డీలిమిటేషన్: దక్షిణాది రాష్ట్రాల సెల్ఫ్‌గోల్!
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:58 AM
ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఎండాకాలం దుమారాన్ని తలపించేలా మాటల దాడులు హోరెత్తాయి. వేడి చల్లారాక ఇప్పుడు వెలుతురు ప్రసరిస్తోంది....
ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఎండాకాలం దుమారాన్ని తలపించేలా మాటల దాడులు హోరెత్తాయి. వేడి చల్లారాక ఇప్పుడు వెలుతురు ప్రసరిస్తోంది. ఆవేశం స్థిమితపడి తర్కం, ఆత్మవిమర్శ మొదలయ్యాయి. గెలుపోటములకు అతీతంగా ఏదో అసాధారణ పరిణామం అత్యున్నత చట్టసభలో చోటుచేసుకుందని అర్థమవసాగింది. అనుమానం పెనుభూతమై అసలుకే మోసం తెచ్చుకున్నామా? అనే మీమాంస మొదలైంది.
లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు మూడోవంతు సీట్లు పదిహేనేళ్ల పాటు విధిగా కేటాయించటం ఇప్పటికే 106వ సవరణ రూపేణా రాజ్యాంగంలో భాగమైంది. ఇప్పుడు లోక్‌సభలో వీగిపోయిన 131వ సవరణ ద్వారా రెండు కీలక మార్పులకు సంకల్పించారు. మహిళలకు సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను 2026 జనగణనతో సంబంధం లేకుండా చేయటం; లోక్‌సభ సభ్యుల సంఖ్యను యాభై శాతం పెంచటం.
2026 జనగణన పూర్తయ్యేవరకూ వేచివుండాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గాల పునర్విభజనను వేగవంతం చేయటం, 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆ ప్రక్రియను పూర్తి చేయటం ఇందులో సానుకూలాంశం. గత 25 ఏళ్లకు పైగా, పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతో, నియోజకవర్గాల మధ్య పరిమాణంలో అంతరం అంతకంతకూ పెరుగుతోంది. ఉదాహరణకు, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని మల్కాజిగిరి నియోజకవర్గ జనాభా 50 లక్షలకు పైగా ఉంది. కాబట్టి, డీలిమిటేషన్ అవసరం.
వీగిపోయిన బిల్లులు పార్లమెంటుకిచ్చిన అధికారమల్లా– డీలిమిటేషన్‌కు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన జనగణన సంవత్సరాన్ని నిర్ణయించటం. 2029 నాటికల్లా మొత్తం పునర్విభజనను పూర్తిచేయటానికి.. ఇప్పటివరకూ చివరిగా అందుబాటులో ఉన్న 2011 డీలిమిటేషన్ గణాంకాలను పార్లమెంటు ఆధారంగా చేసుకుంది. సభలో అధికారిక ప్రకటనలు ఈ మేరకు సూచించాయి.
లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచటం అనేకమందిలో ఉత్కంఠ రేపినట్లు కనిపిస్తోంది. కానీ మహిళా రిజర్వేషన్ లేదా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు అంశాలకు, దీనికి ప్రత్యక్ష సంబంధమేమీ ఉండదు. మన జనాభా భారీగా పెరిగిన రీత్యా, ప్రతినిధుల సంఖ్యను పెంచటం సబబైన ప్రతిపాదన. కానీ సగటు రాజకీయంలో కొట్టుకుపోకుండా పరిశీలిస్తే.. మహిళా ప్రాతినిధ్యం నేపథ్యంలో లోక్‌సభ బలాన్ని పెంచటం వల్ల ఒక నిజమైన ప్రయోజనాన్ని మనం గమనించవచ్చు. దీనివల్ల, ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవారిలో చాలామంది బలవంతంగా తమ స్థానాల్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తదు. అదే, సీట్ల సంఖ్యను పెంచకుండా మహిళలకు రిజర్వేషన్ అంటే... పురుష రాజకీయవేత్తలు చాలా సందర్భాల్లో తమ కుటుంబాల్లోని మహిళల్ని కీలుబొమ్మ అభ్యర్థులుగా నిలబెడతారు. ఇదేమీ అకారణ భయం కాదు. అప్పుడు మహిళా సాధికారత మొక్కుబడి తంతులా మారుతుంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం పద్ధతిలో నిజమైన నాయకత్వం ఆవిష్కృతమవదు. ఇప్పటికే మన స్థానిక ప్రభుత్వాల్లో ‘పంచ్‌పతులు’గా పిలుచుకునే ఓ ఆనవాయితీ ప్రబలింది. అక్కడ మహిళలు రిజర్వేషన్ ద్వారా ఎన్నికైనా, పేరుకే నాయకురాళ్లు. ఆవిడ భర్తో, తండ్రో నిజమైన అధికారాన్ని చలాయిస్తారు. ఈ కోణంలో లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచటం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధాన్యాంశం. ఇది మినహాయించి.. లోక్‌సభ బలానికి, రిజర్వేషన్లకు సంబంధం లేదు.
