Communist Party Of India 100 Years: సీపీఐ వందేళ్ల విశిష్ట ప్రస్థానం
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:29 AM
ఎన్నో కుట్రలు, నిర్బంధాలు, ఉరికొయ్యలను ఛేదించి చెరసాలల్లో పురుడుపోసుకొని భారతగడ్డపై నూరేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రగతిశీల రాజకీయశక్తి భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ...
ఎన్నో కుట్రలు, నిర్బంధాలు, ఉరికొయ్యలను ఛేదించి చెరసాలల్లో పురుడుపోసుకొని భారతగడ్డపై నూరేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రగతిశీల రాజకీయశక్తి భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ జయాపజయాల ప్రస్థానం 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో ప్రారంభమయింది. కమ్యూనిస్టుల పురిటిగడ్డ అయిన ఖమ్మం పట్టణంలో ఈ నెల 18న శత వసంతాల వేడుకలను నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ వేడుకలలో 10వేల మంది అరుణ సైన్యం కవాతు చేయబోతోంది. బహిరంగసభకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సౌహార్ద సందేశం ఇవ్వనున్నారు. 20న నిర్వహించే సెమినార్‌కు డి.రాజాతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వార్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
సీపీఐ పుట్టుకే శ్రామిక అంతర్జాతీయత, దేశభక్తితో మిళితమై ఉంది. వివిధ శ్రేణులుగా ఉన్న దేశభక్తులను, స్వాతంత్ర్య సమరయోధులను కమ్యూనిజం వైపు తీసుకువచ్చింది. భారతదేశంలో ఉన్న జాతీయ విప్లవకారులు, జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగంగా పనిచేస్తున్న సోషలిస్టు కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది, అతివాదపక్షం, టెర్రరిస్టు సంస్థలు, ఖిలాఫత్ ఉద్యమ నాయకులు, గదర్ పార్టీ నాయకులు సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. 1921–22లో శాసనోల్లంఘన ఉద్యమం విఫలమైన తర్వాత గాంధీజీ ప్రతిఘటన సిద్ధాంతం పట్ల భ్రమలు కోల్పోయిన వ్యక్తులు, గ్రూపులు కూడా అక్టోబర్ విప్లవ ప్రభావంతో శాస్త్రీయ సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వీరే దేశంలో తొలి కమ్యూనిస్టు గ్రూపుల స్థాపకులయ్యారు. బొంబాయిలో డాంగే, మద్రాసులో సింగార్‌వేల్ సెట్టియార్, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, లాహోర్‌లో ఇంక్విలాబ్ గ్రూపులకు చెందిన గులాం హుస్సేన్ తదితరుల కలయికతో 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటయింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో, రైతాంగ పోరాటాలలో, స్వదేశీ సంస్థానాల్లో, విముక్తి పోరాటాల్లో, సంఘ సంస్కరణలు, సామాజిక మార్పుల కోసం జరిగిన పోరాటాల్లో ఇంకా అనేక రీతుల్లో జరిగిన భారత ప్రజల విప్లవ ఉద్యమంలో పాల్గొన్న వారిలో అధికులు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు.
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రమాదకరంగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వం 1934 జూలైలో పార్టీని నిషేధించింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులందరూ కాంగ్రెస్‌లోనే ఉండి పనిచేసి దేశ స్వాతంత్య్రం కొరకు ద్విగుణీకృత పోరాటాలు నడిపారు. కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా సోషలిస్టు కాంగ్రెస్ పార్టీని 1932–34 ఏర్పాటు చేసుకున్నారు. అంతిమంగా సోషలిస్టు కాంగ్రెస్‌లోని కమ్యూనిస్టులతో పాటు మరెంతో మంది అభివృద్ధి కాముకులు అక్టోబర్ విప్లవ ప్రభావంతో కాంగ్రెస్‌లోనే వామపక్ష గ్రూపుగా ఏర్పడ్డారు. తదనంతరం అనేక మంది సోషలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వీరిలో ఈఎంఎస్ నంబూద్రిపాద్, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్, కంభంపాటి సీనియర్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ప్రముఖులు.
ఒకనాటి అస్సాం రాష్ట్రం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చాబర్ సిల్‌హెట్ జిల్లాలోని లోయ ప్రాంతంలో వీరోచిత కౌలురైతుల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ పోరాటవీరులు అనేక మంది కమ్యూనిస్టు పార్టీలో చేరారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా వర్లీ తెగకు చెందిన ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1946లో రాయల్ ఇండియన్ నావీ తిరుగుబాటుదారులు కమ్యూనిస్టు పార్టీ జెండాను చేతబూనారు.
