Share News

దసరా అసలైన సందేశం ఇదేనా..!

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:43 AM

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు సాగిన దేవీ శరన్నవరాత్రుల ఆధ్యాత్మిక సాధనకు, సామాజిక సంబరాలకు ముగింపు ఘట్టం విజయదశమి. లోకకంటకుడైన మహిషాసురుడిని...

దసరా అసలైన సందేశం ఇదేనా..!

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు సాగిన దేవీ శరన్నవరాత్రుల ఆధ్యాత్మిక సాధనకు, సామాజిక సంబరాలకు ముగింపు ఘట్టం విజయదశమి. లోకకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన రోజైనా, లంకేశ్వరుడైన రావణాసురుడిని శ్రీరాముడు సంహరించిన శుభ తరుణమైనా, పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ముగించుకుని శమీ వృక్షాన్ని పూజించి విజయకేతనం ఎగురవేసిన చారిత్రక ఘట్టమైనా.. వాటన్నింటి అంతస్సూత్రం ఒక్కటే... అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన అంతిమ విజయం. నేడు మనుషుల మనసుల్లో వేళ్లూనుకుపోయిన విద్వేషాన్ని, కల్మషాన్ని తొలగించుకోవడమే ఈ పండుగ మనకు అందిస్తున్న అసలైన సందేశం.

బాహ్య రూపాలు మారాయి కానీ, రాక్షస ప్రవృత్తి మారలేదు. నేటి యాంత్రిక జీవనంలో మానవ సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. సాంకేతికత పెరిగి ప్రపంచమంతా ఒక్క క్లిక్‌తో అరచేతిలోకి వచ్చేసినప్పటికీ, మనుషుల మనసుల మధ్య దూరాలు మాత్రం ఎంతగానో పెరుగుతున్నాయి. పౌరాణిక కాలంలో రావణుడు బాహ్య ప్రపంచంలో పది తలలతో ఒక రాక్షసుడిగా కనిపించేవాడు. కానీ నేటి సమాజంలో ఆ రాక్షస ప్రవృత్తులు ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. అవి మానవుడి అంతఃచేతనలో అసూయ, ద్వేషం, స్వార్థం, అహంకారం, కపటం వంటి రూపాల్లో తిష్ఠ వేసుకుని కూర్చున్నాయి. మతం, కులం, వర్గం, ప్రాంతం పేరుతో సమాజంలో పెరుగుతున్న విభేదాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ వెళ్లగక్కుతున్న విద్వేషం... ఇవన్నీ ఆధునిక అసుర రూపాలే తప్ప వేరొకటి కాదు.

ప్రతి ఏటా దసరా నాడు దేశవ్యాప్తంగా వందల అడుగుల ఎత్తున్న రావణుడి దిష్టిబొమ్మలను రంగురంగుల బాణసంచాతో కాల్చి బూడిద చేస్తున్నాం. ఆ వెలుగులను చూసి చప్పట్లు కొడుతూ సంబరపడుతున్నాం. కానీ, మైదానాల్లో రావణ దహనం ముగిసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, మన గుండెల్లో దాగి ఉన్న క్రోధాన్ని, తోటి మనుషులపై ఉన్న ద్వేషాన్ని మాత్రం అలాగే భద్రంగా మోసుకొస్తున్నాం. సీతను అపహరించిన రావణుడిని రాముడు ఎప్పుడో సంహరించాడు. కానీ నేటి సమాజంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులు చూస్తుంటే మన మధ్యలోనే ఎంతమంది రాక్షసులు తిరుగుతున్నారో అర్థమవుతుంది. బాహ్యంగా చేసే హంగామాలు, బొమ్మల దహనాలు మన అంతరంగాన్ని శుద్ధి చేయలేనంత కాలం ఈ వేడుకలకు పరిపూర్ణత లభించదు. మనలోని రాక్షసత్వాన్ని అలాగే ఉంచి, బయట బొమ్మలను తగలబెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు.


విజయదశమి నాడు శమీ పూజ చేయడం, జమ్మి ఆకును ఒకరికొకరు ఇచ్చుకుని ఆలింగనం చేసుకోవడం, పెద్దలకు నమస్కరించి, వారి ఆశీస్సులు తీసుకోవడం మన సంస్కృతిలో భాగం. పాత పగలు, శత్రుత్వాలు, ఈర్ష్యాద్వేషాలను పూర్తిగా వీడి... అందరితో స్నేహాన్ని, సామాజిక సమరసతను పెంపొందించుకోవడం, ఎదుటి మనిషి అభిప్రాయాలను, వారి ఉనికిని గౌరవించడమే శమీ పూజలోని అసలైన నీతి. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే గెలవగలమనే సత్యాన్ని ఈ సంప్రదాయం నొక్కి చెబుతోంది.

నేటి జ్ఞాన సమాజంలో విజయదశమి నాటి ఆయుధ పూజకు సరికొత్త అర్థం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పర్వదినాన ఒకప్పుడు– సమాజాన్ని రక్షించే కత్తులు, బాణాలు, లేదా జీవనాధారమైన నాగలి వంటి పనిముట్లను పూజించేవారు. కానీ నేటి ఆధునిక యుగంలో మన మేధస్సు, మన కలం, కంప్యూటర్లు, మన వృత్తి నైపుణ్యాలే ఆయుధాలు. ఈ ఆయుధాలను విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి కాకుండా సమాజ శ్రేయస్సుకు, శాంతి స్థాపనకు, పేదరిక నిర్మూలనకు ఉపయోగించినప్పుడే ఆయుధ పూజకు నిజమైన సార్థకత చేకూరుతుంది. కలం నుంచి వచ్చే అక్షరం విద్వేషాన్ని రగల్చకూడదు. అది సమాజాన్ని చైతన్యపరచాలి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మన వేళ్లు టైప్ చేసే ప్రతి మాటా సమాజాన్ని ముక్కలు చేసేదిగా కాకుండా, కలిపేదిగా ఉండాలి. విజయదశమి పండుగ మాత్రమే కాదు. అదొక నిరంతర ఆత్మపరిశీలన ప్రక్రియ. ఏనాడైతే ప్రతి మనిషీ తన తోటి మనిషిపై ఉన్న అపనమ్మకాన్ని, విద్వేషాన్ని పక్కనపెట్టి, ప్రేమతో, మానవత్వంతో చేతులు కలుపుతాడో, ఆనాడే సమాజంలో నిజమైన విజయదశమి వెలుగులు నిండుతాయి. రావణ దహనం నాడు మన మనసుల్లోని ద్వేషాన్ని కూడా దహనం చేయడానికి సంకల్పం తీసుకుందాం.

సంపత్ గడ్డం

ఈ వార్తలూ చదవండి:

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో

Updated Date - Oct 20 , 2026 | 05:43 AM