కానీ, ప్రభుత్వం పరిష్కరించటానికి ప్రయత్నించిన పెద్ద సవాలు– లోక్‌సభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు. ఇది జటిలమైన, సున్నితమైన, రాజకీయ విమర్శలకు ఆస్కారమున్న అంశం. ప్రతి రాష్ట్రానికీ సీట్ల కేటాయింపును ఏ పద్ధతిలో చేయాలో రాజ్యాంగంలోని 81(2) అధికరణంలో పేర్కొన్నారు. ‘‘సీట్ల సంఖ్య ఆచరణలో వీలైనంత వరకు రాష్ట్ర జనాభాకు నైష్పత్తికంగా ఉండేలా పునర్విభజన చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు ఇదే తరహాలో ఉండాలి’’. 82వ అధికరణం కూడా ఇలా పేర్కొంటుంది: ప్రతి కులగణన తర్వాత, లోక్‌సభకు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని.. తదనుగుణంగా మార్పుచేర్పుల్ని చేయాలి.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రానికీ కేటాయించిన సీట్లను 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ చర్య తీసుకున్నారు. 2001లో సీట్ల సంఖ్యలో ఆ స్తంభన వ్యవధి ముగిసింది. అయితే రాష్ట్రాలకు కేటాయించిన సీట్లలో యథాతథ స్థితిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని అప్పటి వాజపేయి ప్రభుత్వాన్ని ఒప్పించటంలో నేను కీలకపాత్ర పోషించాను. అందుకోసం మేం జాతీయ స్థాయిలో ఒక రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాం. అప్పటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ; జేఎం లింగ్డో నేతృత్వంలో ముగ్గురు ఎన్నికల సంఘం సభ్యులు; అన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాల కమిషనర్లు, ఈ రంగంలో నిపుణులు హాజరయ్యారు. అప్పటి ప్రభుత్వం రకరకాల పార్టీల అతుకులబొంత సంకీర్ణం.
ఇదే సమయంలో పోఖ్రాన్ అణు విస్ఫోటనం నేపథ్యంలో విదేశీ ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు తీవ్రమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునర్విభజన తుట్టెను కదిలించటం సమస్యలకు దారితీయవచ్చు. జాతీయ సమగ్రత అత్యంత ప్రాధాన్యాంశం.. అని మేం విజ్ఞప్తి చేశాం. పార్టీలు స్పందించాయి. 84వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చాయి. 2026 వరకు రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల కేటాయింపును నిలుపుచేశాయి.
సవరణ లేకుండా 2026 జనగణన ఆధారంగానే సీట్లను కేటాయిస్తే, రాజ్యాంగం ప్రకారం ఏడు రాష్ట్రాలు ప్రస్తుత లోక్‌సభ బలంలో 35 సీట్లను కోల్పోతాయి. ఆంధ్రప్రదేశ్ (–5), తెలంగాణ (–3), తమిళనాడు (–10), కర్ణాటక (–2), కేరళం (–7), ఒడిశా (–4), పశ్చిమ బెంగాల్ (–4). నాలుగు రాష్ట్రాలు 34 సీట్ల మేర అదనంగా పొందుతాయి. యూపీ (+12), బిహార్ (+10), మధ్యప్రదేశ్ (+5), రాజస్థాన్ (+7). 2026 జనాభా ప్రకారం వివిధ రాష్ట్రాలకు అలా సీట్ల పంపకం జరిగితే, బీజేపీయే ప్రధానంగా లాభం పొందుతుందనేది ఎక్కువమంది అంగీకరించే అభిప్రాయం.
అయితే, ఎవరూ ఊహించనిరీతిలో... తన ప్రయోజనాలకు విరుద్ధంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్రాల వాటాను 1971 జనగణన డేటా ఆధారంగా స్తంభింపజేయటానికి ముందుకొచ్చింది (పేరుకి 2011 జనగణన అని సూచించినప్పటికీ వాస్తవానికి 1971 గణాంకాలే ప్రాతిపదికగా కొనసాగుతాయి). బీజేపీ అలా యథాతథ స్థితిని కొనసాగించటానికి చొరవ చూపటానికి అనేక కారణాలుండొచ్చు. పార్టీ కంటే దేశం మిన్న, దక్షిణాదిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకోవటం, అంతర్జాతీయ ఆర్థిక ఒడుదుడుకుల నేపథ్యంలో దేశం అనివార్యంగా అభివృద్ధి, ప్రగతి మీద సర్వశక్తులూ కేంద్రీకరించాల్సి ఉండటం, ఇలాంటి కీలక తరుణంలో విభజన కారక అంశాన్ని పక్కనపెడదామనుకోవటం.. వంటి ఆలోచనలు ఉండివుండొచ్చు. బీజేపీ చొరవకు కారణం ఏదైనా, జనాభా పరంగా సీట్లు కోల్పోతున్న ఏడు రాష్ట్రాలకూ ఊహించని బహుమతిని ప్రతిపాదించింది. దక్షిణాదిన, తూర్పు భారతంలో బలమైన ఉనికి ఉన్న పార్టీలు ఇలా భారీ సెల్ఫ్‌గోల్ వేసుకోవటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. మీ ప్రయోజనాలు, దేశ ఐక్యతకు దోహదం చేసే అంశాల్ని, అభివృద్ధి, సామరస్యతలను విస్మరించే స్థాయిలో రాజకీయ శతృత్వం మిమ్మల్ని కమ్మేస్తే అది రాజకీయం కాదు. ప్రజాజీవితంలో నిష్క్రియకు అది అతిపెద్ద సంకేతం.
