డీలిమిటేషన్ ‘ప్లాన్ బి’.. విపక్షాలకు సవాల్!
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:58 AM
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)కు ప్రభుత్వం ఎందుకు అంతగా ఆరాటపడుతోంది? ఆ ప్రశ్నను లోతుగా తరచి చూస్తే రాబోయే పార్లమెంటు సమావేశాలలో...
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)కు ప్రభుత్వం ఎందుకు అంతగా ఆరాటపడుతోంది? ఆ ప్రశ్నను లోతుగా తరచి చూస్తే రాబోయే పార్లమెంటు సమావేశాలలో తమ వ్యూహంపై ప్రతిపక్షాలు పునరాలోచన చేయడం అనివార్యమవుతుంది. మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టి కొత్త డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని కూడగట్టుకునేందుకు ప్రభుత్వం చేయవలసినవన్నీ చేస్తోంది. నరేంద్ర మోదీ–అమిత్ షా ద్వయం తమ ప్రయత్నంలో విజయం సాధించబోతున్నారని, పార్లమెంటు ప్రత్యేక సమావేశం త్వరలోనే జరగనుందని ‘విశ్వసనీయ వర్గాలు’ ప్రతి వారం చెబుతూనే ఉన్నాయి. సుప్రియా సూలే మొదలైన విపక్ష నేతలు చేస్తున్న బహిరంగ ప్రకటనలను గమనిస్తే పాలక పక్షం శ్రేణులు గప్పాలు కొట్టడం లేదని అర్థమవుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ (నిరవధికంగా ముగించకపోవడం) చేయకపోవడం, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు అధికార పక్షం ససేమిరా అనడం, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో జనాభా గణనను ముందుగానే చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తుంటే, డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం పొందే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోంది.
ఎన్నికల సంఘం తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు వెల్లువెత్తడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతుండడం, తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయ రాజకీయాలలో పెనుమార్పులు, వాతావరణ మార్పును నిరోధించడంపై కీలక చర్చలు విఫలమవడం తదితర జాతీయ, అంతర్జాతీయ సమస్యల నడుమ, నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే లోక్‌సభ ఎన్నికలలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తోంది. కారణం స్పష్టమే. అధికార పక్షం స్వల్పకాలిక, దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలకు నియోజకవర్గాల పునర్విభజన అత్యంత కీలకమైనది. ఇప్పటివరకు డీలిమిటేషన్‌పై మన చర్చ వివిధ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పునఃకేటాయింపుపైనే ప్రధానంగా జరుగుతోంది. కానీ డీలిమిటేషన్లో మరో రెండు కీలక అంశాలు కూడా ఉన్నాయి. అవి: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను సరికొత్తగా నిర్ణయించడం; ఎస్సీ, ఎస్టీలకు, ఇప్పుడు మహిళలకు ‘రిజర్వ్డ్’ నియోజకవర్గాలను పునఃకేటాయించడం.
భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా రాజకీయ ప్రయోజనం పొందేందుకు పార్లమెంటులో ప్రాంతీయ సమతౌల్యతను మార్చివేసేందుకు ప్రయత్నిస్తోందనే భయసందేహాలు ప్రతిపక్షాలలో బలంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి రాకుండా అవి ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయి. 2027 జనాభా గణన వివరాల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునఃకేటాయింపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం లభిస్తే అది బీజేపీకి పెద్ద విజయం అవుతుంది. ఆ ఆమోదం ఫలితంగా దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఉత్తర భారతావనిలోని ‘హిందీ భాషా రాష్ట్రాల’ ప్రాబల్యం పెరుగుతుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా బీజేపీ అమలు చేయాలనుకున్న ‘ప్లాన్ ఏ’ ఇదే. లోక్‌సభలో హిందీయేతర భాషా రాష్ట్రాల సీట్ల వాటా తగ్గిపోవడమనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఆ సభలో మొత్తం సీట్ల సంఖ్యను 850కి పెంచడం ప్లాన్ ఏలో ఒక ప్రధాన ప్రతిపాదన. దీని ప్రకారం కేరళలో ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 20 యథాతథంగా ఉంటుంది. అయితే అది ప్రస్తుతమున్న 545 స్థానాల్లో 20 కాదు; విస్తరించిన 850 స్థానాల్లో 20 మాత్రమే అవుతుంది. ఇది బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలకు, శాశ్వత మెజారిటీ సాధనకు మాత్రమే సరిగ్గా ఉపయోగపడుతుంది.
