చరిత్రాత్మక తీర్పుపై ఇంత అక్కసెందుకు?
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:50 AM
న్యాయమూర్తికే ఇంత అన్యాయమా? బట్టకాల్చి ముఖంమీద పారేస్తారా? ఒక తప్పును సుప్రీంకోర్టు తప్పు అని తీర్పు చెబితే, దానిపై పార్లమెంట్‌లో ప్రభుత్వం మరో తీర్పు ఇవ్వడం న్యాయమా? మార్చి 31న లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి చేసిన...
న్యాయమూర్తికే ఇంత అన్యాయమా? బట్టకాల్చి ముఖంమీద పారేస్తారా? ఒక తప్పును సుప్రీంకోర్టు తప్పు అని తీర్పు చెబితే, దానిపై పార్లమెంట్‌లో ప్రభుత్వం మరో తీర్పు ఇవ్వడం న్యాయమా? మార్చి 31న లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి చేసిన ప్రసంగం రాజ్యాంగ వ్యతిరేకం. ఈ చర్చకు కేంద్రబిందువు జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుం కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు. ఉపరాష్ట్రపతి పదవిపోటీలో సుదర్శన్‌రెడ్డి ఓడిపోవడం రాజ్యాంగ వ్యతిరేక సంఘటనేమీ కాదు, ఆయన రాజకీయ నాయకుడూ కాదు.
సుప్రీంకోర్టు వేదిక నుంచి ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి రాజ్యాంగ ధర్మాసన పరమైన తీర్పు ఇవ్వడమే నేరమా? పోనీ ఈ బెంచ్ తప్పుడు, అన్యాయ, రాజ్యాంగ వ్యతిరేక తీర్పు ఇచ్చిందా? కాదే. ‘‘సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు మామూలు మనుషులను అనుమతించి, వారికి చంపే అధికారం ఇస్తారా? ‘ఎదుటివారిని చంపేయండి’ అంటూ ఆ ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చడం రాజ్యాంగ విరుద్ధం’’ అనడం తప్పు అవుతుందా? రాజ్యాంగంలో ఎక్కడైనా ఇటువంటి విధానాలు ఉన్నాయా అని అడగడమే నేరమా?
‘నందిని సుందర్ వర్సెస్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం’ కేసులో వెలువడిన ఈ తీర్పు రాజ్యాంగ పాఠాల్లో చెప్పుకోవలసినది. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.ఎస్.నిజ్జర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, మావోయిస్టు తిరుగుబాటును ఎదుర్కోవడానికి రాష్ట్రం అనుసరించిన సల్వాజుడుం వ్యూహం రాజ్యాంగ వ్యతిరేకమా కాదా అనే అంశాన్ని పరిశీలించింది. 15 ఏళ్ల పాటు ఊరుకొని, కేవలం ఆయన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడినందుకు ఎదురుదాడి మొదలైంది. నిన్న పార్లమెంట్‌లో కొందరు సభ్యులు ‘‘షేమ్..షేమ్’’ అంటూ ఉంటే... ఎవరికి ‘షేమ్’? సిగ్గుపడవలసింది ఎవరు? ఆయనా, సుప్రీంకోర్టా, రాజ్యాంగ సూత్రాలా? రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన ఒక తీర్పు విషయంలో ఒక న్యాయమూర్తిని పార్లమెంట్‌లో ఇలా అవమానించవచ్చా? అధికార విభజన సిద్ధాంతానికి, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇక అర్థం ఏమిటి?!
మావోయిస్టులతో పోరాడేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువకులకు ఆయుధాలు ఇచ్చి, వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా (ఎస్పీవో) నియమించడం సరైనది కాదు, అది సంవిధానమూ కాదు, విధానమూ కాదు.. ఇది మౌలిక రాజ్యాంగ సూత్రాలను, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నది అని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఆ తీర్పులో నొక్కిచెప్పిన ప్రధానమైన అంశాలు ఇవీ: సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు పౌరులకు రాష్ట్రం ఆయుధాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. శిక్షణ లేని గిరిజన యువకులను ఎస్పీవోలుగా నియమించి, తుపాకులు ఇవ్వడం వారిని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టడమే. ఈ విధానం ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, ఆత్మగౌరవం)లను ఉల్లంఘించింది. అంతర్గత భద్రతను నిర్వహించే బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన భద్రతా బలగాలదే తప్ప, అమాయక పౌరులది కాదు. కాబట్టి, సల్వాజుడుం నిర్మాణాన్ని రద్దు చేసి, పౌరులకు పంపిణీ చేసిన ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ తీర్పులో కోర్టు ఆదేశించింది. రాజ్యాంగ న్యాయశాస్త్రంలో ఈ తీర్పును చట్టబద్ధపాలనకు (rule of law) బలమైన ఉదాహరణగా పరిగణిస్తారు. పౌరులను ప్రమాదంలోకి నెట్టడం కాకుండా, వారిని రక్షించడమే ప్రభుత్వ ప్రధానబాధ్యత అని ఇది స్పష్టం చేసింది.
