అర్థమవుతోందా ట్రంప్.. ఒడిస్సీ సందేశం!
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:58 AM
ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ చల్లటి కబురు చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్నదే ఆ చక్కటి మాట! అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్నదే అది...
ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ చల్లటి కబురు చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్నదే ఆ చక్కటి మాట! అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్నదే అది కదా! ఆ యుద్ధ పరిసమాప్తినే సమస్త దేశాలూ ఆకాంక్షిస్తున్నాయి. ప్రపంచ ప్రజలూ అందుకోసమే ప్రతీక్షిస్తున్నారు. కళారూపాలు ఆ ఆరాటాన్నే వ్యక్తం చేస్తున్నాయి, ప్రతిబింబిస్తున్నాయి. ఇదిగో, ఈ మధ్యే విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హాలీవుడ్ చిత్రం ‘ఒడిస్సీ’ కూడా మానవాళి అభిమతాన్ని చెప్పకనే చెప్పింది: యుద్ధం వద్దు, శాంతి ముఖ్యం.
ఇంతకుముందు ‘ఇంటర్ స్టెల్లార్’, ‘ఓపెన్ హైమర్’ వంటి సినిమాలతో చలనచిత్ర జగత్తులో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సృష్టించుకున్న క్రిస్టోఫర్ నోలన్ ఈ ‘ఒడిస్సీ’ దర్శకుడు. మౌఖిక సంప్రదాయంలో ప్రజల నోళ్లలో నానుతున్న ఒక గ్రీక్ పుక్కిటపురాణాన్ని తన ‘ఒడిస్సీ’కి కథగా నోలన్ ఎంచుకున్నాడు. అసలు నిజంగా ఉన్నాడో లేడో తెలియని ప్రాచీన గ్రీక్ వాగ్గేయకారుడు హోమర్ మూడువేల సంవత్సరాల క్రితం రాసినట్టు చెబుతున్న ‘ఒడిస్సీ’ అనే కావ్యం ఈ నాటి అత్యాధునిక డిజిటల్ ప్రపంచంలో ఐమాక్స్ ఫార్మాట్‌లో చలనచిత్రంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదొక కళాత్మక విచిత్రం. సౌందర్యాత్మక విచిత్రమది.
నోలన్ ‘ఒడిస్సీ’లో ఉర్రూతలూగించే దృశ్యాలు లేవు. భయంకరమైన యుద్ధాలు లేవు. సినిమా విజయానికి సాధారణంగా కావలసిన పటాటోపం కూడా ఏమీ లేదు! అయినప్పటికీ, లేదా అందువల్లే ఈ ‘ఒడిస్సీ’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు ఒక కారణం అంతకుముందు తెలిసినా తెలియకపోయినా స్వభావరీత్యా కథ సార్వజనీనం కావడమే. ఆ కథ ప్రతి దేశ చరిత్రతోనూ ఎంతో కొంత ప్రాసంగికత కలిగి ఉండడం మరో కారణం. మరీ ముఖ్యంగా ఈ చిత్ర కథనంతో ప్రేక్షకులు ఏదో ఒక దశలో తమను తాము గుర్తించగలగడం! జీవితంలో చాలా సాధించేశాం అనుకున్న తర్వాత ఇంకా ఏముంది సాధించడానికి అన్న మీమాంస మొదలవుతుంది, లేదా జీవన పోరాటంలో మన చుట్టూ ఉన్న మనవాళ్లు చివరివరకూ ఉంటారని ఆశిస్తే వారంతా పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆకస్మికంగా మనకు దూరం కావచ్చు. విజయ తీరాలు దాటేసిన తర్వాత ఒంటరిగా మిగిలిపోవచ్చు, ఎటుపోవడానికీ పాలుపోని సమయంలో అనూహ్యంగా ఎవరో వచ్చి కాసింత బాసటగా నిలవచ్చు. జీవితంలో ఏదో సాధించడానికి ఎక్కడెక్కడికో ఒంటరి ప్రయాణం చేస్తుంటే ఇంటివాళ్ల పరిస్థితి జ్ఞప్తికి వచ్చి మానసికంగా అశాంతికి గురి కావచ్చు; తీరా ఇంటికి వచ్చాక మనవాళ్లకు మనమే సుదూరతీరాల నుంచి వచ్చిన అపరిచితుల్లా కనిపించవచ్చు... ఈ దశలన్నిటినీ ‘ఒడిస్సీ’ చిత్రంలోని కథానాయకుడు ఒడిస్సియస్ అనుభవిస్తాడు. ఇటువంటి అనుభవాలు ఆధునిక జీవితంలో సైతం మనకూ ఎదురుకావచ్చు. అటువంటి స్థితిలోనే ప్రేక్షకులు ఒడిస్సియస్‌లో తమను తాము చూసుకుంటారు. ఆ పాత్రతో తాదాత్మ్యం చెందుతారు.
