Share News

ఉన్నత విద్యామండలిపై వ్యవస్థీకృత దాడి

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:11 AM

మన దేశంలో 1986లో జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించినప్పుడు యూజీసీ నుంచి కొన్ని సూచనలు వెలువడ్డాయి. ఉన్నత విద్యలో ప్రమాణాలను మరింతగా పెంచడం కోసం, ఆయా రాష్ట్రాలు ఉన్నత విద్యా మండళ్లను ఏర్పాటు...

ఉన్నత విద్యామండలిపై వ్యవస్థీకృత దాడి

మన దేశంలో 1986లో జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించినప్పుడు యూజీసీ నుంచి కొన్ని సూచనలు వెలువడ్డాయి. ఉన్నత విద్యలో ప్రమాణాలను మరింతగా పెంచడం కోసం, ఆయా రాష్ట్రాలు ఉన్నత విద్యా మండళ్లను ఏర్పాటు చేయాలనేది నాటి విద్యా విధానంలోని ఒక మౌలిక సూచన. కేంద్రం నుంచి ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేయమని సూచన వచ్చిందే తడవుగా, ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 1988 విద్యా చట్టం ద్వారా దేశంలో మొదటి ‘రాష్ట్ర ఉన్నత విద్యామండలి’ని స్థాపించారు. తరువాత దాదాపు 16 రాష్ట్రాలలో ఉన్నత విద్యామండళ్లు యూజీసీ సూచన మేరకు ఏర్పడి, సమర్థంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రాలలో విద్యారంగంలో, విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో రాష్ట్ర ఉన్నత విద్యామండళ్ల ప్రాధాన్యం ఉంది.

యూజీసీ సూచన మేరకు ఏర్పడ్డ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారాలను తగ్గించడం, కొన్నింటిని కొత్తగా ఏర్పడే కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు బదిలీ చేయడం, డైరెక్టరేట్ ఆఫ్ సాంకేతిక విద్యను, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్‌ను ఏకీకరణ చేయడం వల్ల స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని చెప్పడం హాస్యాస్పదం. 1986 చట్టం ద్వారా ఏర్పడిన, విద్యావేత్తలు నిర్వహిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి విధులు, అధికార బాధ్యతలను విద్యారంగంలో అనుభవం లేని జూనియర్ ఐఏఎస్‌ అధికారి బాధ్యతలు నిర్వహించే కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు అధికారాలను బదిలీ చేయడం ఎంతవరకు సమంజసం? ఉన్నత విద్యామండలి అధికారాలను జీవో ఎంఎస్‌ నెం.3 అధిక్రమణ చేయడం ఎంతవరకు సబబు? ఇవన్నీ పరిశీలిస్తే, ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి ఆ శాఖా మంత్రిని తప్పుదోవపట్టిస్తున్నారనడంలో సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలను ‘ఫంక్షనల్ ఇంటిగ్రేషన్’ (క్రియాత్మక ఏకీకరణ) పేరుతో పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) సంస్థాగత వారసత్వాన్ని, విద్య స్వయంప్రతిపత్తిని క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయడమే. దివంగత ఎన్టీ రామారావు మానసపుత్రికగా ఏర్పాటైన ఏపీఎస్‌సీహెచ్‌ఈ... ప్రభుత్వం, యూజీసీ, విశ్వవిద్యాలయాల మధ్య ఒక వారధిగా నిలిచే ఒక మార్గదర్శక సంస్థ. ఈ సంస్థ కార్యనిర్వాహక అధికారాలను తొలగించి, కొత్తగా ఏర్పాటు చేయబోయే ‘కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ (సీహెచ్‌ఈ) కిందకు తీసుకురావడం ద్వారా, కేంద్రీకృత బ్యూరోక్రాటిక్ నియంత్రణ కోసం లక్షలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తును, స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం పణంగా పెడుతోంది.


దశాబ్దాలుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ, ప్రవేశాల పర్యవేక్షణతో పాటు ఏకీకృత విద్యా క్యాలెండర్‌ను పర్యవేక్షిస్తూ విద్యా ప్రమాణాల సంరక్షకుడిగా ఏపీఎస్‌సీహెచ్‌ఈ అగ్రగామిగా ఉంది. మండలి అధికారాలు చట్టానికి అతీతంగా ఉన్నాయని, ఉన్నత విద్య రాజకీయమయం కాకుండా అడ్డుపడుతున్న ఈ సంస్థను నిర్వీర్యం చేసే ఒక కుట్రపూరిత ప్రయత్నం జరుగుతోంది.

ఉన్నత విద్యామండలి విద్యాపరమైన నాయకత్వానికి ప్రతీక అయితే, కమిషనరేట్ అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన ఆధిపత్యానికి నిదర్శనం. విద్యావేత్తలతో కూడిన కౌన్సిల్ నుంచి కార్యనిర్వాహక అధికారాలను తొలగించి, ఒకే ఒక్క కమిషనర్ (ఐఏఎస్‌ అధికారి) చేతుల్లో పెట్టడం ద్వారా ఉన్నత విద్యలోని లోతుపాతులను, సున్నితమైన అంశాలను అర్థం చేసుకునే పరిణతి గానీ, విద్యాపరమైన పరిజ్ఞానం గానీ లేని బ్యూరోక్రాట్ల చేత విద్యా సంబంధిత నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వాన్ని కొందరు అధికారులు తప్పుదోవ పట్టించి ‘ఏకీకరణ’ అంటేనే ‘సమర్థత’ అని నమ్మబలుకుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి, ఈ ప్రణాళిక రాష్ట్ర విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. ఉన్నత విద్య అనేది సామాజిక పురోగతికి ఇంధనం వంటిది. నాణ్యతా ప్రమాణాలు, దూరదృష్టితో కూడిన ప్రణాళికలను పర్యవేక్షించే విద్యామండలిని బలహీనపరిస్తే, అది ఆ డిగ్రీ విలువనే పతనం చేస్తుంది. ఉన్నత విద్యామండలిని కేవలం చట్టబద్ధమైన సలహా సంస్థగా మార్చటం సరికాదు.

ఈ పునర్వ్యవస్థీకరణ ఏపీఎస్‌సీహెచ్‌ఈని కేవలం నాణ్యతా పర్యవేక్షణకు మాత్రమే పరిమితం చేయదు, దానిని పూర్తిగా మూలన పడేస్తుంది. అడ్మిషన్లు, అనుమతులు, ఆర్థిక వ్యవహారాలన్నీ కమిషనరేట్ చేతుల్లోకి వెళ్తే, మండలి కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. ఇది ఎన్టీఆర్ ఆశయాలను వమ్ముచేయడమే కాకుండా, 35 ఏళ్ల విద్యా పురోగతిని వెనక్కి నెట్టేసే తిరోగమన చర్య. అడ్మినిస్ట్రేటర్ల స్వార్థ ప్రయోజనాల కోసం విద్యా సంస్థల సమగ్రతను బలిపెట్టకుండా, ఏపీఎస్‌సీహెచ్‌ఈని మరింత బలోపేతం చేయాలి. ఉన్నత విద్యా వ్యవస్థ స్తంభించిపోకుండా ఉండాలంటే, విద్యార్థుల ప్రయోజనాలను, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడే మేధోపరమైన రక్షణ కవచంగా ఏపీఎస్‌సీహెచ్‌ఈ కొనసాగాలి. కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో విద్యావేత్తలతో ఆ శాఖ మంత్రి క్షుణ్ణంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోవటం ఉన్నత విద్యారంగానికి మంచిది.

కిలారి రామమూర్తినాయుడు

యూజీసీ పూర్వ సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 01:11 AM