సల్వాజుడుంతో సంబంధం ఉన్న వ్యక్తులపై జరిగిన హింసకు ఈ తీర్పే కారణమంటూ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు కొన్ని చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రం గతంలో అవలంబించిన రాజ్యాంగ విరుద్ధమైన విధానం వల్ల తలెత్తే పరిణామాలకు న్యాయవ్యవస్థను బాధ్యులను చేయగలమా? కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకున్న చర్యలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని పరీక్షించడం న్యాయవ్యవస్థ విధి. రాజ్యాంగ హామీలను ఉల్లంఘిస్తూ పౌరులను సాయుధులుగా మారుస్తున్నారని కోర్టు గుర్తించినప్పుడు జోక్యం చేసుకోవడం దాని బాధ్యత. న్యాయసమీక్ష (Judicial review) అనేది ఒక భావజాలం కాదు; అది రాజ్యాంగబద్ధమైన పాలన యొక్క సారాంశం. తదనంతర హింసకు పూర్తిగా న్యాయస్థానం తీర్పే కారణమని ఆపాదించడం అంటే.. ప్రజాస్వామ్యంలో కోర్టుల పాత్రను వక్రీకరించడమే. తీర్పులపై చట్టపరమైన తర్కంతో కాక, సైద్ధాంతిక ప్రాతిపదికన దాడులు జరిగితే, అది రాజ్యాంగ హక్కులను కాపాడే సంస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని బలహీనపరుస్తుంది. సల్వాజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ప్రభుత్వాన్ని ఏ మాత్రం బలహీనపరచలేదు; తిరుగుబాటుపై పోరాటం రాజ్యాంగ పరిమితులకు లోబడి మాత్రమే జరగాలని అది పునరుద్ఘాటించింది. హింసను పౌరులకు అప్పగించడానికి (out-sourcing of violence) రాజ్యాంగం ఎన్నటికీ అనుమతించదు.
ఒక రాజ్యాంగబద్ధమైన పదవికి పోటీపడిన కారణంగా ఒక రిటైర్డ్ జడ్జిని పక్షపాత వ్యక్తిగా ముద్రవేయడం సరికాదు. పైగా, ఒక న్యాయమూర్తి గతంలో పోషించిన రాజ్యాంగపరమైన పాత్రను వర్ణించడానికి వారు ఉపయోగించిన ఆ భాష మరీ అభ్యంతరకరమైనది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిపై ‘అర్బన్ నక్సలైట్’ అని ముద్రవేశారు. ఇది న్యాయసంస్థల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంతేకాక, భవిష్యత్తులో ఇదొక ఆందోళనకరమైన ఉదాహరణగా మారవచ్చు. అంతర్గత భద్రత, మానవ హక్కులు, ప్రభుత్వ అధికారాలపై ఉన్న రాజ్యాంగ పరిమితులకు సంబంధించి వెలువడిన ముఖ్యమైన తీర్పులలో సల్వాజుడుం తీర్పు ఒకటి. ‘భద్రతా విధానాలు రాజ్యాంగ పరిమితుల పరిధిలోనే ఉండాలనీ, గిరిజన సంఘాలను సాయుధ పోరాట సాధనాలుగా మార్చకూడదనీ, పౌరులను రక్షించే బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది తప్ప, వారినే సైనికులుగా మార్చకూడదనీ’ ఇది వివరించింది. అందుకే ఈ తీర్పును ‘రాజ్యాంగ మానవతావాదానికి’ (Consti-tutional Humanism) మంచి ప్రతీకగా అభివర్ణిస్తారు.
ఒక తీర్పుతో రాజకీయంగా విభేదించడం సబబే. కానీ, తన విధులను నిర్వర్తించినందుకు ఒక న్యాయమూర్తి రాజ్యాంగ నిబద్ధతను ప్రశ్నించడం ప్రజాస్వామ్య పరిమితులను దాటే ప్రమాదాన్ని తెస్తుంది. ఒక రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్‌లో, వ్యవస్థలు ఒకదానినొకటి బాధ్యతాయుతంగా విమర్శించుకోవాలి, అదే సమయంలో పరస్పర గౌరవాన్ని కూడా నిలుపుకోవాలి. భారతదేశ ప్రజాస్వామ్య బలం ఎన్నికల రాజకీయాల్లో మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని సమున్నతంగా నిలపటంలోనూ, దాన్ని నిరంతరం రక్షించే న్యాయస్థానాలలోనూ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
మాడభూషి శ్రీధర్
ఈ వార్తలు కూడా చదవండి..
పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి
పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
For More AP News And Telugu News