Telangana Agriculture: శాస్త్రీయత లేని శాస్త్రవేత్త ఆరోపణ
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:22 AM
డిసెంబర్ 30న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘‘మా శాస్త్రవేత్తలు ఏం పాపం చేశారు?’’ అనే లఘు వ్యాసంలో డా. బి.విద్యాసాగర్ ప్రస్తావించిన అంశాల్లో కొన్ని అవాస్తవాలు చోటుచేసుకున్నాయి. 2014 వరకు....
డిసెంబర్ 30న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘‘మా శాస్త్రవేత్తలు ఏం పాపం చేశారు?’’ అనే లఘు వ్యాసంలో డా. బి.విద్యాసాగర్ ప్రస్తావించిన అంశాల్లో కొన్ని అవాస్తవాలు చోటుచేసుకున్నాయి. 2014 వరకు దేశంలోనే తెలంగాణ ‘విత్తన భాండాగారం’గా ఉన్న విషయం వాస్తవం. కానీ దేశంలోని విత్తన రంగంలో 2014లో సుమారు 31శాతం వాటా ఉంటే, అది 2023 నాటికి 19శాతానికి పడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నా... అప్పటి ప్రభుత్వ తప్పుడు విధానాలే కాక వ్యవసాయ పరిశోధనలలో స్తబ్దత కూడా ఒక కారణం. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు పరిశోధన నిధులు దాదాపుగా ఆగిపోయిన మాట వాస్తవమే కానీ, గత రెండేళ్ల నుంచి ప్రత్యేక పరిశోధన పథకాలు, కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులతో పరిశోధనలు సాగుతున్నాయి. అంతేకాక వ్యవసాయ విశ్వవిద్యాలయ మౌలిక వసతుల ఆధునికీకరణకై వచ్చే కేంద్ర బడ్జెట్‌లో సుమారు 465 కోట్లు ప్రత్యేక నిధులకై కేంద్రానికి ప్రత్యేక ప్రతిపాదనలను సమర్పించగా, ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర ఆర్థికమంత్రికి సిఫార్సు చేశారు.
గతంతో పోలిస్తే రెండేళ్లుగా 12శాతం అధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆర్థిక వనరుల కొరత వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొంత ఉన్నా, వివిధ సంస్థల, మార్గాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నది. ఇటీవల సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచినా, వ్యవసాయ విశ్వవిద్యాలయ బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించకపోవడానికి ప్రధాన కారణం 150 మందికి పైగా ప్రొఫెసర్లు అందుబాటులో ఉండటం, వారి సగటు వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండటం. ఇదే విషయం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది. అంతేకాకుండా ఖాళీగా ఉన్న సుమారు 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం భావించడం. ఈ పోస్టుల నియామకం అత్యవసరమని వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఒక ప్రొఫెసర్ రిటైరైతే ఆ వేతనంతో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేకాక సుమారు 2000 మంది అర్హత గలవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
ప్రొఫెసర్ రాజేశ్వర్ నాయక్
వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News