Share News

కొత్త రాజకీయుల కలకలం

ABN , Publish Date - May 30 , 2026 | 03:12 AM

కాక్రోచ్‌ (బొద్దింక) అనే నామవాచకం ఒక చెడ్డ పదం లేదా దుర్భాష కాదు. బొద్దింకల దేహ మౌలిక నిర్మాణం ఇంచుమించు 200 మిలియన్‌ సంవత్సరాలుగా ఒకే తీరున ఉన్నదని, మూడు లక్షల సంవత్సరాల క్రితం...

కొత్త రాజకీయుల కలకలం

కాక్రోచ్‌ (బొద్దింక) అనే నామవాచకం ఒక చెడ్డ పదం లేదా దుర్భాష కాదు. బొద్దింకల దేహ మౌలిక నిర్మాణం ఇంచుమించు 200 మిలియన్‌ సంవత్సరాలుగా ఒకే తీరున ఉన్నదని, మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో హోమో సెపియన్స్‌ తొట్టతొలుత ఆవిర్భవించడానికి 199,700,000 సంవత్సరాలకు పూర్వమే బొద్దింకలు ఉనికిలో ఉన్నాయని వీకిపిడియా వెల్లడించింది. చెప్పవచ్చినదేమిటంటే ఈ ధరిత్రిపై మానవుల కంటే బొద్దింకలకే చాలా పురాతన చరిత్ర ఉన్నది. మనుగడ సాగించేందుకు మానవుల కంటే వాటికే తొలి హక్కు ఉన్నదనేది స్పష్టం. బొద్దింకలు కరవవని, కొరకవని, కాటువేయవని సైన్స్‌ ఎన్‌సైక్లోపీడియా తెలియజేసింది. బొద్దింకలపై దాడిచేసే వారిలా అవి ఎవరిపైన దాడి చేయవని ఆ విజ్ఞానసర్వస్వం పేర్కొంది. బొద్దింకల దేహాలపై సూక్ష్మజీవులు అపారంగా ఉంటాయి. బొద్దింకలూ వ్యాధులను సంక్రమింపజేస్తాయి. మానవుల శరీరాలు కూడా సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించేవే. సరే, మానవులు వ్యాధులను, ముఖ్యంగా ముఖ్యంగా శత్రు సమూహాలలోని వారికి సంక్రమింపచేస్తారని మరి చెప్పనవసరం లేదు. కొంతమంది మానవులు ఇతర మానవులను పురుగులుగా చూసినట్టే కొంత మంది మనుషులు బొద్దింకలను పాకేపురుగులుగా, గగుర్పాటు కలిగించేవిగా చూస్తారు.

కొద్ది రోజుల క్రితం ఒక పెద్ద మనిషి బొద్దింకలను కలత నిద్ర నుంచి మేల్కొలిపారు. అయితే ఆ వెన్వెంటనే తాను నకిలీ న్యాయశాస్త్ర డిగ్రీలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారి గురించి వ్యాఖ్యానించానని ఆయన వివరణ ఇచ్చారు. చెడ్డ పేర్లతో పిలిచేందుకు నకిలీ న్యాయవాదులు అర్హులే. అయితే బొద్దింకలుగా మాత్రం వారిని పిలవకూడదని నేను సవినయంగా కోరుతున్నాను. ఆ పెద్ద మనిషి పుణ్యమా అని మేల్కొన్న అపూర్వ బొద్దింకలు చైతన్యశీలమయ్యాయి. కొన్ని బొద్దింకలు ఒక రాజకీయ పార్టీని స్థాపించాయి. సామాజిక మాధ్యమం ఎక్స్‌ హ్యాండిల్‌ నొకదాన్ని ప్రారంభించాయి. ఒక వెబ్‌సైట్‌ను సృష్టించాయి. ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ నొకదాన్ని కూడాప్రారంభించాయి. చివరి గణన ప్రకారం ఈ బొద్దింకల హ్యాండిల్‌కు 2.20కోట్ల మంది అనుయాయులు ఉన్నారు.


