రైతు భవిష్యత్‌కు భరోసా ఇచ్చే క్యాలెండర్!
ABN , Publish Date - May 16 , 2026 | 02:15 AM
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ ఒక భగీరథ ప్రయత్నం. రాష్ట్రంలో కీలక...
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ ఒక భగీరథ ప్రయత్నం. రాష్ట్రంలో కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రతి ప్రాజెక్టుకు ఒక నిర్దిష్ట గడువును విధిస్తూ ఈ క్యాలెండర్‌ను కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రకటించారు. దీనిని ప్రకటించడం ద్వారా ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న పట్టుదల ప్రదర్శించారు. ఈ క్యాలెండర్‌లో మొత్తం 25 ప్రాజెక్టులను ఆయన చేర్చారు. ఇందులో కొన్ని పనుల శంకుస్థాపనకు గడువు ఇవ్వగా, మరికొన్నింటిని జాతికి అంకితం చేసే తేదీలను ఖరారు చేశారు.
జూన్–జూలైలలో కాటన్ బ్యారేజ్ గేట్ల ఆధునికీకరణ, తుంగభద్ర కొత్త గేట్ల ఏర్పాటు పూర్తి; జూలైలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి, గుంటూరు చానల్ ఆధునికీకరణకు శంకుస్థాపన; ఆగస్టులో వెలిగొండ తొలిదశ పూర్తి, హంద్రీ నీవా, గాలేరు నగరి బ్రాంచ్ పనులకు శంకుస్థాపన; నవంబరులో నేరడి బ్యారేజ్ పనులకు శంకుస్థాపన చేయాలి. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్రభుత్వం పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యం. అదే ఏడాది జూన్‌లో వరద ముప్పు నుంచి బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులు పూర్తి; డిసెంబరులో తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, జంఝావతి రిజర్వాయర్ పనులు పూర్తి. 2028 జూన్‌లో వేదవతి ఎత్తిపోతల, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరిగేషన్ క్యాలెండర్ విజయవంతం కావాలంటే నిధుల సమీకరణతో పాటు క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ, యుద్ధ ప్రాతిపదికన పనులు సాగించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేయడంలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర వెలకట్టలేనిది. గత ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన ప్రాజెక్టుల నిర్వహణ, నిలిచిపోయిన పనులు, అస్పష్టమైన ప్రాధాన్యతల వల్ల రైతాంగం తీవ్ర నిరాశకు లోనైంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ టైం టేబుల్ కాదు, అది రాష్ట్ర సాగునీటి రంగానికి దిశానిర్దేశం చేసే ఒక శ్వేతపత్రం. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, పోలవరం పనులను గాడిలో పెట్టి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను వేగంగా పూర్తిచేయించారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన సాగునీటి వ్యవస్థకు మళ్లీ ప్రాణం పోసి, సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. గత పాలనలో సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడం వల్ల అనేక ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని గుర్తించి శాస్త్రీయమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్యాలెండర్ ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఎకరాకు సాగు నీరు, ప్రతి రైతుకు భరోసా ఇవ్వడం.
టెక్నాలజీని, అడ్మినిస్ట్రేషన్‌ను అనుసంధానం చేస్తూ సీఎం చంద్రబాబు ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చబోతోంది. రైతులు ఆకాశం వైపు చూసి పంటవేసే పరిస్థితి నుంచి, కాలువల వైపు చూసి ధీమాగా పంట వేసుకునే స్థాయికి చేరనున్నారు. ఇది నిజంగా నవ్యాంధ్రలో జల విప్లవం. మాములుగా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో, నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక రైతులు అయోమయానికి గురవుతుంటారు. క్షేత్రస్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించేలా వ్యూహరచన చేసి ఏ ప్రాజెక్టు ఏ నెలలో పూర్తిచెయ్యాలి? ఏ కాలువకు ఎప్పుడు నీరు వదలాలి? అనే అంశాలపై స్పష్టమైన ఇరిగేషన్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఈ గడువులోగా పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్లీ అన్నపూర్ణగా విరాజిల్లుతుంది.
నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News