హోమర్ ‘ఒడిస్సీ’ కథ దాదాపు అందరికీ తెలిసిందే. స్థూలంగా– ఇథాకా రాజ్యానికి రాజు ఒడిస్సియస్. లాటరీ ద్వారా సైనికులను ఎంచుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. శత్రు దుర్భేద్యమైన ట్రాయ్ (నేటి తుర్కీయే దేశంలో ఉండేదని చరిత్రకారులు నిర్ధారించారు) నగరాన్ని జయించలేకపోతాడు. ట్రాయ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఒక అద్భుతవ్యూహాన్ని ఒడిస్సియస్ రూపొందిస్తాడు. దాని ప్రకారం ఒక పెద్ద కొయ్య గుర్రాన్ని తయారు చేయించి తాను సహా ముఖ్యమైన సైనికులను అందులో దాక్కోపెడతాడు. ఇదో కుతంత్రం. సముద్రం ఒడ్డున సగం మట్టిలో కూరుకుపోయినట్టున్న ఆ కొయ్య గుర్రం గురించి ట్రాయ్ సైనికులు ఆరా తీస్తారు. పోతూ పోతూ ప్రత్యర్థులు దీన్ని బహుమతిగా ఇచ్చి వెళ్లారని తమ సైనికునితోనే ఒడిస్సియస్ చెప్పిస్తాడు. అప్పటికే శత్రువులు వెన్ను చూపారన్నట్టు ఒక కథ అల్లుతారు. శత్రువు ఇచ్చింది తీసుకోవాలా, వద్దా అన్న మీమాంస తర్వాత కొయ్య గుర్రాన్ని ట్రాయ్ నగరంలోకి తాళ్లతో గుంజుకుంటూ తీసుకువెళ్తారు. ఆ కాళరాత్రి... ట్రాయ్ సైనికులు నిద్రపోతున్న సమయంలో కొయ్య గుర్రంలో దాక్కున్న ఒడిస్సియస్ బయటకు వచ్చి, ట్రాయ్ కోట తలుపులు తీయించి, తనవారిని లోపలకు రప్పిస్తాడు. ట్రాయ్‌కు వ్యతిరేకంగా యుద్ధ భేరీ మోగిస్తాడు. ఆ అధర్మయుద్ధంలో విజయం సాధిస్తాడు. ఇదంతా పదేళ్లపాటు జరిగే ఒక కథ.
