Are Royalty Cheques a Sign of Transparency: చెక్కుల ప్రదర్శన వెనుక లెక్కలు సరిగా ఉన్నాయా
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:24 AM
ఇటీవలి కాలంలో భారతీయ ప్రాంతీయ సాహిత్య వేడుకల వేదికలపై ఒక ఆసక్తికర సన్నివేశం కనబడుతోంది. ప్రచురణకర్త వేదిక మీద తన రచయిత చేతికి రాయల్టీ చెక్కు అందజేయడం. గతంలో..
ఇటీవలి కాలంలో భారతీయ ప్రాంతీయ సాహిత్య వేడుకల వేదికలపై ఒక ఆసక్తికర సన్నివేశం కనబడుతోంది. ప్రచురణకర్త వేదిక మీద తన రచయిత చేతికి రాయల్టీ చెక్కు అందజేయడం. గతంలో రచయిత తనకు రావాల్సింది అడిగినప్పుడు ప్రచురణకర్త తన సిగరెట్ పాకెట్‌లో నుంచి ఒక సిగరెట్టు ఇచ్చి పంపడమో, రచయిత మరీ పట్టుబడితే తన దైనందిన సాయంకాలపు కార్యక్రమంలో అతనిని అతిథిగా ఆహ్వానించి ఒక స్మాలో లార్జో ఇచ్చి పంపడమో జరిగిన సందర్భాలున్నాయి! రాయల్టీ గురించి మాట్లాడితే చికాకు, ‘‘సాహిత్యాన్ని డబ్బుతో తూకం వేస్తావా?’’ అన్న నైతిక బోధ. ఐతే ప్రస్తుతం వేదిక మీద చెక్కులు అందజేసే ట్రెండ్‌తోనూ కొంత ఇబ్బంది ఉంది. ఈ ట్రెండ్‌ను చూసి, ‘‘ఇంతకాలం రచయితలను గౌరవించని ప్రచురణకర్తలు, ఇప్పుడు మారుతున్నారు’’ అని చాలామంది అంటున్నారు. కానీ ఈ వాక్యంలో సగం నిజం ఉంది. మిగిలిన ‘అర్థ’ని ప్రశ్నించాల్సిన తరుణం ఇది!
ఆ మధ్య హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు ఆయన ప్రచురణకర్త రాయ్‌పూర్‌లో ఒక సభ నిర్వహించి రూ.30లక్షల రాయల్టీ చెక్కు అందజేశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ది ప్రింట్, ది టెలిగ్రాఫ్ వంటి పత్రికలు దీనిని ‘పబ్లిషింగ్‌లో నిజాయితీకి నిదర్శనం’గా చూశాయి. ప్రచురణకర్తలు కూడా స్పష్టంగా చెప్పారు: ‘‘మమ్మల్ని ఎవ్వరూ నమ్మలేదు. కాబట్టి వేదిక మీద చూపించాం’’ అని. ఇక్కడే అసలు సమస్య ఉంది. నమ్మకం రావాలంటే చెక్కు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకాలం లెక్కలు చూపించకుండా నడిపిన వ్యవస్థలో ఇది నిజంగా మార్పా? లేక నమ్మకాన్ని కొనే కొత్త పద్ధతా?
రాయల్టీ అనేది రంగస్థల ప్రదర్శన కాదు. అది ఒక వ్యవస్థ. స్పష్టమైన ఒప్పందాలు, అర్థమయ్యే స్టేట్మెంట్లు, ప్రశ్నించే హక్కు– ఇవే రాయల్టీ నైతికతలు. వేదిక మీద రచయిత చేతిలో మెరిసే బ్యాంక్ చెక్ ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాలేదు. అది ఎక్కువలో ఎక్కువ ఒక సంకేతం మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే: రాయల్టీ చెక్కు చూపించడం పారదర్శకత కాదు. అది పారదర్శకతను నటించడం అనుకోవచ్చు! ఎందుకంటే ఆ చెక్కు వెనుక లెక్కలు ఎవరికీ కనిపించవు గనుక. అదే ప్రచురణ సంస్థలో మిగిలిన రచయితలతోపాటు ఎవరికీ ఏమి జరుగుతుందో తెలియదు. ఒకరి చేతిలో చెక్కు కనిపిస్తున్నప్పుడు వందమంది చేతులు ఖాళీగా ఉన్న నిజం మరుగున పడుతుంది. ఇక్కడ గౌరవాన్ని మార్కెట్ విలువతో కొలుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భారీ అమ్మకాలు సాధించినవారికే వేదిక, వెలుగు. మిగిలినవారికి నిశబ్ద ఘోష! ఇది పాత అన్యాయానికి కొత్త అలంకారం కాదూ?
