దళిత పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:34 AM
రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సుమారు రూ.700 కోట్ల సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే చాలా చిన్నది. కానీ ఈ మొత్తాన్ని...
రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సుమారు రూ.700 కోట్ల సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే చాలా చిన్నది. కానీ ఈ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల వేలాది కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దళిత పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై నమ్మకంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. బంగారం తాకట్టు పెట్టారు. వ్యక్తిగత ఆస్తులు అమ్మి పరిశ్రమలు ప్రారంభించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన సబ్సిడీలు సమయానికి వస్తాయని విశ్వసించారు. కానీ ఆ నమ్మకాన్నే ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది.
పరిశ్రమల శాఖ, ఎంఎస్‌ఎంఈ శాఖ, ఏపీఐఐసీ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం లేదు. మంగళగిరిలో ధర్నాలు, నిరసనలు జరిగాయి. మహిళా పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యాయత్నాలు కూడా చేశారు. ఇటీవల రెండు వారాలకు పైగా నిరాహారదీక్షలు కొనసాగినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు కూడా స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతోంది. మరోవైపు ఇప్పటికే పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పిస్తున్న దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన చట్టబద్ధమైన ప్రోత్సాహకాలను నిలిపివేయడం తీవ్రమైన వైరుధ్యం. కొత్త పెట్టుబడిదారులను ఆహ్వానించే ముందు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత.
ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సబ్సిడీల చెల్లింపులకు నిర్దిష్ట కాలపట్టిక ప్రకటించాలి. దళిత పారిశ్రామికవేత్తలతో చర్చించి శాశ్వత పరిష్కారాన్ని రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వాటి అసలు ఉద్దేశానికి అనుగుణంగా వినియోగించాలి. దళిత పారిశ్రామికవేత్తలను కాపాడటం అంటే వేలాది కుటుంబాలను, పరిశ్రమలను, ఉపాధిని కాపాడటం. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే బలహీనవర్గాల హక్కులను పరిరక్షించడం. ప్రభుత్వం ఈ బాధ్యతను విస్మరించరాదు.
అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్
లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్
For More TG News And Telugu News