చైతన్యశీలమైన బొద్దింకలు ప్రతీకారానికి దిగాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ అనే ఆన్‌లైన్‌ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ డీప్కే అనే 30 ఏళ్ల యువకుడు ప్రారంభించిన ఎక్స్‌ హ్యాండిల్‌ బొద్దింకల ప్రతీకారచర్యలకు ఆలంబన అయింది. పర్యవసానంగా మానవుల్లోను కలకలం రేగింది. కొంత మంది వణికిపోయారు. కొల్హాపురి పాదరక్షలు ధరించేవారు మరీ అల్లాడిపోయారు. కాకపోతే. అపార సైనిక బలం ఉన్న భారతదేశ అత్యున్నత కార్యనిర్వాహణాధికారి ఆ ఎక్స్‌ హ్యాండిల్‌ను మూసివేయాలని అడగడమేమిటి? అభిజిత్‌ మన ఫ్రెన్మీ (ఫ్రెండ్‌– ఎనిమీ స్నేహితుడు– శత్రువు) డోనాల్డ్‌ మహాశయుడి సంరక్షణలో ఉన్న ఒక అమెరికన్‌ విశ్వవిద్యాలయంలో ‘పబ్లిక్‌ రిలేషన్స్‌’లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. ఏర్పాటు చేసిన సీజేపీ లక్ష్యాలు ఏమిటో ఆ పార్టీ వెబ్‌సైట్‌ ఇలా పేర్కొంది: ‘బొద్దింక గుర్తింపును మేము సొంతం చేసుకుంటున్నాం–యువత తమ గొంతు వినిపించేందుకు అదే అవసరమైతే...’ వ్యవస్థ పరిగణనలోకి తీసుకోవడాన్ని మరచిపోయిన ప్రజలకు ప్రాతినిధ్యం వహిండమే తమ లక్ష్యమని సీజేపీ లక్ష్యమని అభిజిత్‌ స్పష్టం చేశారు. తన ఎక్స్‌ హ్యాండిల్‌కు ‘సోమరిపోతుల, నిరుద్యోగుల గొంతు’ అనే ట్యాన్‌లైన్‌ నిచ్చాడు. గాంధీ, అంబేడ్కర్‌, నెహ్రూ నుంచి స్ఫూర్తి పొందిన యువకుడు అతడు. సీజేపీ మేనిఫెస్టో చదివిన వారిని నవ్విస్తుంది, ఆలోచింపచేస్తుంది.

దేశ ప్రజలలో ముఖ్యంగా యువ మహిళలతో సహా యువతలో విస్తృతంగా నెలకొనివున్న నిరాశా నిస్పృహలు, అపనమ్మకాలు, ఆశాభంగాలపై సీజేపీ ఆధారపడుతోంది. ఈ విపరీత, పరిస్థితులకు కారణాలను నిశితంగా చూద్దాం. నిరుద్యోగిత: మొత్తం ప్రజల్లో నిరుద్యోగం రేటు 5.2శాతం; యువజనుల నిరుద్యోగం రేటు 16 నుంచి 17శాతం. శ్రామిక శక్తి 64.3 కోట్లు; ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటున్నవారు మొత్తం కార్మికులలో 60శాతం మంది మాత్రమే. మిగతా 40శాతం మంది అంటే 25 కోట్ల మంది బొద్దింకలు (క్షమించాలి). సమస్త బొద్దింకల ఓట్లను సీజేపీ కైవసం చేసుకోగలిగితే ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేయడం ఖాయం (2024 లోక్‌సభ ఎన్నికలలో పోలయిన మొత్తం ఓట్లలో బీజేపీకి 23.6 కోట్లు, కాంగ్రెస్‌కు 13.7 కోట్లు లభించాయి).

పెట్రోల్‌, డీజిల్‌: నిరంతర గమనమే బొద్దింకలకు జీవన వనరు. పెరిగిపోయిన ఇంధన ధరలు బొద్దింకల గమనాన్ని పరిమితం చేసింది. ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.102.12 కాగా డీజిల్‌ ధర రూ.95.20. బీజేపీకి ఓటు వేసిన పాపానికి గాను కోల్‌కతా వాసులకు ఆ ధరలను వరుసగా రూ.113.51, రూ.99.82గా నిర్ణయించారు!


ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు: బొద్దింకలు స్వతహాగా సోమరిపోతులు. ప్రతి ఉదయమూ ఇరుగు పొరుగు ప్రదేశాలలో శాఖా సమావేశానికి హాజరయ్యేందుకు త్వరగా లేచేందుకు శ్రద్ధ చూపనందున ప్రభుత్వోద్యోగాలకు వారు అనర్హులైపోయారు. ఇక వారికి అందుబాటులో ఉండే ఉద్యోగం ఫ్యాక్టరీ ఉద్యోగం. అధికారిక సమాచారం ప్రకారం మన దేశంలో 2,60,061 నమోదైన ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో 1.95 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. కృత్రిమ మేధ వినియోగం పెరిగిపోయినందున వాటిలో చాలా భాగం అనావశ్యకమైనవే. తత్కారణంగా 35 కోట్ల బొద్దింకలకు ఫ్యాక్టరీ ఉద్యోగం లభించే అవకాశం లేనే లేదు. మరి ఆ బొద్దింకలు ఆశాభంగానికి గురి కాకుండా ఎలా ఉంటాయి?

కుటుంబ మద్దతు: బొద్దింకలను కుటుంబాలే పోషిస్తుంటాయి. ఇందుకు ప్రతిగా వారు నెలనెలా ఐదు కిలోల ఉచిత తిండిగింజలను కుటుంబానికి సమకూరుస్తుంటారు. కుటుంబాల రుణభారం జీడీపీలో 42శాతంగా ఉండగా పొదుపుల మొత్తం జీడీపీలో కేవలం 5 నుంచి 6శాతం మాత్రమే బొద్దింకలకు కుటుంబాల నుంచి నగదు సహాయం అందదు. నగదురహిత జీవులవి.

వికసిత భారత్‌ బిలియనీర్‌: వికసిత భారత్‌లో బిలియనీర్లు అయ్యేందుకు బొద్దింకలు ఆరాటపడుతున్నాయి. పన్నెండు సంవత్సరాల బీజేపీ పాలన తరువాత కూడా బిలియనీర్ల పెరుగుదల నత్త నడకలో న్నది. తాజా లెక్క ప్రకారం వారి సంఖ్య 205 మాత్రమే. బిలియనీర్లు అయ్యేందుకు 25 కోట్ల బొద్దింకలు వేచివున్నాయి. 2014లో వాగ్దానం చేసిన రూ.15 లక్షల అచ్చేదిన్‌ ఆగమనానికి కళ్లు పెద్దవి చేసుకుని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నాయి.

బొద్దింకలు బొద్దింకల ఆర్థిక సలహాదారును ఆశ్రయించాయి (కాక్రోచెస్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌– సీఈఏ). సీఈఏ సలహా నిరాశాజనకంగా ఉన్నది: ‘2027 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు మరింతగా పెరుగుతుంది. అలాగే కరెంట్‌ ఖాతా లోటు కూడా. ద్రవ్యోల్బణం చిక్కులు మరింతగా ఉధృతమవుతాయి. రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా వర్షిస్తాయి. ఆహార ధాన్యాల సరఫరా అవసరాల మేరకు ఉండదు. ఈ పరిస్థితుల్లో విశ్వసనీయ పన్నుల విధానం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే ముమ్మర ప్రయత్నాలు చేయడం అవశ్యం’ సీఈఏ సలహా ముంచుకొస్తున్న ఆర్థిక విపత్తును స్పష్టంగా సూచించింది.

ఆర్థిక విపత్తును నిరోధించడమెలా? బొద్దింకలు మేధామథనం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రధానాధికారి సహాయంతో మానవుల నుంచి బొద్దింకలకు శాంతియుతంగా అధికార బదిలీకి ప్రయత్నించమే ఏకైక మార్గమని బొద్దింకలు నిర్ణయించవచ్చు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి..

మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

For More AP News And Telugu News

Updated Date - May 30 , 2026 | 03:12 AM