ఆంధ్రా పేరుతో కంపెనీలను ద్వేషించడం ఏమిటి?
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:41 AM
ఎవరో పొగ రాజేశారు. ఇంకెవరో ఆజ్యం పోశారు. ఆ వేడి కొందరికి సెగ పుట్టించగా, ఇంకొందరికి చలి కాచుకోవడానికి ఉపయోగపడుతోంది. మొత్తం మీద తెలంగాణవాదం మళ్లీ తెరమీదకు వచ్చింది.
ఎవరో పొగ రాజేశారు. ఇంకెవరో ఆజ్యం పోశారు. ఆ వేడి కొందరికి సెగ పుట్టించగా, ఇంకొందరికి చలి కాచుకోవడానికి ఉపయోగపడుతోంది. మొత్తం మీద తెలంగాణవాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. కొన్ని వివాదాలు చినికి చినికి గాలి వానగా ఎలా మారతాయో చెప్పడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ – జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య ఏర్పడిన వివాదమే నిదర్శనం. మధ్యలో కాంగ్రెస్ నాయకులు కల్పించుకోవడం, దానిపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలం తర్వాత మళ్లీ తెలంగాణవాదం చుట్టూ రాజకీయ క్రీడ మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో నష్టపోయింది ఎవరు? అంటే– ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కల్యాణ్. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం జరగగా, తెర వెనుక పాత్రకే పరిమితమైన భారత రాష్ట్ర సమితికి లాభం చేకూరిందని చెప్పవచ్చు. రెండున్నరేళ్ల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పవన్ కల్యాణ్ కలిసినప్పుడు ఫలానా సంభాషణ చోటుచేసుకుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న మాటలపై మొదలైన వివాదం అటు తిరిగీ ఇటు తిరిగీ తెలంగాణవాదం వరకూ వచ్చింది. జనసేన కార్యకర్తలు నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాను అన్న మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు. ఈ వివాదం అంతటితో సమసిపోలేదు. తెర వెనుక శక్తుల ప్రోద్బలంతో వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే హైదరాబాద్‌లో జనసేన తరఫున సభ జరపాలని ఆయన ఎందుకనుకున్నారో తెలియదు. ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అదే రోజున పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశంలో తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణవాదులు ప్రతిస్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం ఆంధ్రా–తెలంగాణ ప్రజల మధ్య వివాదంగా మారింది.
అవసరమా... అంటే!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పన్నెండేళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ర్టాల మధ్య వైషమ్యాలు అవసరమా? అంటే, కొంతమందికి అవసరమే! అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణవాదం తెరమీదకు వస్తోంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ల చేతిలోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వాళ్లను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం, జనసేనలు ఆ రాష్ట్రంలో పోటీ చేశాయి. ప్రజలు తెలుగుదేశం పార్టీని కొద్దో గొప్పో ఆదరించారు. 2023లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అయితే, ఆ పార్టీ సానుభూతిపరులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. క్లుప్తంగా నేపథ్యం ఇదీ. తెలుగుదేశం, జనసేన వల్ల తమకు నష్టం జరుగుతుందని భావిస్తున్న వాళ్లు ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో ఏమి పని? అని తరచుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే, 2023కు ముందు బీఆర్‌ఎస్ శాఖను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినప్పుడు అక్కడ మీకేం పని అని కేసీఆర్‌ను ఇవే స్వరాలు ప్రశ్నించకపోవడంలో లాజిక్ అంతుచిక్కదు. తెలంగాణవాదులకు ఆంధ్రా వాళ్లతో పేచీ ఎక్కడ వస్తోందంటే, రాజకీయ అధికారం కోసం పోటీపడటం దగ్గరే! తెలుగుదేశం–జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టకపోతే ఏ పేచీ ఉండదు. వివిధ సందర్భాలలో ఇది రుజువైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా వ్యాపారులు, ఆంధ్రా స్వాములను ప్రోత్సహించారు కదా! రాజకీయాలలో తప్ప మిగతా విషయాలలో ఆంధ్రా వారితో తమకు పేచీ లేదన్నట్టుగా బీఆర్‌ఎస్ వ్యవహరించడాన్ని చూశాం. దీన్నిబట్టే ప్రాంతీయవాదం అప్పుడప్పుడూ తెర మీదకు రావడానికి కారణం ఏమిటో స్పష్టమవుతోంది కదా! స్వపరిపాలన ఉండాలని తెలంగాణవాదులు కోరుకోవడంలో తప్పులేదు. వాంఛనీయం కూడా! తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం–జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ఈ రెండు పార్టీలూ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించబోతున్నట్టుగా నాగేశ్వర్‌తో వివాదం తర్వాత పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడారో తెలియదు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు. మరుసటిరోజే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తన స్వరం సవరించుకున్నారు.
