Share News

ఆధిపత్యాలు లేని సమతుల్య సమాఖ్య

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:20 AM

లక్ష్యం జనహితంగా ఉండడమే కాకుండా దాన్ని సాధించే పద్ధతులు ఆ ఆశయానికి నిబద్ధమయ్యే నైతిక నిష్ఠను ప్రజల్లో విధిగా పురిగొల్పాలని మహాత్మాగాంధీ మనకు చెప్పిన, ఆచరించి చూపిన సత్యం....

ఆధిపత్యాలు లేని సమతుల్య సమాఖ్య

లక్ష్యం జనహితంగా ఉండడమే కాకుండా దాన్ని సాధించే పద్ధతులు ఆ ఆశయానికి నిబద్ధమయ్యే నైతిక నిష్ఠను ప్రజల్లో విధిగా పురిగొల్పాలని మహాత్మాగాంధీ మనకు చెప్పిన, ఆచరించి చూపిన సత్యం. అమృతోత్సవాలు జరుపుకుని శతాబ్ది పండుగకు మహోత్సాహంతో ముందుకు సాగుతోన్న భారత ప్రజాస్వామ్య మహోన్నత సంకల్పమైన మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోవడం అధికార పార్టీ కుటిల ఎత్తుగడకు ఒక ఎదురు దెబ్బ. నిజమే, అయితే అది ప్రజలకు సంపూర్ణ విజయమా? కాదు, న్యాయసమ్మతమైన ఒక ఉపశమనం మాత్రమే. మన ప్రజాస్వామ్యంలోని అంతర్లీన సమస్యలు, అవి ప్రేరేపించే సంక్షోభాలను ఉపేక్షించకుండా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ ఉపశమనం మనలను జాగరూకులను చేయాలి.

సరళంగా చెప్పాలంటే ఇండియన్‌ యూనియన్‌ (‘ఇండియా, అంటే భారత్‌ రాష్ట్రాల యూనియన్‌’ అని భారత రాజ్యాంగ మొదటి అధికరణ పేర్కొంది)కు ఒక కొత్త ఒడంబడిక అవసరమున్నది. అది రాజ్యాంగంలో ప్రతిష్ఠించిన ప్రామాణిక పాశ్చాత్య తరహా సమాఖ్య ఒడంబడిక కాకూడదు. ఎందుకని? భారత సమాఖ్య, స్వతంత్ర రాష్ట్రాలు స్వచ్ఛందంగా ఏకమయ్యేందుకు కలిసివచ్చే (‘కమింగ్‌ టుగెదర్‌’) అమెరికా తరహా సమాఖ్యల వంటిది కాదు, దేశంలోని రాష్ట్రాలు అన్నీ ‘కలిసికట్టుగా ఉండే’ (హోల్డింగ్‌ టుగెదర్‌) నిర్ణయం ఫలితంగా ప్రభవించిన సమాఖ్య. అయినప్పటికీ మన రాజ్యాంగంలో అంతర్గతంగా ఒక అలిఖిత ఒడంబడిక ఉన్నది. భారత స్వాతంత్ర్యోద్యమకాలంలో జాతి జీవనంలో విస్పష్టంగా రూపుదిద్దుకున్న ఒక సైద్ధాంతిక ఏకాభిప్రాయమే ఆ అవ్యక్త ఒడంబడికకు స్ఫూర్తి, ప్రాతిపదిక. ఆ ఒడంబడికను నవీకరించుకోవల్సిన అవసరమున్నది. ఆ అలిఖిత ఒడంబడికలో మూడు సూత్రాలు ఉన్నాయి. మొదటిది, అత్యంత ముఖ్యమైనది ఆధిపత్య నిరోధం (నాన్‌–డామినేషన్‌).. ఇది కేంద్రం– రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య సంబంధాలకు వర్తిస్తుంది. ఇది ప్రాథమిక లేదా పునాది సూత్రం. రెండోది– న్యాయం (జస్టిస్‌). ఇది రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని వివిధ సామాజిక సముదాయాల మధ్య సమానత్వానికి ప్రాధాన్యమిస్తుంది. మూడోది సందర్భ నిర్దిష్టత (కాంటెక్స్ట్‌ స్పెసిఫిసిటి). స్థానిక ఆచారాలు, ఆచరణలు, అవసరాలను గౌరవించే విశిష్టతే ఈ నిర్దిష్టత. కొత్త ఒడంబడిక విధిగా ఈ మూడు సూత్రాలతో రూపొంది తీరాలి. డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన)పై చర్చ కేవలం ఒకే ఒక్క అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నది: భారత సమాఖ్య (ఇండియన్‌ యూనియన్‌)లోని రాష్ట్రాల మధ్య రాజకీయ అధికారం పంపిణీ. దేశ ఆర్థిక వనరులను పంచుకోవడం, సాంస్కృతిక అస్తిత్వాలను గౌరవించడం అనే మరో రెండు అంశాలను కూడా సమగ్రంగా చర్చించి తీరాలి. ఈ ప్రాధాన్యాల దృష్ట్యా డీలిమిటేషన్‌పై చర్చ నిష్పలమవలేదూ? కనుక రాజకీయ విభేదాలు మన గణతంత్ర రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయకుండా నివారించేందుకు ప్రస్తావిత మూడు అంశాలకు సరైన ప్రాధాన్యమిచ్చే ఒక సమగ్ర పరిష్కారం అవసరం ఎంతైనా ఉన్నది.


