Share News

సర్వే చెప్పిన బడ్జెట్‌ బాణీ!

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:21 AM

నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న 2026–27 వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ప్రజల ముందు ప్రధాన సమస్యలు– ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి ఇత్యాదులు గతంలో...

సర్వే చెప్పిన బడ్జెట్‌ బాణీ!

నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న 2026–27 వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ప్రజల ముందు ప్రధాన సమస్యలు– ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి ఇత్యాదులు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇవి ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో... ముఖ్యంగా 2013లో రూపాయి విలువ పతనం... ధరల పెరుగుదల ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించాయి. ఈ సమస్యల నేపథ్యంలోనే, 2014 పార్లమెంట్ ఎన్నికలలో – బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రజానీకంలో వున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకొని అధికారంలోకి రాగలిగింది. అయితే బీజేపీ పాలనలో కూడా, గత కొద్ది సంవత్సరాలుగా... ధరల పెరుగుదల ప్రజలకు అతి పెద్ద సమస్యగా మారింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ప్రభుత్వంలోని వారు చెప్పుకుంటున్నప్పటికీ – నేటికి కూడా ధరల అంశం ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. దీనికి అదనంగా... డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయి పతనం – ప్రజలను కలవరపెడుతోంది. అలాగే, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు అధికంగానే ఉండడం మరొక కీలకాంశం. డీజిల్ ధర అధికంగా ఉండడం వలన – సరుకు రవాణా చార్జీలు పెరిగిపోయి – ఫలితంగా సరుకుల ధరలు మరో 5శాతం మేరకు అదనంగా పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

గత గురువారం నాడు ఆర్థికమంత్రి నివేదించిన ఆర్థిక సర్వేలో ధరల పెరుగుదల అంశానికి సంబంధించి పెద్దగా ప్రస్తావనలూ... పరిష్కారాల సూచనలూ ఏమీ లేవు. నేటి బడ్జెట్‌లో కూడా – ఈ అంశానికి సంబంధించి – ప్రత్యేక చర్యలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత – అన్ని ప్రభుత్వాల తీరూ – తమ ఆదాయాలను పెంచుకుని, ఖర్చులను తగ్గించుకునే విధానం పరిధిలోనే ఉంటోంది. అంటే, ప్రజల మీద సాధ్యమైనంత పన్నుల భారాన్ని మోపడం... మరో ప్రక్కన ప్రజలకు ఇచ్చే రాయితీలైన – ఎరువులు, ఆహారం, ఇంధనంపై సబ్సిడీలను క్రమేణా తగ్గిస్తూ పోవడంగానే ఈ విధానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత బడ్జెట్ కూడా కచ్చితంగా దీనికి మినహాయింపుగా ఏమీ ఉండదు..!


నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోందని చెప్పనవసరం లేదు. యువజనుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఈ ప్రధాన అంశానికి సంబంధించి – ఆర్థిక సర్వేలో చెప్పుకోదగ్గ ప్రస్తావన లేదు. ఈ నిరుద్యోగ సమస్యకు ఒక కీలక కారణంగా ఉంటోన్న – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి – ఆర్థిక సర్వేలో ప్రత్యేక ప్రస్తావన ఉన్నప్పటికీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిపెట్టే నిరుద్యోగానికి సంబంధించి ఏం చేయాలో అదేమీ చెప్పలేదు. ప్రస్తుతం నడుస్తోన్న ఆర్థిక సంవత్సర కాలపు (2025–26) బడ్జెట్‌లో వున్న అనేక పథకాలు ఇప్పటికీ కాగితం మీదే మిగిలిపోయాయి.

2008 ఆర్థిక సంక్షోభ కాలంలో, మన దేశంపై ఆ ప్రభావం పడకుండా నిలువరించిన ప్రధాన అంశమైన – జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యపరుస్తోంది. కోట్లాది గ్రామీణ పేదలకు, ఉపాధి... ఆదాయ సమస్యల నుంచి ఉపశమనం కలిగించిన ఈ పథకం భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకమయింది. ఈ నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ఎలా ఉంటాయి?

ప్రజల కొనుగోలు శక్తి పతనం కావడం మరో ప్రధాన సమస్య. ప్రభుత్వాలు మాత్రం ఈ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేసే బదులు... కార్పొరేట్లకు మరింతగా రాయితీలను కల్పిస్తే... దానంతట అదే దేశంలో పెట్టుబడులు పెరిగి... ప్రజలకు ఉపాధి కల్పన జరుగుతుందనే తలకిందుల ఆలోచనలో కాలం గడుపుతున్నాయి. గత 30–35 సంవత్సరాల ఆర్థిక సంస్కరణల కాలంలో జరిగిందంతా ఇదే. బీజేపీ హయాంలో ఈ తరహా ఆలోచనలు మరింత బలంగా అమలు జరుగుతున్నాయి. ఇక, బ్యాంకులకు, కార్పొరేట్లు బకాయిపడ్డ లక్షల కోట్ల రూపాయల మొత్తాలను రైట్ ఆఫ్‌లు చేయడం వంటి అనేక కార్పొరేట్, ధనవంతుల అనుకూల విధానాలు అమలు జరుగుతున్నాయి. మరో ప్రక్కన, దేశంలోని సామాన్య జనం, మధ్యతరగతికి అందించే – సబ్సిడీలు, రాయితీలపై – రేవడి (ఉచితాలు) కల్చర్ పేరుతో చర్చలు పెట్టి – కోతలు విధిస్తున్నారు. నిజానికి, ఈ సొమ్ము కోటానుకోట్ల సామాన్య జనం చేతిలో ఉండాల్సినదే. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను కల్పించగలదు. ప్రస్తుతం ఈ డిమాండ్ కొరతే దేశ ఆర్థిక రంగంలోని అనేక సమస్యలకు కారణం.


ఒక ప్రక్కన మన ఆర్థిక వ్యవస్థ తాలూకు లక్ష్యాలు – నేడు పలు తీవ్రమైన అంతర్జాతీయ ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాయని చెబుతూనే – మరో ప్రక్కన 2026–27 ఆర్థిక సంవత్సరంలో కూడా మన వృద్ధి రేటు 6.8 – 7.2 శాతంగా ఉండగలదంటూ, ఆర్థిక సర్వే రూపకర్తలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. మన స్థూల ఆర్థిక వ్యవస్థ సూచీలన్నీ బాగానే ఉన్నాయంటూ బాకా ఊదుకోవడం. మరో ఆత్మాశ్రయ ధోరణి – అంటే, వృద్ధి రేటు బాగుండడం... ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం... బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఆరోగ్యకరంగా ఉండడం వంటివి. ఇక్కడ ఈ ఆర్థిక సర్వే – గణాంకాల బలుపు మాటున దాగి వున్న వాస్తవ బలహీనతలను విస్మరించింది.

ఈ బడ్జెట్‌లోనూ కూడా ప్రజలపై పన్నుల భారాలను తగ్గించే అవకాశం పెద్దగా ఉండదు. ప్రజలకు లభించే సబ్సిడీలు, రాయితీలపై కోతలు మాత్రం కొనసాగే అవకాశమే అధికం. ఆర్థిక సర్వేలోని ఆత్మాశ్రయ పాండిత్య ధోరణులూ... నేల వదిలి సాము చేయడం అనేవి బడ్జెట్‌లో కూడా కొనసాగవచ్చు...!

డి. పాపారావు

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 01:21 AM