ఐటీ నుంచి క్వాంటమ్.. చంద్రబాబు విజన్‌కు నిదర్శనం
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:03 AM
ప్రపంచ చరిత్రను తిరగేస్తే– కాలంతో పాటు అప్‌డేట్ కానివారు చరిత్రలో కలిసిపోతారని, మార్పును ముందే పసిగట్టేవారు ప్రపంచాన్ని శాసిస్తారని స్పష్టమవుతోంది. మానవ పరిణామ క్రమంలో వ్యవసాయ విప్లవం నుంచి పారిశ్రామిక విప్లవం వరకు, అక్కడి నుంచి...
ప్రపంచ చరిత్రను తిరగేస్తే– కాలంతో పాటు అప్‌డేట్ కానివారు చరిత్రలో కలిసిపోతారని, మార్పును ముందే పసిగట్టేవారు ప్రపంచాన్ని శాసిస్తారని స్పష్టమవుతోంది. మానవ పరిణామ క్రమంలో వ్యవసాయ విప్లవం నుంచి పారిశ్రామిక విప్లవం వరకు, అక్కడి నుంచి నేటి సమాచార సాంకేతిక (ఐటీ) యుగం వరకు ప్రతి కీలక దశలోనూ మార్పును ముందే గుర్తించి, అందిపుచ్చుకున్న దేశాలే ప్రపంచ యవనికపై ఆధిపత్యాన్ని సాధించాయి. సరిగ్గా నేడు ప్రపంచం మరో చారిత్రక మలుపు వద్ద నిలిచింది. ఆ సరికొత్త విప్లవం పేరే క్వాంటమ్ కంప్యూటింగ్. ప్రస్తుతం ఈ సాంకేతికతలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని హైనన్ ప్రావిన్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అమరావతిని కేంద్రంగా చేసుకొని ‘క్వాంటమ్ వ్యాలీ’ని నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్టు కాదు. అది రాబోయే శతాబ్దపు సాంకేతిక యుద్ధంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపే సాహసోపేతమైన ముందడుగు.
నాడు హైటెక్ సిటీతో ఐటీ విప్లవానికి పునాది వేసిన విజనరీ లీడర్ నేడు క్వాంటమ్ వ్యాలీతో భవిష్యత్తు ప్రపంచానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. క్వాంటమ్ అంటే రాష్ట్ర ఆధునిక సాంకేతిక ప్రగతికి ఒక డిజిటల్ సంతకం. అమరావతికి క్వాంటమ్ వ్యాలీ రావడం వెనుక ప్రధానమంత్రి మోదీ ప్రజాసంకల్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు దశాబ్దాల అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిబద్ధత, మంత్రి నారా లోకేశ్ ఆధునిక వ్యూహం దాగి ఉన్నాయి. 2025 జనవరిలో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో.. ఐబీఎం, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో లోకేశ్ జరిపిన చర్చలే ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాయి. అమరావతిని కేవలం ఐటీ హబ్‌గా కాకుండా, భవిష్యత్తు సాంకేతిక కేంద్రంగా లోకేశ్ ప్రజెంట్ చేయగా, చంద్రబాబు తన రాజకీయ చతురత, అనుభవంతో దీనికి జాతీయస్థాయి ప్రాధాన్యం కల్పించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంవో నిరంతర పర్యవేక్షణ, వివిధ శాఖలను సమన్వయం చేస్తూ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఐబీఎం వంటి సంస్థలతో ఒప్పందాల ఖరారులోనూ కీలక పాత్ర పోషించింది.
ఫలితంగా ఫిబ్రవరి 7న అమరావతి చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ క్వాంటమ్ పటంలో నిలిపే చరిత్రాత్మక ముందడుగు పడింది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ దిగ్గజాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం, దేశంలోనే మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌కు వేదిక కానున్నది. ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసుకుని, డిసెంబర్‌లో కార్యరూపంలోకి రానున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణం.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి హై–ఎండ్ ఉపాధికి ద్వారాలు తెరుస్తోంది. సంప్రదాయ ఉద్యోగాల పరిధిని దాటి సరికొత్త అవకాశాలు ఇక్కడే లభించడంతో మేధో వలసలు తగ్గి, ప్రతిభ అంతా రాష్ట్రానికే సొంతమవుతుంది. ఇప్పటికే 54 వేల మంది విద్యార్థులు క్వాంటమ్ శిక్షణలో పాల్గొనడం ఈ రంగంపై వారికున్న ఆసక్తికి నిదర్శనం కాగా, తెలుగు విద్యార్థులు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి ఆశయం ఈ పునాదితో వాస్తవరూపం దాల్చుతోంది.
