ఈ వాయుకాలుష్య కౌగిలి వీడేదెలా?
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:01 AM
ఏటా దీపావళి దగ్గర పడుతున్నప్పుడూ ఆ తరువాతా ‘ఢిల్లీ విషగాలి’ గురించి వింటూనే ఉంటాం. ఢిల్లీ వాసులు నిద్రలేవగానే నగరమంతా దట్టమైన పొగ, పొగమంచు కమ్ముకుని ఉండటాన్ని చూస్తారు...
ఏటా దీపావళి దగ్గర పడుతున్నప్పుడూ ఆ తరువాతా ‘ఢిల్లీ విషగాలి’ గురించి వింటూనే ఉంటాం. ఢిల్లీ వాసులు నిద్రలేవగానే నగరమంతా దట్టమైన పొగ, పొగమంచు కమ్ముకుని ఉండటాన్ని చూస్తారు. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత స్థాయి కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంది. నేడు ప్రపంచంలోనే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు (బీపీ) తర్వాత ప్రాణాలు తీస్తున్న రెండో అతిపెద్ద కారణం వాయు కాలుష్యమే; ఇది ఢిల్లీలో ఏటా సుమారు 17,188 మరణాలకు కారణమవుతోంది.
రోడ్లపై రోజూ తిరిగే 91 లక్షల వాహనాలు ఢిల్లీ కాలుష్యానికి 50శాతం వరకు కారణం. రెండవది, ఢిల్లీలోని పారిశ్రామిక కారిడార్. 11 బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల మొత్తం సూక్ష్మ ధూళి కణాలలో సుమారు 8శాతం వరకు గాలిలో కలుస్తున్నాయి. వీటికి తోడు, నియంత్రణ లేని పరిశ్రమలు, డీజిల్ జనరేటర్ల అతివాడటం వల్ల ప్రమాదకరమైన భార లోహాలు, సల్ఫర్ ఆక్సైడ్లు గాలిలోకి చేరుతున్నాయి. ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ వంటి పారిశ్రామిక కేంద్రాలు, ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతాలలోని లోహపు పరిశ్రమలు, రసాయన కర్మాగారాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పాత ఇటుక బట్టీల వంటివి చుట్టుముట్టి ఉన్నాయి. కఠినమైన నిబంధనలను పాటించని చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో వరి కోతల తర్వాత పంట వ్యర్థాలు తగలబెట్టడం వాయుకాలుష్యానికి 10శాతం వరకు కారణమవుతోంది. ఎన్సీఆర్ గాలి నాణ్యత చెడిపోవడంలో విమానయాన రంగం పాత్ర చాలా పెద్దది. ప్రతిరోజూ 1,300 విమానాల రాకపోకలతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియాలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. విమానాలు దిగేటప్పుడు, ఎగిరేటప్పుడు భారీ మొత్తంలో సూక్ష్మ ధూళి కణాలు, పూర్తిగా తగలబడని హైడ్రోకార్బన్లు, కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతాయి. ఢిల్లీ వాయు కాలుష్యంలో దాదాపు 7శాతం వాటా దీనిదే. భౌగోళికంగా ఢిల్లీ ఒక ‘గిన్నె’ ఆకారంలో పల్లపు ప్రాంతంలో ఉండి, చుట్టూ ఎత్తైన భూభాగాలతో చుట్టుముట్టి ఉంది. దీనితో గాలి బయటకు పోకుండా లోపలే చిక్కుకుపోతుంది. పైన పేర్కొన్న వివిధ కారణాల రీత్యా తయారైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ల విషపూరిత మిశ్రమమే ఆ పొగమంచు (Smog). గాలి వేగం దాదాపు సున్నాకి పడిపోవడంతో, ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న కాలుష్యం ఎటూ చెదిరిపోలేక, అన్ని వైపుల నుండి వచ్చే దుమ్ము, మసితో నగరవాసులకు ఊపిరాడకుండా చేస్తోంది. 150 కోట్ల ఏళ్ళ నాటి ప్రాచీన ఆరావళి పర్వతశ్రేణులలో అదుపులేని అటవీ నిర్మూలన, నిర్మాణ కార్యకలాపాల పెరుగుదల ఆందోళన కలిగించే అంశం. రాజధాని ప్రాంతానికి ఊపిరితిత్తులుగా, సహజ నీటి పరీవాహక ప్రాంతంగా, పర్యావరణ రక్షణ కవచంగా పనిచేసే ఈ పర్వత శ్రేణి నాశనం కావడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది.