నియోజకవర్గాల పునర్విభజనపై చర్చలో చిత్తశుద్ధి కొరవడింది. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అన్న ప్రజాస్వామ్య సూత్రానికి, రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలనే సమాఖ్య సూత్రానికి మధ్య వైరుధ్యం ఉన్నట్టు వెల్లడయింది. జనాభా గణన ఆధారంగా రాష్ట్రాల సీట్ల వాటాను మార్చాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పిన కేంద్ర హోం మంత్రి రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న సీట్ల నిష్పత్తిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు! లోక్‌సభలో మొత్తం సీట్లు 50శాతం పెరగవచ్చని కూడా ఆయన సూచించారు. మంత్రివర్యుని వైఖరిలో డోలాయమానం, మాటల్లో ద్వంద్వనీతిని అటుంచితే నియోజకవర్గాల పునర్విభజన వాదన చాలా సూటిగాను, అర్థవంతంగాను ఉన్నది. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు,’ అనే ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం, ప్రతి రాష్ట్రానికి జనాభా నిష్పత్తిలో సమాన ప్రాతినిధ్యముండాలి. అయితే ప్రస్తుత పునర్విభజన సమస్యను అధిగమించేందుకు ఇది మాత్రమే న్యాయమైన పరిష్కార మార్గమా? అన్న ప్రశ్నపై నిష్పాక్షికంగా ఆలోచించవలసిన అవసరమున్నది. జనాభా పెరిగిన రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది న్యాయబద్ధమైన ప్రజాస్వామిక ఆకాంక్ష. అయితే ఇది జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సమాఖ్య స్ఫూర్తితో జరగాలి. ఇదే అసలు సమస్య.

ఈ విషయాన్ని మరింత నిశితంగా చూద్దాం. పార్లమెంటులో తమకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించడం జనాభా పెరుగుదలను నియంత్రించినందుకు తమను శిక్షించడమేనని దక్షిణాది రాష్ట్రాలు నిరసిస్తున్నాయి. వాటి వాదన వాస్తవంగా బలహీనమైది. ఎందుకంటే జనాభా పెరుగుదల ప్రధాన నిర్ణాయకం ప్రభుత్వ విధానం కాదు. అంతేకాక ఒక ప్రాంత లేదా సామాజిక సమూహ జనాభా పెరుగుదల ఒక జాతీయ భారంగా పరిణమించిందనే వాదన సామాజిక న్యాయసూత్రానికి విరుద్ధమైనది. అయితే దక్షిణాది రాష్ట్రాల ఆవేదన అర్థం చేసుకోదగిందే. ఆధిపత్య నిరోధం సూత్రం ప్రాతిపదికన నిజాయితీగా వాటికి అనుకూలంగా ఒక వాదన చేయవచ్చు. పార్లమెంటులో హిందీ భాషా రాష్ట్రాల సీట్ల సంఖ్య ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నది. డీలిమిటేషన్‌తో ఆ సంఖ్య మరింతగా పెరిగితే దక్షణాది లేదా జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. ఇది దేశ సమైక్యత, సమగ్రతకు ఎలా దోహదం చేస్తుంది? అంతేకాక హిందీ రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడమనేది భారత సమాఖ్య అలిఖిత ఒడంబడికను పరిహసించడమే అవుతుంది. కనుక ప్రస్తుత సందర్భంలో ఒక వ్యక్తి ఒక ఓటు అనే సాధారణ ప్రజాస్వామిక సూత్రానికంటే ఆధిపత్య రాహిత్యం అనే సూత్రానికి ప్రాధాన్యమివ్వాలి. ఇది సాధ్యమే.


జనాభా ఆధారిత ప్రాతినిధ్యం, సమాఖ్య సమతుల్యత మధ్య ఉన్న వైరుధ్యాన్ని తొలగించేందుకు 2001లో 84వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదించిన వాజపేయి ఫార్ములాను అమలు జరపడం ద్వారా జనాభా ఆధారిత ప్రాతినిధ్యం, సమాఖ్య సమతుల్యత మధ్య ఉన్న వైరుధ్యాన్ని శాశ్వతంగా తొలగించుకోవచ్చు. రాష్ట్రాల వారీగా లోక్‌సభ సీట్ల పునః కేటాయింపును స్తంభింపజేసి జనాభా గణన ఆధారంగా ప్రతి రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గ సరిహద్దులను మార్చాలి. తద్వారా ఒక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఇంచుమించు సమానంగా ఉండేందుకు దోహదం జరుగుతుంది. జనాభా సంఖ్యతో పాటు సాంస్కృతిక, భాషా వైవిధ్యాలకూ సమాన ప్రాతినిధ్యమిచ్చే రాజకీయ ఏర్పాటు ప్రాధాన్యాన్ని వాజపేయి ఫార్ములా గుర్తించి, గౌరవించింది. ఇప్పటికీ అనుసరణీయమైన ఉత్తమ పరిష్కారమది.