గత ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడంలో అధికార పక్షం వైఫల్యం ఈ ‘ప్లాన్ ఏ’ పరిమితులను తేటతెల్లం చేసింది. బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించే పరిస్థితి లేదని స్పష్టమైంది. మరోవైపు దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే ఎన్నికల విజయాలు రుచి చూస్తున్న బీజేపీ, ఈ ప్రాంతంలో తన తలుపులను శాశ్వతంగా మూసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ‘ప్లాన్ బి’ వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతానికి సమాఖ్య సమతుల్యత (ఫెడరల్ బ్యాలెన్స్)కు భంగం కలిగించకుండా డీలిమిటేషన్ ప్రక్రియను శీఘ్రగతిన పూర్తి చేయడమే ఈ ప్లాన్ బి. విస్తరించిన లోక్‌సభలో ప్రతి రాష్ట్రం సీట్ల వాటాను యథాతథంగా కొనసాగించేందుకు అధికార పార్టీ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతమున్న లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50శాతం మేరకు పెంచుతామని గతంలో మౌఖికంగా ఇచ్చిన హామీని కొత్త డీలిమిటేషన్ బిల్లులో చేర్చేందుకు సైతం బీజేపీ సిద్ధమవుతోంది. ఈ ప్రకారం కేరళలో ప్రస్తుత లోక్‌సభ సీట్ల (18 జనరల్, 2 రిజర్వ్డ్) సంఖ్య 30కి పెరుగుతుంది. ఈ ఉపశమనం ఇవ్వడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ పట్ల ప్రతిపక్షాల వ్యతిరేకతను తగ్గించవచ్చని, తద్వారా అసలు రాజ్యాంగ సవరణ బిల్లును, సవరించిన డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో సులభంగా ఆమోదింపజేసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ప్లాన్ బి ద్వారా మూడు లక్ష్యాలు సాధించుకునే వెసులుబాటు అధికార పార్టీకి లభిస్తుంది. మొదటిది–2029 సార్వత్రక ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దులను సరికొత్తగా నిర్ణయించేందుకు ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. ఇప్పటివరకు ఒక సాధారణ ప్రక్రియగా ఉన్న నియోజకవర్గాల పునర్విభజనను ఎన్నికలలో భారీ విజయావకాశాల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో అసోం, జమ్మూ–కశ్మీర్‌లలో మనం ఇప్పటికే చూశాం. ఓటర్ల మత, కుల కూర్పుకు అనుగుణంగా అతి సూక్ష్మంగా రూపొందించిన సరికొత్త ఎన్నికల మ్యాప్ ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయం సొరుగులో సిద్ధంగా ఉందని భావించవచ్చు. ఆ మ్యాప్‌కు చట్టబద్ధత కల్పించేందుకై ఒక కొత్త డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించడమే ప్రస్తుత ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. దీనివల్ల ఎన్నికలు ప్రారంభం కాకముందే 30 నుంచి 50 లోక్‌సభ స్థానాలు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ ప్లాన్ బిలోని రెండవ ప్రధానాంశం కీలక ప్రతిపక్ష నాయకులకు బాగా నష్టం వాటిల్లేలా ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రిజర్వ్డ్ సీట్లను కేటాయించడం. రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి, ప్రియాంకగాంధీ గెలిచిన వయనాడ్ వంటి లోక్‌సభ నియోజకవర్గాలు 2029 ఎన్నికలలో రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా మారితే మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. వెరసి, 2028 సంవత్సరాంతానికి భారతదేశ లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపస్వభావాలు పూర్తిగా మారిపోవడం మనం చూస్తాం. తద్వారా, బీజేపీకి అనుకూలంగా తీర్చిదిద్దిన సరికొత్త పిచ్‌పై కొత్త నిబంధనల మధ్య ప్రతిపక్షాలు తలపడవలసి వస్తుంది!
చివరిగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు త్వరలో ప్రారంభమయ్యే సమావేశాలలో ఆమోదం పొందగలిగితే అది బీజేపీకి ఎనలేని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. భవిష్యత్తులో లోక్‌సభ సీట్ల పునఃకేటాయింపు అనేది ఒక స్థిరమైన రాజ్యాంగ సూత్రానికి కట్టుబడి ఉండదు; ప్రభుత్వం సాధారణ చట్టం ద్వారానే లోక్‌సభలో ప్రాంతీయ సమతౌల్యతను మార్చివేయగలుగుతుంది. ప్రతిపక్షాలు ఇప్పుడు దీనినే ఎదుర్కోవలసి ఉంది. ఇప్పటివరకు అవి ‘ప్లాన్ ఏ’ను సమర్థంగా ఎదుర్కొని నిలువరించాయి. ప్రభుత్వం మళ్లీ అదే ప్రతిపాదనను తీసుకొస్తే అడ్డుకునేందుకు ‘ఇండియా’ కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను మళ్లీ తీసుకురాకపోవచ్చు. కనుక ప్రతిపక్షాలు ఇప్పుడు ‘ప్లాన్ బి’ని ఎదుర్కొనేందుకు సమాయత్తమవాలి. ఇది అంత సులభం కాదు, ఎందుకంటే ప్రస్తుత తరుణంలో పార్లమెంటులో అధికార పక్షానికే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న ప్రస్తుత నిలిపివేత (ఫ్రీజ్) గడువు 2027 జనాభా గణన వివరాలు విడుదలైన వెన్వెంటనే ఆటోమేటిక్‌గా ముగిసిపోతుంది. కొత్త డీలిమిటేషన్ చేపట్టడానికి ప్రభుత్వానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. గత చట్టాల తరహాలోనే ఒక కొత్త డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకువస్తే సరిపోతుంది. దానిని సాధారణ మెజారిటీతో ఆమోదించుకోవడం ద్వారా ‘ప్లాన్ బి’లోని మొదటి రెండు లక్ష్యాలను ప్రభుత్వం సులభంగా నెరవేర్చుకోగలదు. ఎన్నికల ప్రజాస్వామ్యంపై జరగనున్న ఈ కొత్త దాడిని సమర్థంగా తిప్పికొట్టాలంటే ప్రతిపక్షాలకు రాజకీయ కుశలత, పార్లమెంటరీ చాతుర్యం, ప్రజాసమీకరణ దక్షత చాలా అవసరం.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News