1950ల్లోనే ‘బెజవాడ’కు గ్రహణం!
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:18 AM
అక్టోబర్ 10న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో టి.కొండబాబు రాసిన ‘15 శతాబ్దాల విజయవాడ ప్రయాణం!’, అలాగే ‘బెజవాడలో దసరా జోష్!’ అనే వార్తా కథనం ఒకే రోజు వెలువడ్డాయి. పాఠకులు ఎలాంటి సందేహం...
అక్టోబర్ 10న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో టి.కొండబాబు రాసిన ‘15 శతాబ్దాల విజయవాడ ప్రయాణం!’, అలాగే ‘బెజవాడలో దసరా జోష్!’ అనే వార్తా కథనం ఒకే రోజు వెలువడ్డాయి. పాఠకులు ఎలాంటి సందేహం లేకుండా స్వీకరిస్తారని అంచనా ఉంటేనే ‘బెజవాడ’ను వార్తా కథనంలో పత్రికల వారు వినియోగిస్తారు. అయితే బెజవాడ అధికారికంగా విజయవాడగా ఎప్పుడు మారిందో కొండబాబు తన వ్యాసంలో పేర్కొనలేదు.
ఇంకొక అతి ముఖ్యమైన తెలుగువారి సాంస్కృతిక జీవనంతో ముడిపడిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదు. ‘బెజవాడ’ ఇంటిపేరు గలిగిన తెలుగువారు అనేక కులాల్లో కనిపిస్తారు. అందులో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సాహితీవేత్త, ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బెజవాడ గోపాలరెడ్డి, ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ ద్వారా నేటికీ పారిశుద్ధ్య కార్మికుల జీవన మెరుగుదల కోసం భారతదేశ స్థాయిలో కృషి చేస్తూ ‘రామన్ మెగసెసే’ అవార్డు పొందిన కోలార్ ప్రాంతవాసి బెజవాడ విల్సన్, పుదుచ్చేరి రాష్ట్రం యానాం తొలి మేయర్ బెజవాడ బాపానాయుడు... ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా చాలా కులాలలో (దళితుల నుంచి అగ్రకులాల దాకా) బెజవాడ ఇంటిపేరు కలిగినవారు లభిస్తారు. కానీ విజయవాడ ఇంటిపేరు ఉన్న ఏ ఒక్కరైనా ఉన్నారా?
రైల్వే స్టేషన్లకు ఆ శాఖ వారి కోడ్ ఉంటుంది. మనం విజయవాడ నుంచి గాని లేక విజయవాడ వరకు గానీ రైల్ టికెట్ కొంటే అందులో నేటికీ నమోదయ్యే కోడ్ BZA. విజయవాడలో రిజిస్టర్ అయిన ఉన్న బార్ అసోసియేషన్ ‘బెజవాడ బార్ అసోసియేషన్’. అలాగే బెజవాడ మెడికల్ అసోసియేషన్. కూచిపూడి కళాకారులు తమ ప్రదర్శన ప్రారంభంలో ఆలపించే అంబాపరాకులో ఉన్నది బెజవాడ కనకదుర్గే!
గ్రామదేవతలు అనే అంశంపై 30 ఏళ్లనాడు దివి తాలూకా పెదప్రోలు గ్రామంలో ప్రొఫెసర్ యార్లగడ్డ గంగాధరరావు నిర్వహణలో నాగార్జున విశ్వవిద్యాలయం వారు మూడు రోజులపాటు సెమినార్ నిర్వహించారు. ప్రత్యేకమైన ఇంటి పేర్లతో గల గ్రామదేవతలు మనకు ఉన్నారు (ఉదాహరణకి విశ్వనాథపల్లి గ్రామంలో ఉండే అద్దంకి నాంచారమ్మ). అబుల్ హసన్ తానీషా కాలం నాటిది కనుక ఉయ్యూరులో పూజలందుకునే వీరమ్మకు పుట్టింటి పేరు, అత్తింటి పేరు కూడా ఉన్నాయి. గ్రామదేవతల పేరిట భూములు ఉంటే అవి వారి పేరుతోనే ఉంటాయి.
