కమ్యూనిస్టులు ఏకమవ్వాల్సిన వేళ ఇది!
ABN , Publish Date - Sep 20 , 2026 | 02:13 AM
ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం బీటలు వారుతోంది. ఏ దేశానికీ లేనంత భారీ అప్పు (40 ట్రిలియన్ డాలర్లు)లో కూరుకుపోయింది. డాలర్ ఆధిపత్యానికి స్థానిక దేశీయ క్రాస్ బోర్డర్...
ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం బీటలు వారుతోంది. ఏ దేశానికీ లేనంత భారీ అప్పు (40 ట్రిలియన్ డాలర్లు)లో కూరుకుపోయింది. డాలర్ ఆధిపత్యానికి స్థానిక దేశీయ క్రాస్ బోర్డర్ కరెన్సీలతో గండి కొట్టాలని బ్రిక్స్ దేశాల కూటమి నిర్ణయించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఎడతెగని యుద్ధంతో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు, యెమెన్‌కు చెందిన హౌతీలు సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీలు, పైప్‌లైన్‌లపై నిర్వహిస్తున్న దాడులు ప్రపంచ ఇంధన సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఎర్ర సముద్రాన్ని, హిందూ మహా సముద్రంతో అనుసంధానించే ‘బాబ్–ఎల్–మండేబ్ జలసంధి’పై హౌతీ తిరుగుబాటుదారులు పట్టు బిగించారు. తత్ఫలితంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మరో జలసంధిలో కూడా నౌకల రాకపోకలకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురు బ్యారెల్ ధర 110 డాలర్లకు పెరిగింది. ఆధునిక ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడి అయిన ఇంధన సరఫరా స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భరించలేని స్థాయికి పెరిగిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ పదే పదే విధిస్తున్న ఆంక్షలు, పన్నులతో అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇంధన సమస్యలు, సప్లై చైన్స్ విచ్ఛిన్నం, కంపెనీల మూత, వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల, జీవనోపాధుల విధ్వంసం, నిలిచిపోయిన ఎరువుల సరఫరా మొదలైన సమస్యలు సకల దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. రష్యా నుంచి చౌక ధరలకు ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ సహా ఐదు దేశాలపై అమెరికా 100శాతం పన్నులు విధిస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఆయా దేశాలలోని వందల కోట్ల ప్రజలకు చౌక ఇంధనం లేకుండా చేయడమే ట్రంప్ లక్ష్యం. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమెరికా చర్యలను చైనా తీవ్రంగా ఖండించింది. ట్రంప్ దీర్ఘకాలంగా అనేక రూపాల్లో భారత ప్రజలపై కత్తిగట్టారు. అయినా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో విదేశీ వ్యాపారంలో మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోతోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలలో చీలికలు సృష్టించింది. బడా సంపన్నులను వదిలి, సామాన్య మధ్య తరగతి కష్టార్జితాలను దోచేస్తున్నారు. ప్రతి వినియోగదారుడు యూపీఐ డిజిటల్ చెల్లింపుల బాధితుడవుతున్నాడు. జీఎస్టీ దోపిడీకి ఇది అదనం. బడా సంపన్నుల 18.50 లక్షల కోట్ల రూపాయల రుణాలను మోదీ సర్కార్ మాఫీ చేసింది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుభాష్ చంద్ర తీసుకున్న రూ.20,206.54 కోట్ల రుణంలో 6.5 కోట్లు మాత్రమే చెల్లించమని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చెప్పింది. రూ.20,200 కోట్ల రుణం మాఫీ చేసింది. రుణదాతలు పైకోర్టుకు వెళ్లారు. పేదవాళ్లు తీసుకున్న రుణాలను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు... పెద్దలకు ఎందుకు మాఫీ చేస్తున్నాయి? జాతీయ, ప్రాంతీయ పార్టీలు బడా సంపన్నుల సేవకు పరిమితమవుతున్నాయి. ఆయా పార్టీల ప్రభుత్వాల అవినీతి భరించలేని స్థాయికి చేరింది. ప్రజాతంత్ర శక్తులు, కమ్యూనిస్టులు ఐక్యవేదికపై పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రపంచ పరిణామాలు దీనిని బలపరుస్తున్నాయి.
బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, బుర్కినో ఫాసో, నైజర్, మాలి లాంటి అనేక దేశాలలో ‘జెన్ జీ’ తిరుగుబాట్లతో ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రపంచ గమనం ఎప్పుడూ లేనంత శరవేగంగా మారుతోంది. ఇటీవలి విద్యార్థి జెన్ జీ ఉద్యమం, ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన తీరు యువతలో రగులుతున్న ఆందోళనను వెల్లడిస్తున్నది. ప్రస్తుత విద్యా విధానంలో, పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలపై విద్యార్థి, యువజనలోకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలికి పోయింది. ఉద్యోగాల్లో కోత యువతను వణికిస్తోంది. నిరుద్యోగం ఎల్లెడలా తాండవిస్తోంది. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామనే వాగ్దానం నెరవేర్చడంపై మోదీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. రైతులోకం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈశాన్య భారతంలోని మణిపూర్ రెండున్నరేళ్లుగా జాతుల ఘర్షణతో మండిపోతోంది. విద్య, వైద్యం భారీ వ్యాపారాలయ్యాయి.
కృత్రిమ మేధ తదితర అధునాతన సాంకేతికతల మూలంగా లక్షల ఉద్యోగాలు ఊడుతున్నాయి. మనుషులు లేకుండా, రోబోలతో నడిచే అత్యాధునిక హైటెక్ పరిశ్రమలుగా నేటి ఆధునిక పరిశ్రమలు పరిణమించాయి. మానవ నైపుణ్యాన్ని, పనిలో మనిషి అవసరాన్ని ఉత్పత్తిలో, పంపిణీలో చాలా వేగంగా తొలగించే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేరుతోంది. మోదీ సర్కార్ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ‘పేరు గొప్ప.. ఫలితం దిబ్బ’గా మారింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బ్యాంకులు ఇతర సంస్థలలో పనిచేసే వారి ఉద్యోగాలకు అధునాతన సాంకేతికతలతో తీవ్ర ముప్పు ఏర్పడింది. కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. ఉన్న ఉద్యోగాలను తగ్గించడం ఎలా అనేదే నేటి లక్ష్యంగా మారింది. సమీప భవిష్యత్తులోనే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనీ అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఇతర సంపన్న దేశాలలోని భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉంది. ఫలితంగా మనదేశంలోని యువత, విద్యార్థుల, రైతుల ఉద్యమాలు మరింత ముమ్మరమవుతాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించుకోవాలనే ఆకాంక్ష ఆయా వర్గాలు చేస్తున్న స్వతంత్ర ఉద్యమాల్లో బలంగా వ్యక్తమవుతోంది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకపోగా వాటిని మరింతగా పెంచుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వామపక్ష ఉద్యమాలు పెరుగుతున్నాయి. యువత పెద్దఎత్తున ఆ ఆందోళనల్లో పాల్గొంటోంది. అయితే నిజమైన శాశ్వత ప్రత్యామ్నాయాన్ని కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు మాత్రమే చూపగలవు. తాము ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉందనే వాస్తవాన్ని గుర్తించి, వివిధ పార్టీలుగా చీలిపోయిన కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు ఒక ఐక్యవేదిక పైకి రావాలి. కమ్యూనిస్టు శ్రేణులు ఏకమవ్వాలనేది ప్రజాతంత్ర వాదుల ప్రగాఢ ఆకాంక్ష. కమ్యూనిస్టుల ఐక్యత ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసాన్ని కల్పిస్తుంది, ఆ భవితను నిర్మించుకునేందుకు ఉత్సాహాన్నిస్తుంది. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటన ఏర్పడాలనే భావన జనసామాన్యంలో ప్రబలంగా ఉంది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అవినీతిలో మునిగితేలుతోంది. అన్ని వర్గాల ప్రజల నుంచీ కాంగ్రెస్ దూరమైంది. బీఆర్ఎస్ భారీ అవినీతి పాలనను ప్రజలు పట్టుదలతో కూల్చారు. బీజేపీ మతోన్మాద పాలనతో ప్రజలు విసిగిపోయారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. కమ్యూనిస్టులు ఐక్యమైతే ఒక ప్రత్యామ్నాయ శక్తి ప్రభవించేందుకు అవకాశమున్నది. ప్రజాతంత్ర శక్తులతో కలిసి ఎన్నికల్లో ‘ఐక్య ప్రజల ఫ్రంట్’గా పోటీ చేయవచ్చు. నిజాయితీగా కలిసికట్టుగా పనిచేస్తే ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు సత్వరమే తీసుకురావచ్చు. నూతన మార్పుకై జరిగే ఈ సమష్టి కృషిలో వామపక్ష ప్రజాతంత్రవాదులు భాగస్వాములు కావాలి.
జస్టిస్ (రిటైర్డ్) బి. చంద్రకుమార్
(నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సు)
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News