ద్రోహానికి మరో పేరు కాంగ్రెస్
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:18 AM
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒక సందర్భంలో ఇలా అన్నారు. ‘‘చరిత్రలో అరుదుగా వచ్చే కీలక రాజ్యాంగ మలుపును మనం సద్వినియోగం చేసుకుంటామా? లేదా జర్మన్ తత్త్వవేత్త హేగెల్...
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒక సందర్భంలో ఇలా అన్నారు. ‘‘చరిత్రలో అరుదుగా వచ్చే కీలక రాజ్యాంగ మలుపును మనం సద్వినియోగం చేసుకుంటామా? లేదా జర్మన్ తత్త్వవేత్త హేగెల్ హెచ్చరించినట్టు పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ మళ్లీ వదిలేస్తామా?’’ నెహ్రూ వారసత్వం గురించి ఘనంగా చెప్పుకొనే కాంగ్రెస్, కనీసం ఆయన మాటలను కూడా అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉంది. ఇటీవల మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చరిత్ర నుంచి తాము పాఠాలు నేర్చుకోమని చెప్పకనే చెప్పింది. దేశహితం కన్నా దిగజారుడు రాజకీయాలే ప్రధానం అనుకొని నాలుగు విధాలుగా దేశాన్ని నష్టపర్చింది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అడ్డుకొని నారీ లోకానికి తీరని అన్యాయం చేయడమే కాకుండా, డీలిమిటేషన్‌ను వ్యతిరేకించి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసింది, చట్టసభల్లో ఎస్సీ–ఎస్టీల అవకాశాలకూ గండికొట్టింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించడం సహజం. దేశానికే తొలి ప్రాధాన్యం విధానానికి పెద్దపీట వేస్తున్న మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి భారతదేశ సమగ్రత కాపాడేందుకు, ఎస్సీ–ఎస్టీ వర్గాలతో పాటు మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు డీలిమిటేషన్ చట్టంతో ఒక చరిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుడితే, దానిని కాంగ్రెస్ కుట్రపూరితంగా అడ్డుకొని పైశాచిక ఆనందం పొందుతోంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, ఒక రాష్ట్రంలో ఎన్ని లోక్‌సభ నియోజకవర్గాలు ఉండాలనే దానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ ప్రాతిపదిక దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి. 1971లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. దేశంలో లోక్‌సభ నియోజకవర్గాలు 550 దాటకూడదని, ఇందులో రాష్ట్రాలకు 530, కేంద్రపాలిత ప్రాంతాలకు 20 అని నిర్ణయించారు. చివరకు 543 సీట్లకు ఖరారు చేశారు. తదనంతరం దేశం జనాభా నియంత్రణకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో రాష్ట్రాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను మెరుగ్గా అమలు చేశాయి. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోతాయని భావించి, 25 ఏళ్ల వరకు ఒకసారి, దానిని మరో 25 ఏళ్లకు పొడిగిస్తూ మరోసారి, మొత్తం 50 ఏళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్యను స్థిరపరిచారు. 1971లో దాదాపు 55 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభా.. ఇప్పుడు 145 కోట్లు దాటింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో వాటి సంఖ్యను పెంచాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సమాఖ్య స్ఫూర్తి, సమన్యాయానికి పెద్దపీట వేస్తూ, దూరదృష్టితో అన్ని రాష్ట్రాలకూ సమ ప్రయోజనం చేకూరేలా మోదీ ప్రభుత్వం 50శాతం పెంపు ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని అర్థం చేసుకోలేని కాంగ్రెస్, కేవలం ప్రధాని మోదీపైన, బీజేపీపై అక్కసుతో గుడ్డిగా వ్యతిరేకించి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఒక నియోజకవర్గంలో సగటున 14–15 లక్షల జనాభా ఉంది. అదే బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సగటున 20–25 లక్షల జనాభా ఉంది. ఆర్టికల్ 81 ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకు ఒకే జనాభా ప్రాతిపదిక ఉండాలి. 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల వాటా 132 నుంచి 110–120కు తగ్గుతుంది, అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల వాటా 216 నుంచి 240–250కు పెరుగుతుంది.