హైదరాబాద్‌లో తీవ్రంగా ఆవేశపడిన ఆయన అమరావతిలో కూనిరాగాలు తీశారు. పుష్కర కాలం తర్వాత కూడా తెలంగాణవాదం బలంగా ఉందన్న విషయం తనకు తెలియదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం స్వరాష్ట్రం అన్న భావన ఉండదని ఒకింత నిర్వేదంతో అన్నారు. తెలంగాణ ప్రజలలో తెలంగాణవాదం అణువణువునా ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ మాత్రం నిజాం ఏలుబడిలో ఉండింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కొంత కాలం నిజాం పాలనలోనే ఉండింది. రజాకార్ల వ్యతిరేక పోరాటం సందర్భంగానే తెలంగాణ వారికి ఆంధ్రా వారితో కొద్దో గొప్పో సంబంధాలు ఏర్పడ్డాయి. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతం విడిపోయి వేరే రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తమపై ఆంధ్రా నాయకుల పెత్తనం ఏమిటి? అన్న ప్రశ్న అప్పటి నుంచీ తెలంగాణ ప్రజలను తొలుస్తూనే ఉంది. ఫలితంగానే 1969లో, ఆ తర్వాత 2002లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది చరిత్ర. అయినా తెలంగాణవాదం నేటికీ సజీవంగా ఉండటానికి కారణం రాజకీయమే. నిజానికి చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ తెలంగాణ వనరులను దోచుకోలేదు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కల రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములను కబ్జా చేశారని ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్ కో ఆరోపించేవారు. తెలంగాణ వనరులను దోచుకున్న రాజశేఖరరెడ్డి కానీ, ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి కానీ తెలంగాణవాదులకు టార్గెట్‌గా ఉండకపోవడం గమనార్హం. తెలంగాణ రాజకీయాల్లో జగన్మోహన్‌రెడ్డి వేలుపెట్టడం లేదు. అందుకే ఆయనను తెలంగాణవాదులు గానీ, వారి వెనుక ఉన్న బీఆర్‌ఎస్ గానీ టార్గెట్ చేసుకోవడం లేదని చెప్పవచ్చు. దీన్నిబట్టి ప్రస్తుత వివాదంలో ఎవరి ఆంతర్యం ఏమిటన్నది స్పష్టమవుతోంది.
విశ్లేషణలూ... వివాదాలు!
తాజా వివాదానికి కారకుడైన ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం తీసుకుందాం! తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎంకు నాగేశ్వర్ సానుభూతిపరుడన్నది బహిరంగ రహస్యమే. అలాంటి నాగేశ్వర్ జనసేనానితో వివాదం తర్వాత తెలంగాణవాదుల సహకారం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తాను నిష్పక్షపాతంగా విశ్లేషణలు చేస్తానని ఆయన చెప్పుకొంటారు. తాజా వివాదం వల్ల ఆయన కూడా వివాదాస్పదుడయ్యారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నప్పుడు పూలతో పాటు రాళ్లు కూడా పడతాయని ఆయనకు తెలియదా? రాజకీయాలలో ఉన్నవారికి నలుగుపెట్టే ప్రయత్నం చేసినప్పుడు వారి అభిమానులు మనకు కూడా నలుగు పెట్టే ప్రయత్నం చేయకుండా ఎందుకుంటారు? స్వీయ రక్షణ కోసం తెలంగాణవాదాన్ని ఆశ్రయించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను కోల్పోలేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సీపీఎం సానుభూతిపరుడని, సదరు సీపీఎం పరోక్షంగా జగన్మోహన్‌రెడ్డికి మద్దతు ఇస్తోందన్న గుసగుసలు ఇప్పుడు బహిర్గతం కావడంతో ఆయనకు ఎంతో కొంత నష్టం జరగకుండా ఉంటుందా? ఇప్పుడు తాజా వివాదంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి చూద్దాం! పవన్ కల్యాణ్ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆచితూచి స్పందించగా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు రెచ్చిపోయారు. 2023 ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లతో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఇది కూడా ఒక కారణం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సెటిలర్ల ఓట్లు ప్రధాన కారణం. ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లోని మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
దీనిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, తెలంగాణ ప్రజలలో ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత లేదు. 1983 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్‌ను పెద్దగా ఆదరించకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల తెలంగాణలోనూ క్రమంగా ఆదరణ పెరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ తిరుగులేకుండా పోయింది. ఈ కారణంగానే తెలంగాణవాదులు అనబడేవారు కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయితే, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్ల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు రేవంత్‌రెడ్డి ప్రత్యర్థులకు ఒక అవకాశంగా చిక్కింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఉదంతం తెర మీదకు రావడంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు నోటికి పని చెప్పారు. నిజానికి తెలంగాణ సెంటిమెంటును రగిలించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ సెంటిమెంటు ఏ రూపంలో బలపడినా అది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మాత్రమే లాభిస్తుంది. అయినా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బలహీనపరచడానికి చేసిన చర్యగానే భావించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారీ చెప్పిన తర్వాత సమసిపోవలసిన వివాదం ఇంత దూరం రావడానికి... ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడమే కారణం. తమ పార్టీకి ఏ రూపంలోనూ ఉపయోగపడని విషయంలో కాంగ్రెస్ పార్టీ తలదూర్చడం ఆ పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. మొత్తంగా చూస్తే తాజా వివాదం కాంగ్రెస్ పార్టీతో పాటు పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఎంతో కొంత నష్టమే జరిగింది తప్ప లాభం కలగలేదు. ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించిన బీఆర్‌ఎస్‌కు నికరంగా లాభం చేకూరిందని చెప్పవచ్చు. తెలుగుదేశం–జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏ రూపంలో ప్రవేశించినా ప్రతిఘటన ఉంటుందని స్పష్టం అవుతున్నందున... బీజేపీ కూడా భవిష్యత్తులో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిణామం కూడా బీఆర్‌ఎస్‌కు లాభిస్తుంది.
ఆ మాటలు అభ్యంతరకరం..
ఈ లాభనష్టాల విషయం అటుంచితే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొంతమంది తెలంగాణవాదులు ఈ సందర్భంగా చేస్తున్న ప్రకటనలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి కంపెనీలకు తెలంగాణలో కాంట్రాక్టులు ఇవ్వబోమని మంత్రిగా కోమటిరెడ్డి చెప్పడం, ఆంధ్రా కంపెనీలు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాలని తెలంగాణవాదుల ముసుగులో కొంత మంది నోరు పారేసుకోవడం అభ్యంతరకరం. మంత్రిగా ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటువంటి ప్రకటనలు ఎలా చేస్తారో తెలియదు! తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమే కనుక అందరం భారత రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి. కోమటిరెడ్డి సోదరుల కంపెనీలు ఇతర రాష్ర్టాలలో పనులు చేయడంలేదా? ఆ రాష్ర్టాలకు చెందినవారు కూడా ఇదే వైఖరి అవలంభిస్తే వారి కంపెనీల పరిస్థితి ఏమిటి? సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు రెండు రాష్ర్టాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి దోహదపడతాయే గానీ తెలంగాణకు మేలు చేయవు. 58 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండటం వల్లగానీ, నాటి ముఖ్యమంత్రుల నుంచి అందిన ఆహ్వానం వల్లగానీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వచ్చి పరిశ్రమలు నెలకొల్పారు. వ్యాపారాలు ప్రారంభించారు. ఇలాంటి వారిని కూడా దోపిడీదారులుగా పరిగణిస్తూ నోటికి పనిచెబుతున్న వాళ్లు ఒక వాస్తవాన్ని గుర్తించాలి. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలించినప్పుడు మన సంపదను తమ దేశానికి తరలించుకొని పోయారు. ఆంధ్రా వాళ్లు తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించి లాభాలను ఆంధ్రా ప్రాంతాలకు తీసుకెళ్లడం లేదే? ఇక్కడే పెట్టుబడిగా పెడుతున్నారు కదా? తమ కంపెనీల ప్రధాన కార్యాలయాలను ఆంధ్రా ప్రాంతంలో పెట్టుకోలేదే? హైదరాబాద్‌లోనే కార్యాలయాలను పెట్టుకున్నారు కదా! అంటే, తమ సంపాదనపై పన్నులను ఇక్కడే కడుతున్నారు. వారు చెల్లించే ఆదాయం పన్ను, జీఎస్టీల నుంచి తెలంగాణకు వాటా లభిస్తోంది కదా? పెట్టుబడులకోసం బహుళ జాతి కంపెనీలకు మనం ఎర్ర తివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నాం. ఆ కంపెనీలు తమ లాభాలను మన దేశంలో పెట్టుబడులుగా పెట్టకుండా స్వదేశాలకు తరలించుకుపోతున్నాయి.