కొండబాబు వ్యాసంలో దాన పత్రాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మల్లేశ్వరస్వామి పేరు మాత్రమే ఉటంకించారు. ఇప్పటికీ దేవాదాయ ధర్మాదాయశాఖ వారి పత్రాలలో మల్లేశ్వర ప్రస్తావన ఉంటుంది కానీ కనకదుర్గ పేరుతో భూములు, దాన పత్రాలు ఉండినట్లు వారు కూడా పేర్కొలేదు. జనాంతికంగా ప్రజలలో ప్రాచుర్యంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం మొగల్రాజపురం కొండల పైన ఉన్న కనకదుర్గమ్మనే కాలక్రమంలో ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠించారు. మొగల్రాజపురం కొండపై ఉన్న ధనకొండ దుర్గాదేవి... బెజవాడకు అసలైన గ్రామ దేవత. పరిశోధిస్తే ఆ గ్రామదేవత పేరిట భూములు కూడా ఉండవచ్చు.
1864లో బందరు పట్టణం పైకి సముద్రం విరుచుకుపడింది. దాంతో ఆ పట్టణంలో ఆనాటికి బెజవాడలో ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఒకప్పుడు బెజవాడ ఎక్కడ అంటే కొండపల్లి పక్కన అని చెప్పుకునే వారన్నట్లు ఎక్కడో చదివాను. 150 సంవత్సరాల క్రితం నేటి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట కంటే బెజవాడ జనాభా తక్కువ. విజయవాడను తక్కువ చేద్దామని రాసే మాటలు కావివి.
బ్రిటిష్ వారి హయాంలో ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడిన తరువాత విజయవాడ రైలు, రోడ్ల కూడలిగా.. వ్యాపార రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. అలాగే స్వాతంత్ర్యోద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రముఖ రాజకీయ కేంద్రంగా, పుస్తక ప్రచురణలకు, సినిమా పంపిణీలకు ముఖ్య కేంద్రంగా వృద్ధి చెందిన తరువాతే దాని పెరుగుదల బాగా వేగవంతమైంది. అంతకుముందు వరకు అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం గుంటూరు వెళ్లేవారు. బందరు, గుంటూరు విద్యా కేంద్రాలుగా, తెనాలి సాంస్కృతిక కేంద్రంగా ఒకనాడు ఉండేవి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా ఏర్పడే దాకా విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. అయితే మొత్తం భారతదేశంలో ఒక తాలూకా స్థాయి మాత్రమే కలిగిన మొదటి మునిసిపల్ కార్పొరేషన్ విజయవాడేనని చెబుతారు.
బ్రిటిష్ వారి హయాంలో రాజమహేంద్రవరం రాజమండ్రిగా మారింది. దానిని ఇటీవల తిరిగి రాజమహేంద్రవరంగా అధికారికంగా మార్పు చేశారు. బెజవాడ పేరును మొగలాయిలు కానీ, బ్రిటీష్ వారు కానీ మార్పు చేయలేదు. 1950ల ఆరంభంలో ఆ మార్పు జరిగింది. అర్జునుడు ఆ కొండపై తపస్సు చేశాడనే పౌరాణిక ఐతిహ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించేవారు. రాజమండ్రిని రాజమహేంద్రవరం చేసినట్లు విజయవాడను బెజవాడగా మార్చమనటం తప్పవుతుందా? ఎంత మాత్రం కాదు.
మనకు మొగలాయిల మీద, బ్రిటిష్ వారి మీద సృష్టించగలిగిన భావోద్వేగాలు మన స్వతంత్ర పరిపాలకుల మీద లేవనెత్తటం అంత సులువు కాదు. అందునా మన రాజకీయ నాయకులకు, కొందరు రచయితలకు వాలీత ఎక్కువ అలవాటు కదా!
చెరుకూరి జ్యోతి
ఇవి కూడా చదవండి..
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Read Latest AP News And Telugu News