రచయిత చేతిలో మెరిసే చెక్కు నిజానికి దేన్ని సూచిస్తోంది– గౌరవాన్నా? లేక వ్యవస్థలోని అసమానతనా? ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతల తరువాత రచయిత ఆ అమ్మకాల ఫలితాలను అందుకుంటున్నాడన్నది నిజం కాదా? రచయితల పట్ల గౌరవం మాటలకు మాత్రమే పరిమితం, ఆర్థికంగా ఏమీ ఉండదు.
పురస్కారాలు, సాహిత్యోత్సవాలు, ప్రజాస్థాయిలో రచయితలకు గుర్తింపు, ప్రశంసలు వుంటే ఉన్నాయి గానీ అవి ఆ రచయిత జీవన విధానాన్ని కాని గతిని కాని మార్చడం లేదు. ఇక్కడ మరో ప్రమాదం– సాహిత్యం నెమ్మదిగా ‘‘సక్సెస్ స్టోరీ’’లతో కొలవబడే రంగంగా మారడం. సాహిత్యం సమాజాన్ని ఒక్క రోజులో మార్చదు. నిజమే. కానీ సమాజం అంచున ఉన్న గొంతులు తమ ఆక్రందనలను, ఆకాంక్షలను గొంతెత్తి నినదిస్తాయి. అవి సాహిత్యంలోనే నిలుస్తాయి. వేగానికి అలవాటుపడిన సంస్కృతిలో సాహిత్యం ఆలోచనని రేకెత్తిస్తుంది. పంచుకున్న భావం సామాజికమవుతుంది. పురోగతికి బాటలు వేస్తుంది. మరి అమ్మకాలే గౌరవానికి ప్రమాణమైతే, కాలానికి ఎదురొడ్డి నిలిచే రచనలు ఎక్కడ నిలుస్తాయి?
యూరప్, అమెరికా లాంటి దేశాల్లో రాయల్టీలు బహిరంగంగా ప్రకటించరు. అక్కడ రచయితకి ఇచ్చే గౌరవం ఒక ప్రదర్శన కాదు. అది ఒక ప్రక్రియ. రచయితకు సక్రమ సమాచారం ఇవ్వడం, లెక్కలు స్పష్టంగా ఉంచడం– ఇవే అక్కడ మార్పుకు కేంద్రబిందువు. చెక్కు చేతిలో కనిపించకపోయినా, వ్యవస్థలో రచయితకు గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వేదిక మీద మెరిసే రాయల్టీ చెక్కు, నిజానికి, మార్పు కాదు; మార్పు మొదలవుతున్నట్టు కనిపించే దృశ్యం మాత్రమే. నమ్మకం వ్యవస్థల ద్వారా నిర్మించబడుతుంది, కెమెరాల ముందు కాదు. పారదర్శకత అనేది చూపించేది కాదు, పాటించేది. ఒక రచయిత చేతిలో చెక్కు కనిపించడం కంటే, వందలమంది రచయితలకు లెక్కలు అర్థమయ్యేలా రావడం ఎక్కువ విలువైనది. వేదిక మీద చెక్కులు అందజేయడాన్ని ఖండించనక్కర్లేదు. కానీ వాటిని గౌరవానికి పరాకాష్ఠగా చూపించాల్సిన అవసరమూ లేదు.
అట్లూరి అనిల్
81426 42638
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News