Share News

కమ్యూనిస్టు కవి రాజేశ్వరరావు

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:03 AM

ఎందరో సామాన్యులను కవులుగా, రచయితలుగా, ప్రజా కళాకారులుగా కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించుకుంది. అలాంటి వారిలో ప్రముఖ అభ్యుదయ రచయిత, కమ్యూనిస్టు కవి... కాగితాల రాజేశ్వరరావు(కె.రా) ఉద్యమంతో మమేకమై...

కమ్యూనిస్టు కవి రాజేశ్వరరావు

ఎందరో సామాన్యులను కవులుగా, రచయితలుగా, ప్రజా కళాకారులుగా కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించుకుంది. అలాంటి వారిలో ప్రముఖ అభ్యుదయ రచయిత, కమ్యూనిస్టు కవి... కాగితాల రాజేశ్వరరావు(కె.రా) ఉద్యమంతో మమేకమై అభ్యుదయపథమే తన జీవన విధానంగా బతికినవారు. ‘సాహిత్యంలో సవ్యసాచి’ అని సొదుం రామ్మోహన్, ‘ఇంత పాండిత్యం, ఇంత ప్రతిభ ఒక వ్యక్తిలో ఉండటం అరుదైన విషయం’ అని చేకూరి రామారావు, ‘అభ్యుదయ సాహిత్యోద్యమ యోధుడు కె.రా’ అని చందు సుబ్బారావు, ‘అభ్యుదయోద్యమ ఉత్తుంగ తరంగం రాజేశ్వరరావు’ అని ఎస్వీ సత్యనారాయణ లాంటి ప్రముఖ సాహితీ విమర్శకులు, ఆప్తులు రాజేశ్వరరావుకు కితాబు ఇచ్చారు.

తెలుగు బాలల్లో శాస్త్రీయ భావాల వ్యాప్తి కోసం విశాలాంధ్ర వెలువరించిన ‘చిన్నారి లోకం’ మాసపత్రికకు 1985 నుంచి 1995 వరకు సంపాదకుడిగా ఉన్న కె.రా మూడున్నర దశాబ్దాలు విద్యార్థి, యువజన, ప్రజా నాట్యమండలి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో అవిశ్రాంతంగా పనిచేశారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ప్రవేశం ఉన్నా అభ్యుదయ కవిగానే ప్రసిద్ధి పొందారు. ‘చిన్నారి లోకం’తో పాటు మిలిటెంట్, సౌమ్య, స్నేహ వంటి మాస పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. చురకత్తుల్లాంటి పదాలతో కష్టజీవుల కడగండ్లను తన కవనంలో పలికించారు. కన్నీటి హృదయాలను సమర పతాకాలుగా మలిచారు. మాత్రాబద్ధ ఛందస్సులో నిప్పులు కురిపించి, తనకు కవితా గురువైన గజ్జెల మల్లారెడ్డిని అబ్బురపరిచారు.

భారత కమ్యూనిస్టు పార్టీ 10వ మహాసభలు 1975లో విజయవాడలో జరిగినప్పుడు అందులో ప్రదర్శించిన ‘జనశ్రేణి కదిలింది’ నృత్య నాటిక ఎన్నో ప్రశంసలు పొందింది. 1984, 1985 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం, వయోజన విద్యాశాఖ నిర్వహించిన పోటీలో ‘వెలుగు బాట’ రచనకు, ఎన్‌సీఈఆర్‌టీ బాలసాహిత్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో వాణీరంగారావుతో కలిసి ‘శ్రీహరికోట’ రచనకు బహుమతి అందుకున్నారు. కొవ్వొత్తిలాగా కాలిపోతున్నా వెలుగును చిమ్ముతూనే బతికిన కవి రాజేశ్వరరావు. ఇంటి పేరు సార్థకమై తన సంపదంతా కాగితాలకే పరిమితమైపోయింది.


కమ్యూనిస్టు పార్టీ చరిత్రనంతా ఒక గేయకావ్యంగా ‘నా పార్టీ’ పేరుతో రచించాలని ఉందని కె.రా చాలా వేడుకల్లోనూ, సాహితీ సమావేశాల్లోనూ చెప్పేవారు. అది తన సాహిత్య జీవితంలో మైలురాయి అవుతుందనేవారు. కానీ, వ్యక్తిగత పరిస్థితులు ఆయన కావ్యశక్తిని చంపే యత్నం చేశాయి. బతుకు పోరాటంలో మునిగిపోయి, ఆయన కలగన్న ‘నా పార్టీ’ అసంపూర్తిగానే మిగిలిపోయింది. మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక్క గేయంలోనే ప్రతిబింబించేలా రాశారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి కవితాత్మకంగా మొదలుపెట్టి రాసిన చిత్తుప్రతి కొద్దిభాగం ‘రాజేశ్వరరావు కవితలు’గా వేసిన పుస్తకంలో ఉంది.

పుడమి తల్లి పొత్తిటిలో/ పుష్పించిన మందారం/ అంధతమో వారాసిని/ ప్రభవించిన అంగారం!/ జనించింది నా పార్టీ/ శ్రమజీవుల కాయుధమై/ అగణిత పీడిత జనగణ/ ఆశయ ప్రతి రూపమ్మై!!

56 ఏళ్లపాటు సాగిన సాహిత్య–ఉద్యమ ప్రయాణం 2004 ఫిబ్రవరి 18న ముగిసినా, కె.రా కవిత్వం మాత్రం ఇప్పటికీ అభ్యుదయ సాహిత్యంలో జీవించే ఉంది.

కాగితాల రాజశేఖర్

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 01:03 AM