అయితే ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి విదేశీ కంపెనీలు కూడా దోహదపడుతున్నాయి. విదేశీ కంపెనీలనే స్వాగతిస్తూ ఇక్కడి సంపదను, వనరులను ఇక్కడే వినియోగిస్తున్న కంపెనీలను ఆంధ్రా పేరుతో ద్వేషించడం ఏమిటి? హైదరాబాద్‌లో పరిశ్రమ పెట్టి లేదా వ్యాపారం చేస్తూ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే తప్పు పట్టాలి కానీ ఇక్కడి సంపదను ఇక్కడే వినియోగిస్తే దోచుకోవడం ఎలా అవుతుంది? ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వాళ్లు మద్రాసులో ఉండి సినీ రంగంలో శ్రమించి కూడబెట్టుకున్న సంపదను హైదరాబాద్‌లోనే పెట్టుబడిగా పెట్టారు. మద్రాసులో వారికి పెద్దగా ఆస్తులు కూడా లేవే? అలా అని ఆంధ్రాలో కూడా లేవు. చివరకు వారు ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు. అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని కనుక ఎందుకొచ్చారు? అని ప్రశ్నించడం సహేతుకం కూడా కాదు. ఉమ్మడి రాష్ర్టాన్ని ఎందుకు ఏర్పాటుచేశారని ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పాలి? అందుకు కారణమైన వారు ఇప్పుడు మన మధ్య లేరు కదా? తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంకుచితంగా ఆలోచించడం ఎంతవరకు సమంజసం? ఆంధ్రా ప్రాంతం వారైనా, మిగతా రాష్ర్టాలకు చెందిన వారైనా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. ఈ మట్టిలోనే కలసిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇక్కడ ఇల్లెందుకు? అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? ఆయన ఏర్పాటు చేసిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉంది కదా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నందున అక్కడికి తరలించుకుపోలేదే? ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి కంపెనీల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నందున సాలీనా కొన్ని వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు.
ఆయా కంపెనీలు, పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి వేల కోట్ల రూపాయలు జీతభత్యాల కింద చెల్లిస్తారు. ఆ డబ్బు కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోకే వస్తోంది కదా? వనరులు, సంపదను దోచుకొని తీసుకెళ్లిపోవడం వేరు. తెలంగాణ ఆర్థిక ఆభివృద్ధికి దోహదపడటం వేరు. చౌకబారు వ్యాఖ్యలు చేసేవారు ఈ తేడాను గుర్తించాలి. తెలంగాణవాదానికి తమదే పేటెంట్ అని చెప్పుకొనే బీఆర్‌ఎస్ తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంత మంది కాంట్రాక్టర్లను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించిందో చెప్పాలి. ప్రాంతం పట్ల, ఆ ప్రాంతానికి చెందిన వారి పట్ల నిజంగా అభిమానం ఉంటే వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లయింది. తెలంగాణకు చెందిన ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారో చెప్పగలరా? తెలంగాణవాదులుగా చెప్పుకొంటున్న వారు ఇందుకోసం కొట్లాడాలిగానీ, ఆంధ్రా ప్రాంతం పేరిట అకారణంగా ద్వేషించడం వల్ల ప్రయోజనం ఉండదు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకోసం ఎన్నో వివాదాలను తెర మీదకు తెస్తుంటాయి. అసలు సిసలైన తెలంగాణవాదులు ఆ మాయలో పడకుండా ప్రాంత ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం కొట్లాడాలి. వాదం పేరిట గుప్పెడు మందికి ప్రయోజనం చేకూరినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరినట్టు కానేకాదు. ప్రాంతాలుగా విడిపోయినందున ప్రజలుగా కలసిమెలసి తెలుగుజాతిగా అభివృద్ధి చెందడానికి పరస్పరం సహకరించుకోవడం మంచిది. వ్యక్తుల రక్షణ కోసం తెలంగాణవాదం కవచంగా మారడం విషాదం కాక మరేమిటి? తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. వాటిని సఫలం చేయడం కోసం ప్రయత్నాలు జరగాలి. ద్వేషాలకు స్వస్తి చెప్పి ఆ దిశగా కృషి చేస్తారని ఆశిద్దాం! వ్యక్తుల కోసం, పార్టీల స్వార్థ ప్రయోజనాలకోసం తెలంగాణవాదాన్ని దుర్వినియోగం చేయబోరని ఆశిద్దాం!