క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా రాష్ట్రం అడుగులు వేయడం మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే, గన్నవరంలోని మేధా టవర్స్ అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు నిలయంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతపై ఉన్న అచంచల విశ్వాసంతో క్యూక్లారివోయెన్స్, క్యూబీట్స్, సైబ్రానెక్స్, క్వాంటమ్ ఏఐ గ్లోబల్, క్యూబిటెక్, క్వాన్ ఫ్యూయెన్స్ వంటి దాదాపు 30 అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఒక నూతన సాంకేతికత వైపు చంద్రబాబు అడుగు వేస్తే, ప్రపంచం మొత్తం అటువైపే నడుస్తుందన్న నమ్మకానికి ఈ ‘క్యూ’ కట్టిన కంపెనీలే నిదర్శనం. భవిష్యత్తు సాంకేతికతను ముందే పసిగట్టి అమరావతిని గ్లోబల్ హబ్‌గా మారుస్తున్న ఆయన ప్రతిభకు ఈ పరిణామాలు నిలువుటద్దం.
ప్రపంచం స్థాయి కంపెనీలతో పాటు యువతను ఇంతలా ఆకర్షిస్తున్న ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది గణన ప్రక్రియలోనే ఒక అసాధారణ విప్లవం. ఒక చిక్కుముడి నుంచి బయటపడటానికి సాధారణ కంప్యూటర్ ప్రతి దారినీ ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తే.. క్వాంటమ్ కంప్యూటర్ ఒకే సమయంలో అన్ని దారుల్లోనూ ప్రయాణించి, క్షణాల్లో సరైన మార్గాన్ని కనిపెడుతుంది. సాధారణ కంప్యూటర్లకు శతాబ్దాల కాలం పట్టే సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్ కంప్యూటర్లు కేవలం నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి. ఇది కేవలం వేగం పెరగడం మాత్రమే కాదు.. కొత్త మందుల తయారీ నుంచి ఇంటర్నెట్ భద్రత వరకు అసాధ్యాలను సుసాధ్యం చేసే సాంకేతిక విప్లవం. అందుకే, అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చనుంది. నాడు ఐటీతో మన తలరాత మారినట్లే, రేపు ఈ క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలపబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక రంగంలో అడుగుపెట్టడం వల్ల అంతర్జాతీయ రీసెర్చ్ ల్యాబ్స్, గ్లోబల్ టెక్ కంపెనీలు రాష్ట్రాన్ని చూసే దృక్పథం పూర్తిగా మారుతుంది.
టెక్నాలజీ పరంగానే కాకుండా, ఈ మార్పు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. అధిక విలువ కలిగిన పరిశ్రమలు, పరిశోధన ఆధారిత పెట్టుబడులు రావడం వల్ల ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల రాష్ట్రం కేవలం సేవా రంగాలకే పరిమితం కాకుండా, విజ్ఞానమే సంపదగా మారే ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు పడతాయి. ఇది కేవలం నేటి అవసరాల కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం.
చంద్రబాబు హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి శ్రీకారం చుట్టినప్పుడు వ్యక్తమైన సందేహాలను పటాపంచలు చేస్తూ, ఆ నిర్ణయం ఒక తరాన్ని ఐటీ యుగంలోకి నడిపించింది. సరిగ్గా అదే దూరదృష్టిని నేడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపంలో చూస్తున్నాం. అప్పట్లో ఐటీ విప్లవానికి తలుపులు తెరిస్తే, ఇప్పుడు అంతకంటే వేగవంతమైన క్వాంటమ్ యుగానికి రాష్ట్రం ద్వారాలు తెరుస్తోంది. కాలం ఎవరి కోసమూ ఆగదు, మనం కాలంతో పాటు పరిగెత్తాలా? కాలం మనల్ని పక్కన పెట్టాలా? అనే ప్రశ్నకు రాష్ట్రం సగర్వంగా ఇస్తున్న సమాధానమే ఈ క్వాంటమ్ వ్యాలీ.
పల్లా శ్రీనివాసరావు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News