Share News

చదువుల చిరునామాకు వందేళ్లు

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:58 AM

చుక్కా రామయ్య చిరునామా జనగామ ఫిర్కా, పాలకుర్తి మండలం, గూడురు. అది శైవ సాహిత్యాన్ని చాటిచెప్పిన పాల్కురికి సోమనాథుడు తిరుగాడిన స్థలం. మరోపక్క పాలకుర్తి చాకలి ఐలమ్మ పిడికిలి ఎత్తిన ఊరు....

చదువుల చిరునామాకు వందేళ్లు

చుక్కా రామయ్య చిరునామా జనగామ ఫిర్కా, పాలకుర్తి మండలం, గూడురు. అది శైవ సాహిత్యాన్ని చాటిచెప్పిన పాల్కురికి సోమనాథుడు తిరుగాడిన స్థలం. మరోపక్క పాలకుర్తి చాకలి ఐలమ్మ పిడికిలి ఎత్తిన ఊరు. వీర తెలంగాణ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన కడివెండి ఇక్కడకు కూతవేటు దూరంలో ఉంటుంది. దొడ్డి కొమురయ్య అమరత్వంతో ఆ నేలంతా ఎరుపెక్కింది. పాలకుర్తికి దగ్గర్లోనే పోతన సాహిత్య సాగు చేసిన నేల బమ్మెర గ్రామం ఉంది. ఈ చైతన్యగడ్డపై సాయుధ విప్లవాల, వెట్టి వ్యతిరేక పోరాటాల కాలంలో పుట్టినవారు మన చదువుల తాత చుక్కా రామయ్య. సాయుధ విప్లవం నుంచి వచ్చి సాంకేతిక విప్లవాలు సృష్టించిన చుక్కా రామయ్యవి నాలుగు తరాలను చూసిన కళ్లు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ అవగాహనను ప్రాథమిక స్థాయి నుంచే పెంచాలన్న తలంపుకు కారకులు ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధులైన మన చుక్కా రామయ్య. ఐఐటీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వేలాదిమందిని సాంకేతిక విప్లవకారులుగా తయారు చేశారు. ఐఐటీ పిల్లలను తయారు చేయటమేగాక రాష్ట్రానికి ఐఐటీ కావాలని కేంద్రానికి విన్నపాలు చేశారు. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చుక్కా రామయ్య మాట్లాడిన తర్వాత వెనుకబడ్డ ప్రాంతం బాసరలో ఐఐటీని నెలకొల్పుతానని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐఐటీని బాసరలో కాకుండా హైదరాబాద్‌లో అంతర్భాగమైన కందిలో నెలకొల్పారు. బాసర ఐఐటీ కోసం రామయ్య ఉద్యమమే చేపట్టారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితర ప్రజాసంఘాలు బాసరలో ఐఐటీ నెలకొల్పాలన్న ఉద్యమంలో పాల్గొన్నాయి. కానీ చివరకు బాసరలో ట్రిపుల్ ఐటీ సంస్థను నెలకొల్పారు. రాష్ట్రంలో ఐఐటీని నెలకొల్పాలన్న ఆలోచనలను పురికొల్పి అందుకోసం తపించిన తపస్వి చుక్కా రామయ్య.


తెలంగాణలో వెట్టి చాకిరీ వ్యతిరేక పోరాటం ఎగిసిపడి అది భూమి, భుక్తి విముక్తి పోరాటంగా మారింది. నూనూగుమీసాల యువకుడిగా చుక్కా రామయ్య ఆ పోరాటంలో దూకారు. అరెస్టు అయ్యారు. జైలులో బొమ్మగాని ధర్మభిక్షంతో పోరాట పాఠాలు చదువుకున్నారు. ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ఔరంగాబాద్ జైలర్ బిడ్డకు లెక్కలు రావు. ఖైదీలలో ఉన్న చుక్కా రామయ్యకు లెక్కలు బాగా వచ్చునని జైలర్‌కు తెలియటంతో జైలు సిబ్బందిని రామయ్య దగ్గరకు పంపారు. జైలర్ నిజాం రాజు సేవకుడని, ఆయన బిడ్డకు లెక్కలు చెప్పనన్నారు రామయ్య. నువ్వు రోజూ జైలు బయటకు వెళ్లిరావటం వల్ల ఉద్యమ సమాచారం లోపలకు తేవచ్చును, ఇక్కడి నుంచి సమాచారం బైటకు పంపడానికి అవకాశం దొరుకుతుందని ధర్మభిక్షం మాట్లాడి రామయ్యను ఒప్పిస్తే, వెళ్లి లెక్కలు చెప్పి వచ్చేవారు. రామయ్య నిబద్ధతను చూసి జైలులోని కమ్యూనిస్టులు గర్వపడ్డారు.