కొత్త ఒడంబడికలోని రెండో అంశం ఆర్థిక వనరులను సమరీతిలో పంచుకోవడం. 1990ల్లో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు ఎలా పెరిగిపోయాయో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌, రాజనీతి శాస్త్రవేత్త దేవేశ్‌కపూర్‌లు తమ ‘A Sixth of Humanity: India’s development odyssey’లో విపులంగా వివరించారు. గుజరాత్‌ తలసరి ఆదాయం బిహార్‌ తలసరి ఆదాయం కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నది. అత్యల్ప అభివృద్ధి, అల్ప ఆదాయాలు ఉన్న రాష్ట్రాలలోనే అత్యధిక ప్రజలు, పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండడం భారత ప్రజాస్వామ్యంలోని ఒక ఆసక్తికర వైరుధ్యమని ఆర్థికవేత్త రథిన్‌రాయ్‌ విశ్లేషించారు. సరే, జాతీయ ఆర్థిక వనరులలో అత్యధిక భాగాన్ని పేద రాష్ట్రాలకు కేటాయించడానికి ప్రాధాన్యమివ్వాలనే విషయమై ఇంతవరకు రాజకీయ ఏకాభిప్రాయం ఉన్నది. అయితే ఇటీవలి కాలంలో ఈ ఏకాభిప్రాయం బలహీనపడుతోందని చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా ప్రాతిపదికన పంపిణీ జరగాలనే డిమాండ్‌కు అంతకంతకూ మద్దతు సమకూరుతోంది. ఆధిపత్య నిరోధం, న్యాయసూత్రాలకు ఈ డిమాండ్‌ పూర్తిగా విరుద్ధమైనది. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు పేద రాష్ట్రాల నుంచి వలసవచ్చిన చౌక శ్రమశక్తి కారణంగానే ఇతోధిక పురోగతి సాధించాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. వ్యవసాయక ఉత్పత్తులకు కనీస మద్దతుధరలు, పారిశ్రామిక ముడి పదార్థాల రవాణా ఖర్చులకు కేంద్రం సమకూరుస్తున్న రాయితీలతో ధనిక రాష్ట్రాలు విశేషంగా లబ్ధి పొందుతున్నాయన్నది కూడా విస్మరించలేని వాస్తవం. రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల బదిలీకి ప్రస్తుతం అనుసరిస్తున్న జనాభా సంఖ్య, అల్పాభివృద్ధి ప్రమాణాలే భవిష్యత్తులో కూడా ఆర్థిక సంఘాల (ఫైనాన్స్‌ కమిషన్స్‌) సిఫారసులకు స్థిరమైన ప్రాతిపదికలుగా కొనసాగేందుకు ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని కొత్త ఒడంబడిక నిర్దేశించాలి.


సువిశాల భారతీయ సమాజంలోని సాంస్కృతిక వైవిధ్యాలను అంగీకరించి గౌరవించడంపై స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రభవించిన సముదాత్త ఏకాభిప్రాయాన్ని కొత్త ఒడంబడిక పునరుద్ఘాటించాలి. దీని ప్రకారం హిందీయేతర రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దబోమని, రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూలులోని అధికారిక భాషలు అన్నిటినీ సమరీతిలో గౌరవించడం జరుగుతోందని, షెడ్యూలేతర భాషల వికాసానికి ప్రభుత్వ అండదండలు లభిస్తాయని కొత్త ఒడంబడిక వాగ్దానమివ్వాలి.

ఈ కొత్త ఒడంబడిక ఒక ఐచ్ఛిక విషయం కాదు, కాకూడదు. ఎందుకని? స్వతంత్ర భారతదేశం ఒక ఏకీకృత రాజకీయ అస్తిత్వంతో, వైవిధ్యభరిత దేశంగా సుస్థిరంగా మనుగడ సాగించడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన విజయం. సమాజంలో ఇప్పటికే భౌగోళిక ఘర్షణలు, భాషా విభేదాలు, ఆర్థిక అంతరాలు తీవ్రంగా ఉన్నాయి. అవి విడివిడిగాను, సమష్టిగాను మన జాతి జీవనాన్ని విషమ రీతుల్లో ప్రభావితం చేస్తున్నాయి. వాటికి తోడు హానికరమైన రాజకీయ విభజనలకూ తావిస్తే మన జాతి భవిష్యత్తు భద్రంగా ఉంటుందా? ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించి, సాంస్కృతిక వైవిధ్యాలను గౌరవించే ఒక కొత్త సమ్మిళిత ఒడంబడికను రూపొందించుకుని చిత్తశుద్ధితో అమలుపరచడం మన పురానవ భారతదేశ మనుగడకు తక్షణ ఆవశ్యక చర్య.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 01:23 AM