Share News

Modern Celebrations: ఆర్భాటమే కానీ ఆత్మీయత ఏదీ

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:57 AM

నేటి భారతీయ సమాజంలో వేడుకలు క్రమంగా ఆర్భాట ప్రదర్శనలవుతున్నాయి. ఒకప్పుడు ఆత్మీయులను పిలిచి, పరిమితంగా జరుపుకున్న సంబరాలు ఇప్పుడు భారీ శబ్దం, విపరీతమైన...

Modern Celebrations: ఆర్భాటమే కానీ ఆత్మీయత ఏదీ

నేటి భారతీయ సమాజంలో వేడుకలు క్రమంగా ఆర్భాట ప్రదర్శనలవుతున్నాయి. ఒకప్పుడు ఆత్మీయులను పిలిచి, పరిమితంగా జరుపుకున్న సంబరాలు ఇప్పుడు భారీ శబ్దం, విపరీతమైన వ్యర్థాలతో ముగుస్తున్నాయి. ఇది నిజంగా ఆనంద సంస్కృతేనా? లేక పోటీ భావమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) ప్రకారం నివాస ప్రాంతాల్లో రాత్రివేళ శబ్దం 40 డెసిబెల్స్ మించకూడదు. పగలు కూడా 55 డెసిబెల్స్ దాటితే నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ మన వేడుకల్లో శబ్ద స్థాయి తరచూ 90 నుంచి 100 డెసిబెల్స్‌కు చేరుతోంది. శబ్ద కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు మరో పెద్ద సమస్యగా మారాయి. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు, నీటి సీసాలు వేడుక ముగిసే సరికి చెత్త కుప్పలుగా మారుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓతో పాటు ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నట్లుగా, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ సూక్ష్మ కణాలుగా మారి మన ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది. దీని ప్రభావం తక్షణమే కాదు, తరతరాలకు ప్రమాదకరం.

ఆహారం విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. అధికంగా మసాలాలు, ఫుడ్ కలర్స్, నూనెలతో చేసిన వంటకాలు, పరిశుభ్రత లోపించిన వంటగదులు, వేల మందికి ఒకేసారి వండే విధానం– ఇవన్నీ ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. భారీ సంఖ్యలో వండే ఆహారంలో పరిశుభ్రత పాటించకపోతే ఆహార విషపూరితమయ్యే ప్రమాదం ఎక్కువ. ఇటీవల గ్రామదేవత ఉత్సవాలలోనూ ఆర్భాటం చోటుచేసుకుంటోంది. వంట మనుషులతో వంటలు, భారీ టెంట్లు, వేల మందికి భోజనాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల జనసమ్మర్దాన్ని నియంత్రించేందుకు పోలీస్ బందోబస్తు అవసరం అవుతోంది. భక్తి, సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ హడావుడి అసలు ఆధ్యాత్మిక భావనను మసకబార్చుతోంది.


ఇప్పటికే అధిక జనాభా, పరిమిత వనరులతో సతమతమవుతున్న భారతదేశంలో ఈ అతి వేడుకలు శబ్ద, పర్యావరణ కాలుష్యాలను మరింత పెంచుతున్నాయి. సంబరాలు తప్పుకాదు కానీ, అవి సమాజానికి, ప్రకృతికి భారంగా మారడం సంస్కృతి కాదు, అవివేకం. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన సమయం ఇది. వేడుకలను చిన్నవిగా, అర్థవంతంగా, పర్యావరణహితంగా నిర్వహిద్దాం. శబ్ద పరిమితులు పాటిద్దాం. ప్లాస్టిక్‌కు తావివ్వకుండా ప్రత్యామ్నాయాలను ఎంచుకుందాం. అవసరానికి మించిన ఆహార వృథాను ఆపుదాం.

వసుంధరాదేవి (టీచర్)

ఈ వార్తలు కూడా చదవండి..

కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

For More AP News And Telugu News

Updated Date - Jan 08 , 2026 | 12:57 AM