ఈ శతాబ్దం మొదటి దశాబ్దం వరకు, బీజింగ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలలో ఒకటి. కానీ భారీ ప్రభుత్వ పెట్టుబడి, ప్రాంతీయస్థాయిలో సమన్వయం, హై-టెక్ పర్యవేక్షణతో ఒక కఠినమైన కాలుష్య వ్యతిరేక పోరాటం ద్వారా 2013–2023 మధ్య కాలంలో ఆ నగరం సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాన్ని 64శాతానికి పైగా తగ్గించుకోగలిగింది. చైనా ప్రభుత్వం లక్షలాది ఇళ్లలోని బొగ్గు పొయ్యిలను, వేలాది పారిశ్రామిక, మున్సిపల్ బొగ్గు బాయిలర్లను అతివేగంగా సహజ వాయువు (గ్యాస్) లేదా విద్యుత్‌తో భర్తీ చేసింది. నగర పరిధిలో బొగ్గు విద్యుత్ కేంద్రాలను నిషేధించింది. స్టీల్ ప్లాంట్ సహా వందలాది భారీ కాలుష్యకారక ఫ్యాక్టరీలను, పారిశ్రామిక సముదాయాలను సుదూర ప్రాంతాలకు తరలించింది. రవాణా రంగంలో లక్షలాది పాత కాలుష్య వాహనాలను తుక్కుగా మార్చి, ఎలక్ట్రిక్ వాహనాలకు మారింది. జాతీయ ఉద్గార ప్రమాణాలను అందుకోలేని భారీ సరుకు రవాణా ట్రక్కులను నిషేధించింది. సాంకేతికత, పర్యవేక్షణలతో పాటు నగర పొరుగు ప్రాంతాలతో సమన్వయం, జవాబుదారీతనం సాధించింది. ప్రధానంగా అడవుల పెంపకాన్ని అమలు చేసి, స్థానిక అధికారులకు పర్యావరణ లక్ష్యాలను నిర్దేశించింది. దుమ్ము, ఇసుక తుఫానులను ఎదుర్కోవడానికి కోట్లాది చెట్లను నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని 64శాతం వరకు తగ్గించి, బీజింగ్‌ను స్వచ్ఛమైన నగరంగా మార్చింది.
కేవలం సాంకేతిక మార్పులే కాక, ప్రకృతిపట్ల మన ఆలోచనావిధానం కూడా మారాలి. 1850 చివరలో కార్ల్ మార్క్స్, ఇంగ్లాండ్‌లో నేల సారం తగ్గిపోవడం, నదులు కలుషితం కావడాన్ని ఉటంకిస్తూ, లాభం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడిదారీ విధానం సహజ వనరులను దోచుకుంటూ శ్రామికులను ప్రకృతికి దూరం చేస్తుందని ఓ మాటన్నారు. దీనినే పర్యావరణ మార్క్సిస్ట్ జాన్ బెల్లామీ ఫాస్టర్ తరువాత ‘మెటబాలిక్ రిఫ్ట్’ (ప్రకృతితో మనిషికి తెగిపోయిన సంబంధం)గా అభివర్ణించారు. భవిష్యత్ తరాలకోసం ప్రకృతిని సురక్షితంగా ఉంచాల్సిన అవసరాన్ని మార్క్స్ అప్పుడే మనకు గుర్తుచేశారు. ఢిల్లీ గాలిని ‘గ్యాస్ ఛాంబర్’ స్థితి నుండి మానవ నివాసయోగ్యంగా మార్చడానికి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించక తప్పదు. కాలుష్యంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలుచేయాలి. థర్మల్ ప్లాంట్లు, కాలుష్య కారక పరిశ్రమలను తరలించడం, విమాన రద్దీని పొరుగు విమానాశ్రయాలకు మళ్లించడం ముఖ్యం. అవినీతికీ, రాజకీయ జోక్యానికి అతీతంగా నిజాయితీ గల ప్రత్యేక యంత్రాంగంతో ఏడాది పొడవునా నిర్ణయాలు అమలయ్యేట్టు చూడాలి. ఢిల్లీ వాసుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాక, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఊపిరినివ్వాల్సిన బాధ్యత కూడా మనమీద ఉంది.
డాక్టర్ సోమ మర్ల
విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసీఏఆర్, ఢిల్లీ
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్