ఆ తర్వాత జరిగేదే అసలు కథ. సమాజానికి, జీవితానికి, జీవికకూ ఒక నీతి ఉండాలి. అలాగే యుద్ధానికి కూడా ఒక నీతి ఉండాలి. ఈ నీతి అలిఖితం. కానీ ఒడిస్సియస్ ఇవేమీ పాటించలేదు. అధర్మ యుద్ధం చేసి, సహచరులను పోగొట్టుకుంటాడు. జీవితంలో పదేళ్లు కోల్పోతాడు. మనశ్శాంతి కరువవుతుంది. మిగిలిన కొద్దిపాటి సైనికులతో చివరికి ఇంటి ముఖం పడతాడు. మార్గమధ్యంలో ఆహారం కోసం ఆగినప్పుడు భారీ కాయం గల సముద్రుని కొడుకు ఏకాక్షి మగత నిద్రలో ఉండగా, అతని కన్ను పొడిపించి, అంధుణ్ణి చేస్తాడు. అది కూడా ముఖాముఖి పోరాటం కాదు. కుట్ర కార్యమది. పోతూ పోతూ ఒడిస్సియస్ అహంకారంతో కళ్లు మూసుకుపోయి, విజయగర్వంతో నేనెవరో తెలుసా, ఇథాకా రాజు ఒడిస్సియస్‌ని అని తన గుర్తింపు బయటపెడతాడు. కన్నుపోయిన సముద్రుని కుమారునికి ఈ మాత్రం సమాచారం చాలు, ప్రతీకారం తీర్చుకోవడానికి! తన కళ్లు పోగొట్టిన ఒడిస్సియస్ మీద పగ తీర్చుకోమని తండ్రి పొసైడన్‌ను అభ్యర్థిస్తాడు. పుట్టలో వేలు పెడితే చీమలు కుట్టవూ? మరి సముద్రుడు అంతటివాడికి ఆగ్రహం తెప్పిస్తే...?! సముద్రుడు ఆగ్రహోదగ్రుడు అవుతాడు. అతడి ఆగ్రహంతో కడలి కల్లోలమైపోతుంది. ఒడిస్సియస్‌తో పాటు ఉన్న సైనికులు శాపగ్రస్తులై తనువు చాలిస్తారు. యుద్ధనౌకలు తుత్తునియలైపోతాయి. అంతటా ప్రతికూల పరిస్థితులు. ట్రాయ్ యుద్ధానికి ముగింపు పలికి ప్రశాంతంగా ఇంటికి చేరవలసిన ఒడిస్సియస్‌కు మరో పదేళ్ల కాలం యావత్తూ మొత్తం చీకటే. ప్రకృతి ధర్మాన్ని పాటించకపోతే ఎంతటివారికైనా శిక్ష అనివార్యం. అభిజాత్యం మనిషిని వివేకశూన్యున్ని చేస్తుంది. ఒడిస్సియస్ విషయంలో జరిగింది అదే. సముద్రుని కోపానికి గురై తొలుత సహచరులను కోల్పోతాడు. పిదప తనను తానే కోల్పోతాడు. జ్ఞాపకశక్తి నశించి దారి తెన్నూ లేకుండాపోతాడు. అయితే ఆ మనిషిలో ధైర్యసాహసాలతో పాటు వివేచనా జ్ఞానమూ ఉన్నది. సంస్కారంతో పాటు లోకనీతిని అప్పుడప్పుడైనా పాటించవలసిన విధ్యుక్త ధర్మం అతన్ని వెన్నంటి నడిపిస్తుంటుంది.
మనిషి మనుగడకు పంచేంద్రియాలు ఎంత ముఖ్యమో, ఈ ప్రపంచం ప్రశాంతంగా తన మానాన తాను నడవడానికి పంచ భూతాలు అంతకంటే ఇంకా ఎక్కువ ముఖ్యమన్నది నాగరిక సమాజంలో అనుభవంలోని విషయమే. దర్శకుడు నోలన్ ఈ చిత్రం ద్వారా చెప్పిన సత్యాలు: యుద్ధ రూపంలోనో, విశృంఖల జీవన విధానం వల్లనో ప్రకృతికి తూట్లు పొడిస్తే, ఆ ప్రకృతి మౌనంగా చూస్తూ కూర్చోదు; మనిషిని మళ్లీ మంచి చెడుల తర్కం వైపు నడిపించి, విధ్వంసం నుంచి విముక్తమై నాగరికతను పునర్నిర్మించుకునేట్టు చేస్తుంది; అందుకు ఆధునిక మానవ జీవనం చాలా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఈ మాటలకు పర్యాయ పదాలు అన్నట్టు నోలన్ ఇందులో ఐదు పాత్రలను తీర్చిదిద్దాడు. ఈ ఐదూ స్త్రీ పాత్రలు కావడం విశేషం. అవి పంచభూతాలకు ప్రతిరూపాలు... భూమ్యాకాశాలు, నీరు, నిప్పు, గాలి. ఒడిస్సియస్ భార్య పెనెలోప్ భూమికి ప్రతిరూపం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇరవై ఏళ్ల పాటు సహనంతో రాజ్యాన్ని నడిపిస్తుంది. అలాగే మిగిలిన పాత్రలు. భూమికి కోపం వస్తే భూకంపం పుట్టించదా? ఆకాశానికి మనిషి చిల్లు పెడితే ఏమవుతుంది? ఓజోన్ పొరకు రంధ్రం పడుతుంది. నిప్పును సరిగ్గా వాడుకుంటే జ్ఞాన దీపం వెలిగిస్తుంది. అదే విధ్వంసానికి వాడితే సర్వనాశనమే కదా. గాలి కూడా అంతే. సాధారణంగా ఉంచితే చల్లని గాలులు వీస్తాయి. లేదంటే చండప్రచండం. నోలన్ ఈ సత్యాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడు, సందేశం అసలే ఇవ్వడు. కానీ సినిమా చూస్తున్న మనకు అర్థం అవుతుంది.
