Share News

రాజకీయ ఉపాధికే డీలిమిటేష‌న్!

ABN , Publish Date - May 16 , 2026 | 02:07 AM

ఈ మ‌ధ్య భార‌త పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశంలో డీలిమిటేష‌న్ బిల్లు (131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ) పార్ల‌మెంటులో వీగిపోయింది. అయితే ఈ బిల్లు పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందినా ఇప్పుడున్న స్థానాల‌కు 50శాతం...

రాజకీయ ఉపాధికే డీలిమిటేష‌న్!

ఈ మ‌ధ్య భార‌త పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశంలో డీలిమిటేష‌న్ బిల్లు (131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ) పార్ల‌మెంటులో వీగిపోయింది. అయితే ఈ బిల్లు పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందినా ఇప్పుడున్న స్థానాల‌కు 50శాతం అధికంగా, అంటే 543 స్థానాల పార్ల‌మెంట్ 815 స్థానాలకు, 119 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీ 178 స్థానాలకు పెరిగి ఉండేది. ఇప్పుడు ఈ బిల్లు వీగిపోయింది. కానీ 2026 జ‌నాభా లెక్క‌ల ఆధారంగా మూడేళ్ళ త‌రువాత డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ మ‌ళ్ళీ తెర‌పైకి రావ‌చ్చు.

లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం ఉన్న 543 స‌భ్యుల‌లో 50శాతం మందికి నేర‌చ‌రిత్ర ఉంది, అలాగే 93శాతం మంది కోటీశ్వ‌రులు. కొద్దిమంది స‌భ్యులు త‌ప్ప మిగిలినవారు స‌భ‌కు రావ‌డం, చ‌ర్చ‌లో పాల్గొన‌డం, ప్ర‌జాస‌మ‌స్య‌లు ప్ర‌భుత్వ దృష్టికి తీసుకొని ప‌రిష్కారం క‌నుగొన‌డం లాంటిది చేయ‌డం లేదు. కేవ‌లం అధికారం కోసమే వారు ప్ర‌జాప్ర‌తినిధులు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నాయ‌కుడు గ‌త రెండున్న‌రేళ్ళుగా ఎన్నిసార్లు స‌భ‌కు హాజ‌రయ్యాడన్నది తెలిసిందే. డీలిమిటేష‌న్ ద్వారా భార‌త పార్ల‌మెంట్‌లో 815 మంది స‌భ్యులు కొలువుదీరినా అది ఒక క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌గా మారుతుందే త‌ప్ప ఒక చ‌ట్టస‌భ మాదిరిగా ఉండ‌దు.

ప్ర‌తి పార్ల‌మెంట్ స‌భ్యుడిపై సాలీన రూ.4 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. అలాగే శాస‌న‌స‌భ్యునిపై ఖ‌ర్చు రెండు కోట్ల వ‌ర‌కు ఉంటుంది. డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌తో దేశం మొత్తంపై అద‌నంగా ఐదేళ్ళలో రూ.40 నుంచి 50 వేల కోట్ల‌ భారం ప‌డ‌వ‌చ్చు. ఏ విధంగా చూసినా ప్రస్తుత ప‌రిస్థితుల‌లో డీలిమిటేష‌న్ రాజ‌కీయ ఉపాధికి త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే చ‌ర్య కాదు. వ‌చ్చే ఇరవై సంవ‌త్స‌రాల వ‌ర‌కు అంటే 2047 వ‌ర‌కు డీలిమిటేష‌న్ ఫ్రీజ్‌ చేయ‌వ‌ల‌సిన అవ‌స‌ర‌ముంది.

రాజ‌కీయ ‌పార్టీలు గెలుపు గుర్రాల వేట మాని విద్యావంతులకు, స‌చ్ఛీలురుకు టికెట్లు ఇస్తే రాష్ట్ర శాస‌న‌స‌భ‌లోను, దేశ పార్ల‌మెంటులోను మంచివారు కూర్చొని దేశాన్ని ప్ర‌గ‌తిబాట‌లో న‌డుపుతారు. ప్ర‌స్తుతం కావ‌ల‌సింది వాసి కాని రాశి కాదు. అవ‌స‌ర‌మైతే రాజ్యాంగ సవరణ చేసి శాస‌న సభ, పార్ల‌మెంట్ స‌భ్యుల సంఖ్య పెంచ‌కుండా ఉంటే బాగుంటుంది.

యం.ప‌ద్మ‌నాభ‌రెడ్డి,

ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 02:07 AM