కానరాని కోకో ధరల విధానం
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:11 AM
కోకో కాంక్లేవ్‌ను జనవరి 30, 31 తేదీల్లో ఏలూరు వేదికగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాంక్లేవ్ ద్వారా కోకో గింజల ధర సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్రంలోని కోకో రైతులు...
కోకో కాంక్లేవ్‌ను జనవరి 30, 31 తేదీల్లో ఏలూరు వేదికగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాంక్లేవ్ ద్వారా కోకో గింజల ధర సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్రంలోని కోకో రైతులు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఇవ్వకుండా ధరలు తగ్గించి రైతులను మోసగించాయి.
రాష్ట్రంలో 75 వేల ఎకరాలలో కోకో సాగు ఉన్నది. ప్రధానంగా కొబ్బరి, ఆయిల్ పామ్ పంటలకు అంతర పంటగా రైతులు కోకోను సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటలకు తెగుళ్లు ఆశించడం, ఈ సంవత్సరం మినహా గత అనేక సంవత్సరాలుగా కొబ్బరికి ధర లేకపోవడం, కొబ్బరి రైతులు సంక్షోభం ఎదుర్కోవడం వలన రైతులు కోకో పంట మీదనే ఆధారపడ్డారు. అంతర పంట అయిన కోకో కాస్తా ప్రధాన పంటగా మారింది.
ప్రపంచంలో 20 దేశాలలో కోకో పంట సాగు ఉండగా, వాటిలో భారత్ 20వ దేశంగా ఉంది. మన దేశ అవసరాలకు కావలసిన కోకో గింజల్లో 20శాతం మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. తక్కిన 80శాతం కోకో గింజలతోపాటు, కోకో పౌడర్, బటర్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కోకో రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. భారత్– యూరప్ యూనియన్ మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చాక్లెట్ ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోకో ఉత్పత్తులపై నామమాత్రపు దిగుమతి సుంకాలు ఉండడం వలన కంపెనీలు విదేశీ కోకో ఉత్పత్తులను దిగుమతి చేసుకొని దేశీయంగా రైతులను నష్టపరుస్తున్నాయి. కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిపోయి సున్నా శాతం దిగుమతి సుంకాలకు ఒప్పందాలు చేసుకోవడం వలన రైతులు మరింతగా నష్టపోయే పరిస్థితి దాపురిస్తుంది.
రైతులు ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తుంటే వాటి కొనుగోలుకు, మార్కెటింగ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను గాలికి వదిలేయడం అన్యాయం. రాష్ట్రంలో 30 ఏళ్లకు పైగా కోకో పంట సాగు అవుతుంటే ఇంతవరకు కోకో గింజలకు ధర నిర్ణయ విధానం లేకపోవడం దారుణం. రాష్ట్రంలో పామాయిల్ రైతులు ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయ సూత్రాన్ని సాధించుకున్నారు. ఆయిల్ పామ్ గెలలకు క్రషింగ్ ద్వారా వచ్చే ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఇఆర్) ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములా ప్రకారం ప్రతి నెల ధర నిర్ణయం జరుగుతుంది. అదే విధంగా కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించాలని రైతాంగం కోరుతోంది. కోకో గింజలకు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేసిన ఫలితంగా గత ఏడాది రూ.500కోట్లకు పైగా రాష్ట్ర కోకో రైతులు నష్టపోయారు. 2025 ఫిబ్రవరి నుంచి మే వరకు నాలుగు నెలల పాటు సుదీర్ఘ పోరాటాన్ని రాష్ట్రంలో కోకో రైతులు సాగించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రూ.50 ప్రోత్సాహం అందించి కిలో కోకో గింజలకు రూ.500 ధర కల్పించింది. కోకో రైతులకు ప్రోత్సాహం పేరుతో రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. అయితే రైతులు నష్టపోయింది రూ.500 కోట్లు పైనే.
ప్రస్తుతం కిలో కోకో గింజలను కంపెనీలు రూ.350కి మొదలుపెట్టి రైతుల ఆందోళనలతో రూ.400లకు పెంచి కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిపోయిందంటూ కంపెనీల ప్రతి నిధులు ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరిగినప్పుడు ఈ కంపెనీల ప్రతినిధులు పెరిగిన ధరల గురించి కనీసం మాట్లాడటం లేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. కోకో గింజల ఉత్పత్తి కూడా దేశంలో 50శాతం ఏపీలోనే ఉత్పత్తి జరుగుతున్నది. గత సంవత్సర కాలంగా రైతులలో ఐక్యత పెరిగింది. కోకో రైతులు వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోకో పంట విస్తీర్ణం పెరుగుదలకు, కోకో ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు, సబ్సిడీలు ఇస్తున్నట్లు చెబుతున్నది. అయితే రైతులు కోరుతున్న విధంగా కోకో గింజల ధరల పాలసీ గురించి మాట్లాడడం లేదు.
ఏలూరు కేంద్రంగా జనవరి 30, 31 తేదీల్లో జరుగుతున్న కోకో కాంక్లేవ్‌లోనైనా కోకో గింజల ధరల నిర్ణయానికి ఫార్ములా రూపొందించేందుకు తగు సమాలోచనలు చేస్తారని ఆశిద్దాం. రాష్ట్రంలో కోకో విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కోకో పరిశోధనా సంస్థ ఏర్పాటు అత్యవసరం. అంతేకాకుండా కొబ్బరి బోర్డులా రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలి.
కె.శ్రీనివాస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోకో రైతుల సంఘం
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..