సాధారణంగా ఏ జానపద కథ అయినా సుఖాంతమే అవుతుంది. సినిమాలు మరింత సుఖంగా శుభం కార్డు వేయడం ఆనవాయితీ. అయితే నోలన్ ‘ఒడిస్సీ’ ఈ రకమైన సుఖాంతానికి భిన్నం. ఇథాకాకు ఒడిస్సియస్ తిరిగి రాక కోసం అతడి భార్య రాణి పెనెలోప్ ఎంతో ఓర్పుగా ఎదురు చూస్తుంటుంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది.. సింహాసనం మీద కూర్చోకుండానే ఇరవై ఏళ్ల పాటు రాజ్య పాలన చేస్తుంది. భర్త తన చెంత లేకపోవడంపై అమితంగా బాధపడుతుంది. తన మీద కన్నేసిన వారిని చూపులతోనే అల్లంత దూరాన ఉంచుతుంది. తీరా రాజు ఒడిస్సియస్ ఒక బిచ్చగాడిగా మారువేషంలో రాజ ప్రాసాదానికి తిరిగివచ్చి ధర్మబద్ధంగా స్వయంవరంలో విజేతగా నిలిచి కోటలో చేరిన శత్రువులను మట్టుపెట్టి, సర్వేజనా సుఖినోభవంతు అనుకోవలసిన సమయంలో... రాజ్యాన్ని కుమారునికి అప్పగించి మనం అటు పోదాం అని సముద్రం వైపు చూపిస్తాడు.
అంటే ఎటు? ఈ ప్రపంచానికి దూరంగా! రాజ్యానికి, అధికార దర్పానికి, భోగభాగ్యాలకీ దూరంగా... అందలం నుంచి నేలమీదికి దిగివచ్చి గతంలో తనతోపాటు యుద్ధంలో పాల్గొని జీవితంలో సగభాగం కూడా అనుభవించలేకపోయిన నిర్భాగ్యుల ఆత్మశాంతికోసం మనం చేయవలసిన పని చాలా ఉన్నదని పెనెలోప్ రాణికి చెప్పి ఎటునుంచి రాజ్యానికి తిరిగివచ్చాడో మళ్లీ అటువైపే ఆమెతో సహా సముద్రయానం ప్రారంభిస్తాడు. ఈసారి ఆ కడలిలో కల్లోలం లేదు, ప్రశాంతంగా ఉంది. ప్రకృతి సమస్తం ప్రశాంతంగా ఉంది. కుట్రదారుల నుంచి విముక్తి చెందినందుకు ప్రజలు కోలాహలంతో సంబురాలు చేసుకుంటున్నారు. నీలాకాశం ఇప్పుడు నిర్మలంగా ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా యుద్ధ బీభత్సం లేకుండా, ఏ క్షణాన ఏ భయోత్పాతం వచ్చిపడుతుందో అన్న శంక లేకుండా, ప్రకృతి ఎంచుకున్న పర్యావరణ సమతౌల్యానికి ఆటంకం కలగకుండా జీవితం ప్రశాంతంగా ముందుకు సాగడమేగా ప్రజలు కాంక్షించేది! మరెందుకు యుద్ధాలు?
జగన్
సీనియర్ జర్నలిస్ట్
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News