ఈవేళ జనాభా పెరుగుదల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నియంత్రణలోకి వస్తోంది. ఢిల్లీ (1.4), తమిళనాడు (1.4), పశ్చిమ బెంగాల్ (1.4), ఆంధ్రప్రదేశ్ (1.5), తెలంగాణ (1.5), హిమాచల్‌ప్రదేశ్ (1.5), జమ్మూ కశ్మీర్ (1.5), కేరళం (1.5), మహారాష్ట్ర (1.5), పంజాబ్ (1.5), కర్ణాటక (1.6), ఒడిశా (1.8), ఉత్తరాఖండ్ (1.8). కొన్నేళ్లలో వలసలు అసమతుల్యతలను సరిచేస్తాయి. ఇప్పటికే కోట్లాది కార్మికులు దక్షిణాదిన, పశ్చిమ, ఉత్తరాదిన పలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని నిర్మిస్తున్నారు, సుస్థిర పరుస్తున్నారు. అందుకే జననాల రేటు తక్కువగా ఉన్నా, జనాభాలో మహారాష్ట్ర వాటా పెరుగుతోంది. అమెరికాలో దేశం లోపల భారీ వలసలు సాధారణం. ఈ సంస్కృతి అక్కడి జనాభా సంఖ్యను, ప్రాతినిధ్యాన్ని కొన్నేళ్లలో గణనీయంగా మార్చేసింది. అక్కడేమీ జనాభా ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పెరగలేదు. కానీ ఎక్కడ అభివృద్ధి, ఉద్యోగాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాలకు ప్రజలు స్వేచ్ఛగా వలస వెళ్లారు, వెళ్తుంటారు. దీంతో ఒక శతాబ్దంలో, ఫ్లోరిడా రాష్ట్రం అమెరికా కాంగ్రెస్‌లో తన ప్రాతినిధ్యాన్ని 4 నుంచి 28కి పెంచుకుంది. కాలిఫోర్నియా 11 నుంచి 52కు, టెక్సాస్ 18 నుంచి 38కి, వాషింగ్టన్ 5 నుంచి 10కి పెంచుకున్నాయి. స్థానికులు బయటకు వలసలు పోవటం వల్ల న్యూయార్క్ సీట్లను కోల్పోయింది. అక్కడ ప్రాతినిధ్యం 43 నుంచి 26కు తగ్గింది. అదేవిధంగా, పెన్సిల్వేనియా 36 నుంచి 17కు, ఇల్లినాయిస్ 27 నుంచి 17కు, ఓహియో 22 నుంచి 15కు, ముస్సోరి 16 నుంచి 8కి సీట్లను కోల్పోయాయి.
ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లటాన్ని మనమూ సులభతరం చేయాలి. వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, వారి రాజ్యాంగ హక్కులను గౌరవించాలి. ఎక్కడుంటే అదే వారి రాష్ట్రం కావాలి. అలా వారి జీవితాల్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చాలి. ఆ మార్పు మన జనాభా సవాళ్లను పరిష్కరిస్తుంది. అనేక పెద్ద రాష్ట్రాలు ఇప్పటికే తక్కువ జననాల స్థాయికి చేరుకున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ కూడా కొన్నేళ్లలో వాటిని చేరుకోనున్నాయి.
కలసికట్టుగా ఎదగటానికి, బలోపేతమవటానికి మనం హేతుబద్ధ, ఆచరణసాధ్య పద్ధతిని పాటించాలి. ద్వేషాన్ని పెంచే, విభజించే ప్రసంగాలు, ప్రచారాలకు స్వస్తి చెప్పాలి. అందరికీ నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, అవకాశాలు మెరుగైన భవిష్యత్తుకు కనీస అవసరాలు. జాతీయ సమైక్యత, అవకాశాలు, అభివృద్ధి కోసం మన అన్వేషణ.. రాష్ట్రాలకు సీట్లు కేటాయించటంపై త్వరిత, సామరస్య తీర్మానానికి దోహదం చేయాలి.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు
ఈ వార్తలు కూడా చదవండి..
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్
కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్
For More AP News And Telugu News