Share News

ఈ తరం కాంగ్రెస్‌కు దారిదీపం

ABN , Publish Date - May 12 , 2026 | 12:28 AM

తన మేధాశక్తితో, రాజకీయ వ్యూహ చతురతతో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అరుదైన వ్యక్తి భాట్టం శ్రీరామమూర్తి. ఉమ్మడి విశాఖ జిల్లా, ఎస్. కోట సమీపంలోని ధర్మవరంలో 1926మే 12న జన్మించారు. ధర్మవరం...

ఈ తరం కాంగ్రెస్‌కు దారిదీపం

తన మేధాశక్తితో, రాజకీయ వ్యూహ చతురతతో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అరుదైన వ్యక్తి భాట్టం శ్రీరామమూర్తి. ఉమ్మడి విశాఖ జిల్లా, ఎస్. కోట సమీపంలోని ధర్మవరంలో 1926మే 12న జన్మించారు. ధర్మవరం, విజయనగరం, విశాఖపట్నంలో విద్యనభ్యసించారు.

ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన విజయనగర సంస్థానాధీశుడు పి.వి.జి రాజు అనుచరునిగా, సన్నిహితునిగా, ఆంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించారు భాట్టం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దిగ్గజం కాసు బ్రహ్మానందరెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడైన అనుచరునిగా, రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా అనతికాలంలోనే పట్టు సాధించారు. స్వాతంత్య్రానంతరం పి.వి.జి.రాజు సారథ్యంలో సోషలిస్టు పార్టీలోను, అనంతరం ప్రజా సోషలిస్టు పార్టీలోను పి.వి.జి వెంట నిలిచారు. విజయనగరం శాసనసభ్యునిగా రెండుసార్లు (1955, 1962) ఎన్నికయ్యారు. పి.వి.జితో విభేదాల కారణంగా విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి 1967 ఎన్నికల్లో జనసంఘ్ నేత ఒబ్బిలిశెట్టి రామారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 1972 శాసనసభ ఎన్నికల్లో విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాలలో 1972 నుంచి 1978 వరకు విద్య, సాంస్కృతిక, సాంఘిక, సంక్షేమ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 1969, 1972లలో తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలలో సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారు.

1978లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలోనే వుండిపోయారు. 1978 ఎన్నికల్లో తిరిగి రెండోసారి (రెడ్డి కాంగ్రెస్) పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. 1978 నుంచి 1980 జూన్ వరకు రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ (అర్స్) పక్షాన ప్రతిపక్షనేతగా సమర్ధవంతమైన పాత్ర నిర్వహించారు. 1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ (అర్స్) పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. దాంతో సన్నిహితుల సూచన మేరకు కాంగ్రెస్(ఐ)లో చేరారు. 1980 అక్టోబరులో టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వాలలోనూ మంత్రిగా కొనసాగారు. 1981లో మలేసియాలో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, నాటి సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించారు.


నాదెండ్ల ఉదంతంలో కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ పరిణామాలతో తెలుగుదేశం నాయకత్వానికి దగ్గరయ్యారు. దాని ఫలితంగా 1984 డిసెంబరులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు సంజీవరావుపై గెలిచారు. 1984 నుంచి 1989 జూన్ వరకు లోక్‌సభ సభ్యునిగా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నిర్మాణాత్మక కార్యక్రమాల నెన్నింటినో చేపట్టారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు భూనిర్వాసితులకు నష్టపరిహారం రెండో విడత చెల్లింపునకు చిత్తశుద్ధితో కృషిచేసి, నాటి ప్రధాని రాజీవ్‌గాంధీని ఒప్పించారు. ఆయన సమక్షంలోనే ఆ చెల్లింపులు అందజేయించిన ప్రజాహితైషి భాట్టం. 1989 జమిలి ఎన్నికల్లో విశాఖ–1 శాసనసభ స్థానం నుంచి పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి ఈటి విజయలక్ష్మి చేతిలో అనూహ్య ఓటమిపాలై క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికారు. శేషజీవితాన్ని సత్యసాయిబాబా సేవలో గడిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికా రచయిత మద్దూరి అన్నపూర్ణయ్య శిష్యునిగా పత్రికా రంగంలో పనిచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎందరో ద్వితీయశ్రేణి నాయకులను తయారుచేశారు. మంచి వక్త అయిన భాట్టం, బహిరంగ సభలలో కానీ, అంతర్గత సమావేశాలలో కానీ అద్భుతంగా ప్రసంగించేవారు. ప్రజాప్రతినిధిగా, రాజకీయనేతగా, వ్యూహకర్తగా, వక్తగా రాణించి వేలాదిమందిని తన అభిమానులు, విధేయులుగా మలచుకున్న సుదీర్ఘ రాజకీయ బాటసారి. తొమ్మిది దశాబ్దాల ఆయన జీవన ప్రస్థానం 2015 జూలై 6న ముగిసింది.

బి.వి. అప్పారావు

(నేడు భాట్టం శ్రీరామమూర్తి శతజయంతి)

ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 12:28 AM