వీర తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత చుక్కా రామయ్య ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. భువనగిరిలో లెక్కల పాఠాలు చెబుతూనే సామాజిక చైతన్యం ఆరిపోకుండా కాపాడుకుంటూ వచ్చారు. అక్కడ లెక్కల టీచర్ తెలిదేవర వెంకట్రావు సాంగత్యంలో ఉపాధ్యాయుల విధులు, పిల్లల్లో సృజనను వెలికి తీసే పద్ధతులు, తరగతి గది నిర్వహణ మెళకువలు తెలుసుకున్నారు. వాటన్నిటిని ‘రామయ్య జ్ఞాపకాలు’ పుస్తకంగా రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి అధ్యాపకునిగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఉపాధ్యాయ సంఘ నేతగా, అధ్యాపకునిగా ఉండి అధ్యాపక సంఘ నేతగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి ప్రిన్సిపల్స్‌ సంఘ నేతగా పనిచేశారు. తెలంగాణ దొర గడీల పెత్తనాన్ని కళ్లారా చూసి పోరాడిన రామయ్య ఆ పోరు జ్వాలల్ని తనలో ఆరిపోకుండా చూసుకున్నారు. నిజాం పాలన తర్వాత షేర్వానీలు విడిచిన దొరలు ఏ విధంగా ఖద్దరు ధరించి, రూపాలు మార్చుకుని, మళ్లీ ఆధిపత్య పెత్తనాలు చలాయిస్తూ ఎలా వచ్చారో రామయ్యకు బాగా తెలుసు. ఐఐటీ రామయ్యగా లోకం దృష్టిలో స్థిరపడినప్పటికీ ఆయనలో సామాజిక రామయ్య ఇప్పటికీ చెక్కుచెదరలేదు.


1983లో ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నప్పుడు మోటూరి హనుమంతరావు విన్నపం మేరకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి ఎన్నికల్లో యూటీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు పీఆర్టీయూ హవా కొనసాగుతోంది. పీఆర్టీయూ అభ్యర్థి ధర్మారెడ్డిపై పోటీ కష్టమేనని తెలిసినా మోటూరి అడగటంతో ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి పోటీ చేశారు. ఓట్లు బాగానే వచ్చాయి కానీ ఓడిపోయారు. 2007లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి అదే ధర్మారెడ్డిపై చుక్కా రామయ్య పోటీ చేశారు. అప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కూడా వచ్చేసింది. కానీ చుక్కా రామయ్య డబ్బు పెట్టలేదు. ఏ స్కూలుకు పోయినా ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా ఆయనను ఆహ్వానించి దీవించారు. రామయ్య ఎన్నికల ప్రచారంలో ఓట్లడగటం మరిచిపోయి, తరగతి గదిలోకి వెళ్లి పిల్లలకు లెక్కలు చెప్పి, వాళ్లతో మాట్లాడేవారు. ఆయన వెంటవెళ్లిన ప్రచారకులు బలవంతంగా తరగతి గది నుంచి ఆయనను బయటకు తెచ్చేవారు. ఈ ఎన్నికల్లో ధర్మారెడ్డిపై రామయ్య గెలుపొందారు. రామయ్యకు తరగతి గది ప్రాణం. ఆ నిబద్ధతతోనే ఐఐటీ పిల్లలను తయారు చేసి, అమెరికాలో సిలికాన్‌వ్యాలీ తెలుగు పిల్లలతో నిండిపోవటానికి కారకుడయ్యారు.

రామయ్య మైకు ముందుకు వస్తే కంఠం ప్రతిధ్వనించేది. సామాజిక అంశాలను గొంతెత్తి మాట్లాడేవారు. ఆయన తిరగని ప్రదేశం లేదు. తుని నుంచి తడ వరకు, కోదాడ నుంచి కొడంగల్ వరకు, ఆదిలాబాద్ నుంచి అమలాపురం వరకు వేలాది వేదికలపై రామయ్య కంఠం విద్యారంగంపై మారుమ్రోగేది. విద్యారంగం పట్ల తనకున్న అభిప్రాయాలపై అన్ని దినపత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు. అమెరికా పర్యటనకు వెళ్లి ‘అమెరికా పాఠం’, చైనాకు వెళితే ‘చైనా పాఠం’, సింగపూర్‌కు వెళితే ‘సింగపూరు చదువులు’ పుస్తకాలు రాశారు. ఇలా ఇరవైకి పైగా విద్యారంగంపై పుస్తకాలను రాశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో రామయ్య రాసిన పుస్తకాలు అన్ని ప్రభుత్వ స్కూళ్లలోకీ వెళ్లాయి. విద్యామంత్రులెవరైనా రామయ్య పుస్తకాలంటే ఇష్టంగా పాఠశాలలన్నింటిలో ఉండాలనేవారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు స్వయంగా తనే వెళ్లి ఐఐటీ కోచింగ్ ఇచ్చేవారు. రామయ్య ఆలోచనలతోనే 25 ఏళ్ల క్రితం ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ’లను తయారు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదపిల్లలకు ఐఐటీ కోచింగ్ ఇచ్చేవారు.


జీవితాన్ని తరగతి గదికి అంకితం చేసిన చుక్కా రామయ్య పేరును ఏదైనా ఒక విశ్వవిద్యాలయానికి పెడితే బాగుంటుంది. ఈ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, విద్యావేత్తలు ఆలోచించాలి.

జూలూరు గౌరీశంకర్

చుక్కా రామయ్య రచనల సంపాదకుడు,

తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్

(రేపు చుక్కా రామయ్య పుట్టినరోజు సందర్భంగా జరిగే వేడుకలో, పలువురు ప్రముఖుల సమక్షంలో, జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ‘మన చుక్కా రామయ్య, వందేళ్ల పండుగ’ పేరుతో సావనీర్‌ ఆవిష్కరణ)

ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 01:58 AM