను, మేధావులను ‘బొద్దింకలు’ అని అవమానించడం లేదా ‘దేశద్రోహులు’ అని ముద్ర వేయడం ద్వారా అధికార పక్షం ఏం సాధిస్తోంది? మరోవైపు, బాబాల ముసుగులో తిరిగే నేరస్తులు, అత్యాచార నిందితులు చట్టం కళ్లగప్పి విచ్చలవిడిగా తిరుగుతున్నా, వారిపై కనీస చర్యలు తీసుకోని వ్యవస్థ, ప్రశ్నించే యువతపై మాత్రం ఉక్కుపాదం మోపుతోంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో యువత చేస్తున్న నిరసన, వాస్తవానికి నిరుద్యోగితా భయాన్ని, భవిష్యత్తుపై ఉన్న అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్న ఒక పెద్ద కేక. దీన్ని అణచివేయడం అంటే, దేశ భవిష్యత్తును అణచివేయడమే. అధికారం దన్నుతో ప్రశ్నించే గొంతుకలను నొక్కేయవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్న ఆవేదనను కాదు. ఈ ముద్రల రాజకీయాలను పక్కన పెట్టి, ప్రభుత్వం వాస్తవాలను గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. నిజమైన దేశభక్తి ఎక్కడో లేదు, మన చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటంలోనే ఉంది. నిరసనకారుల గొంతు వినడం, సమస్యలకు పరిష్కారం చూపడమే దేశానికి శ్రీరామ రక్ష. లేదంటే, ఈ ‘ముద్రలు’ వేసే రాజకీయాలు చివరకు వ్యవస్థనే నాశనం చేసే ప్రమాదం ఉంది.

ఆకం శివసాయి, నిజామాబాద్

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 01:40 AM