Share News

Communists as a Boon to the Working Class:: ర్మికలోకానికి కమ్యూనిస్టులు వరం

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:45 AM

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిసెంబర్‌ 12న ఆంధ్రజ్యోతిలో ‘కార్మిక లోకానికి శాపం... ఈ కమ్యూనిస్టులు’ శీర్షికతో వ్యాసాన్ని రాశారు. కార్మిక లోకానికి కమ్యూనిస్టులు శాపం కాదు...

Communists as a Boon to the Working Class:: ర్మికలోకానికి కమ్యూనిస్టులు వరం

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిసెంబర్‌ 12న ఆంధ్రజ్యోతిలో ‘కార్మిక లోకానికి శాపం... ఈ కమ్యూనిస్టులు’ శీర్షికతో వ్యాసాన్ని రాశారు. కార్మిక లోకానికి కమ్యూనిస్టులు శాపం కాదు వరం. కార్మికవర్గం శతాబ్దం పైగా ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సంపాదించిన హక్కులు, సౌకర్యాలకు ఒక చరిత్ర ఉంది. చరిత్రను వక్రీకరించే బీజేపీ నాయకులకు అది అర్థం కాదు.

44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చి, గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు–సౌకర్యాలను మళ్ళీ పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టటం వాస్తవం కాదా? కార్మిక చట్టాలను కోడ్‌లుగా మార్చటం వల్ల పర్మినెంట్ ఉద్యోగులు ఉండరు. కాంట్రాక్ట్ లేబర్, క్యాజువల్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుంటారు. లే ఆఫ్, రిట్రెంచ్‌మెంట్, క్లోజర్‌లు ఉంటాయి.

గతంలో ఉన్న కార్మిక చట్టాల్లో 100 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ మూసివేయాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కావాలి. కాని మోదీ కొత్తగా మార్చి తెచ్చిన ‘ద ఇండస్ట్రియల్ కోడ్ 2020’ సెక్షన్ 77లో ఆ సంఖ్యను 300కు పెంచారు. ఇది వర్కింగ్ క్లాస్‌కి నష్టం. 50 మంది పనిచేసే పరిశ్రమను లే ఆఫ్ చేస్తే మారిన కోడ్ సెక్షన్ 65 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదు. ఇది కార్మికుడికి లాభమా, నష్టమా? మరి, ఇంతకాలం సర్వీస్ చేసిన కార్మికుడి గతి ఏమిటి? అందుకే కమ్యూనిస్టుల పోరాటం.

పాత చట్టం ప్రకారం ఏడుగురు ఉంటే ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చు. మారిన కోడ్ ప్రకారం పరిశ్రమ సిబ్బందిలో 10శాతం లేదా 100 మంది సిబ్బంది ఉంటేనే యూనియన్ పెట్టాలి. దీన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లను ఖననం చేస్తోంది. కార్మికుడు, యజమాని మధ్య వివాదం తలెత్తితే కొత్త కోడ్ సెక్షన్ 97 ప్రకారం సివిల్ కోర్టుల్లో ఈ వివాదాలు వేయరాదు. బీజేపీ నాయకుడేమో పారిశ్రామిక వివాదాలు ఈ కొత్త కోడ్ వల్ల సత్వరం పరిష్కారం అవుతాయంటున్నారు. ఇది కార్మికవర్గాన్ని మోసం చేయటం కాదా?


పాత ఐడి యాక్ట్ 1947 సెక్షన్ 22(ఎ) (బి) ప్రకారం కార్మికులు సమ్మె చేసుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 ప్రకారం సమ్మె పూర్తిగా నిషేధం. ఇది కార్మికుడి సమ్మె హక్కుని లాక్కోవటం కాదా? మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్ 26 వారాలకు కొత్త కోడ్‌లో పెంచామని రాశారు. కానీ ఈ బెనిఫిట్ యూనివర్సల్ కాలేదు. ఈ కోడ్‌లో ఎస్టాబ్లిష్‌మెంట్ అనే పదాన్ని చేర్చారు. ఈ పదంలో అసంఘటితరంగ మహిళలను కలపలేదు. కాబట్టి వారికి వర్తించదు.

90శాతం అసంఘటిత రంగానికి పీఎఫ్ హామీ లభిస్తుందని బీజేపీ నాయకుని ఉవాచ. కాని మైక్రో, చిన్న ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్న కొన్ని మిలియన్ల కార్మికులకు ఈ కొత్త కోడ్ వర్తించటం లేదనేది సత్యం. గ్రాట్యుటీలో మేలు జరుగుతుందన్నదీ అబద్ధమే. గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు ఈ కొత్త కోడ్‌లో అమోఘమైన భద్రత లభిస్తుందని కూడా రాశారు. కాని కొత్త కోడ్‌లో నమ్మదగిన రక్షణ లేదు. కొత్త కోడ్ అమలైతే టేక్ హోం పే తగ్గుతుంది, రిటైర్మెంట్ సేవింగ్స్ పెంచుతారు. ఇది ప్రస్తుతానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కాని కార్మికులు రిటైర్ అయినప్పుడు సేవింగ్స్ మొత్తాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మోసపోయానని అప్పుడు కార్మికుడు నెత్తీ నోరు కొట్టుకుంటాడు. వేజెస్ రీస్ట్రక్చర్ కావటం వల్ల ప్రభుత్వానికి ఇన్‌కం ట్యాక్స్ రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఇది కార్మికుడికి నష్టం, ప్రభుత్వానికి లాభం.

కొత్త కోడ్ ప్రకారం రోజుకి 8 గంటలు, వారానికి 48 గంటలు పనిచేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి అంటున్నారు. కాని ఆర్టీసీలో రోజుకు 16 గంటలు, వారానికి 96 గంటలు కార్మికులు పనిచేస్తున్నారు. వీరి ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలు ప్రభుత్వం ఎందుకు గుర్తించదు? ఇప్పటికైనా కమ్యూనిస్టులను విమర్శించటం మాని కొత్త కోడ్‌లలో మార్పులు చేయకపోతే కార్మికలోకానికి అన్యాయం చేసినట్టే.

ఎస్.బాబు

ఏఐటీయూసీ వర్కింగ్ కమిటీ సభ్యులు

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 01:45 AM