1946–51 మధ్య జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది. మూడు వేల గ్రామాల విముక్తి, 10లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ, వెట్టిచాకిరి రద్దు లాంటి అనేక విజయాలు ఈ పోరాటంలో సాధించారు. ప్రధానంగా నిజాం నవాబు లొంగిపోవడం, హైద్రాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనం, సాయుధ పోరాట ప్రభావంతోనే జరిగాయి. విలీనం తర్వాత భారత సైన్యం, పోలీసులు కమ్యూనిస్టులపై దాడులకు పాల్పడటంతో జరిగిన రైతాంగ గెరిల్లా పోరాటంలో 4000మందికి పైగా కమ్యూనిస్టులు మృతిచెందారు. 10వేల మందిని డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి మూడు, నాలుగు సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురిచేశారు. మహిళలతో నగ్నంగా బతుకమ్మలాడించారు. అన్ని నిర్బంధాలను తట్టుకొని నిలబడటమే కాకుండా 1952లో జరిగిన ఎన్నికల్లో అటు మద్రాస్ రాష్ట్రంలోనూ, ఇటు హైద్రాబాద్‌లోని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కంటే అధిక స్థానాలు సాధించారు.
కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమిందారీ, జాగిర్దారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలను సమీకరించారు. భూ సమస్యను ఎజెండా మీదకు తెచ్చారు. కార్మికులు, కర్షకులతో పాటు మహిళలు, దళితులు, ఆదివాసీలు స్వాతంత్ర్యోద్యమంలోకి వచ్చారు. మహిళా హక్కులు, కుల నిర్మూలన, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. మహిళా సమానత్వ హక్కును ఎజెండాలోకి తెచ్చింది. యువతను విద్యా, వైజ్ఞానిక సేవా సాంస్కృతిక కార్యక్రమాల్లో సమీకరించింది. ఏఐటీయూసీ, అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), అఖిల భారత విద్యార్ధి సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ), అభ్యుదయ రచయితల సంఘం, ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (ఇప్టా), తెలుగు రాష్ట్రాల్లో ప్రజానాట్య మండలి ఏర్పాటయ్యాయి. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు, బొగ్గు గని కార్మికులకు, రవాణా కార్మికులకు, ఆయా రంగాల్లో వివిధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు.
దేశంలో కమ్యూనిజం ఆవశ్యకత, అవసరం ఎన్నడూలేని విధంగా నేడు ఉన్నది. ఉద్యోగ భద్రత లేదు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలతో కొత్తరూపంలో శ్రమదోపిడి జరుగుతున్నది. భావాన్ని, ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. కవులు, కళాకారులను మతోన్మాద అరాచకులు కాల్చి చంపుతున్నారు. సోషల్ మీడియాను ఒక యూనివర్శిటీగా మల్చుకొని విద్రోహపూరిత విషజ్వాలలను సమాజంలో విరజిమ్ముతున్నారు. ఆర్థిక అసమానతలు ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. 4వ ఆర్థిక వ్యవస్థగా చెప్పబడుతున్నా, సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అలీన విధానాన్ని గాలికి వదిలేసి అమెరికా ఆదేశాలను పాటించే స్థితికి దేశ పాలకులు వచ్చారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాలను సరళీకరణ పేరుతో విదేశీ, కార్పొరేట్ శక్తులకు స్వాధీనం చేస్తున్నారు. బొగ్గుగనులు, ఉక్కు కర్మాగారాలు, రైల్వే వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఆఖరికి అణుశక్తిలాంటి వ్యవస్థల్లో విదేశీయులను పెట్టుబడుల పేరుతో అనుమతిస్తున్నారు. ఈ దశలో ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థను కోరుకుంటున్నారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థ మాత్రమే. మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతమే కమ్యూనిస్టు సిద్ధాంతం. మనిషి ఉన్నంతకాలం, మనిషిలో ఆలోచనలు, భావాలు, ప్రశ్నలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది. సృష్టి ఉన్నంతకాలం కమ్యూనిజం కొనసాగుతుంది. కమ్యూనిస్టుల విలీనం దేశానికి, దేశ ప్రయోజనాలకు ఒక దిక్సూచి.
కూనంనేని సాంబశివరావు
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
ఇవి కూడా చదవండి...
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News