2026 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీజేపీకి బలమున్నదని చెప్పే హిందీ రాష్ట్రాల్లోనే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ను తీసుకుంటే ప్రస్తుతం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. అదే 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే యూపీలో వాటి సంఖ్య 132కు పెరుగుతుంది. అదే తమిళనాడును తీసుకుంటే ప్రస్తుతం ఉన్న 39 స్థానాల నుంచి 35కు పడిపోతాయి. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన 50శాతం పెంపు ప్రకారం యూపీ సీట్లు 80 నుంచి 120, తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి పెరుగుతాయి. అప్పుడు అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఒకవిధంగా తమ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేదని ఉత్తరాది రాష్ట్రాలే 50శాతం పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించాలి, కానీ తర్కం లేని కాంగ్రెస్, దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేసింది.
దాదాపు 50 ఏళ్లుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్లను సాకారం చేస్తూ మోదీ ప్రభుత్వం నారీశక్తి వందన్ అధినియం, 2023 చట్టాన్ని తీసుకొచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మహిళలకు లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. అయితే, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు జనగణనలో కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన జరిగి, 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడం జాప్యమయ్యే అవకాశం ఉంది. రానున్న 2029 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న సత్సంకల్పంతో మోదీ ప్రభుత్వం 131 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్‌సభ స్థానాలను పెంచుతూ, నియోజకవర్గాల పునర్విభజన నిబంధనలను సవరించడం ఈ బిల్లు ఉద్దేశ్యం. రాజ్యాంగ సవరణ కాబట్టి... బిల్లు పాస్ కావడానికి 2/3 వంతుల మెజారిటీ అవసరమైన నేపథ్యంలో మహిళలు అధికార స్థానంలో ఉండడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఈ బిల్లు వీగిపోయేలా చేసింది.
ప్రస్తుతం లోక్‌సభలో 74 మంది ఎంపీలతో మహిళల ప్రాతినిధ్యం 14 శాతానికే పరిమితమైంది. ఈ బిల్లు పాస్ అయివుంటే, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 850కు పెరిగి, అందులో 33శాతం రిజర్వేషన్లు అమలై 280 స్థానాలను మహిళలకు కేటాయిస్తే, వీరికి ప్రస్తుతం జనరల్ స్థానాల్లో గెలిచిన 14 శాతాన్ని కలుపుకొంటే, 350కి పైగా సీట్లతో మహిళా సభ్యుల సంఖ్య దాదాపు 47శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. లోక్‌సభ మాత్రమే కాదు, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు అమలై, దేశంలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరిగేది. అంతేకాదు, ప్రస్తుతం లోక్‌సభలో 84 ఎస్సీ స్థానాలు, 47 ఎస్టీ స్థానాలున్నాయి. నియోజకవర్గాల సంఖ్య 850కు పెరిగితే ఎస్సీ స్థానాలు 132, ఎస్టీ స్థానాలు 72కు మారేవి. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఎస్సీ–ఎస్టీ నియోజకవర్గాల సంఖ్య పెరిగి వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్, నిర్హేతుక కారణాలతో మహిళల ప్రయోజనాలను కాలరాయడమే కాదు, ఎస్సీ–ఎస్టీల అవకాశాలనూ దెబ్బతీసింది. ప్రధాని మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఏకైక లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్, దక్షిణ భారత మహిళల, ఎస్సీ–ఎస్టీల ప్రయోజనాలను తాకట్టుపెడుతోంది. ప్రజోపయోగ విధానాలనూ వ్యతిరేకిస్తే, ఇప్పటికే మూడు పర్యాయాలు అధికారానికి దూరమైన కాంగ్రెస్, మరో 30 పర్యాయాలైనా అధికారంలోకి రావడం కల్ల!
ఎన్. రాంచందర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International