‘విద్యుత్ విప్లవంతో’ రాష్ట్రం బలోపేతం
ABN , Publish Date - May 06 , 2026 | 03:03 AM
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చంద్రబాబు ‘ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం’(పీపీపీ)తో పెట్టుబడులను ఆహ్వానించారు. థర్మల్–హైడల్ కొత్త...
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చంద్రబాబు ‘ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం’(పీపీపీ)తో పెట్టుబడులను ఆహ్వానించారు. థర్మల్–హైడల్ కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు, ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పవర్ సర్‌ప్లస్ దిశగా అడుగులు పడ్డాయి. సౌర, పవన, విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటికి పునాదులు వేశారు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)ను గణనీయంగా పెంచేలా చేశారు. కాకినాడ వద్ద ‘స్పెక్ట్రమ్’, ‘జీవీకే’ వంటి ప్రాజెక్టులు ఆయన హయాంలోనే పట్టాలెక్కాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పవర్ హౌస్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా పీక్ డిమాండ్ సమయంలో తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించే ప్రయత్నం చేశారు. విద్యుత్ సరఫరాలో జరిగే లైన్‌లాస్‌లను తగ్గించడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. వంద శాతం మీటరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టారు. దూరదృష్టితో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి లక్షలాది ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాది సబ్‌స్టేషన్ల నిర్మాణం చేశారు. విద్యుత్ లైన్లను బలోపేతం చేశారు.
గృహ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడినంత విద్యుత్‌ను అందజేయడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆయన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టాయి. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ప్రారంభించాయి. ఈ సంస్కరణలు కేవలం ఒక్క విద్యుత్ శాఖలో మార్పులు మాత్రమే కాదు, అవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయి. క్రిసిల్–ఇక్రాల గుర్తింపు ద్వారా ఏపీ ట్రాన్స్‌కోను దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిసిటీ బోర్డుగా నిలిపారు చంద్రబాబు.
ఉమ్మడి రాష్ట్రంలో సబ్‌స్టేషన్ల సంఖ్యను 1,539 నుంచి 2,390కు పెంచి నాణ్యమైన విద్యుత్‌ను అందించారు. అలాగే 19 లక్షల విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించి 66.90 లక్షల కొత్త కనెక్షన్‌లతో మొత్తం 1.51 కోట్ల వినియోగదారులతో దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. వ్యవసాయ రంగానికి 37.04 శాతం విద్యుత్‌ను అందించారు. సౌర, పవన, విద్యుత్ ఉత్పత్తి రంగంలో కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, అతి తక్కువ సమయంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును అధిగమించి 24 గంటలూ నిరంతర విద్యుత్ అందించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. నవ్యాంధ్రలో ఐదేళ్ళు పేద, మధ్య తరగతి వారిపై భారం పడకూడదని విద్యుత్ చార్జీలు పెంచకుండా పేదల పక్షపాతిగా నిలిచారు.
దేశంలో అయిదేళ్లలో 2014–19 మధ్య 14,655 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పారు. ఈ కాలంలో ఏడువేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. జగన్ తన బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు పీపీఏ ఒప్పందాలు రద్దు చేసి యూనిట్ విద్యుత్ ధర గరిష్ఠంగా రూ.15లకు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గత ఏడాది యూనిట్ విద్యుత్ ధర రూ.5.20లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు రూ.4.90లకు కొనుగోలు చేస్తోంది. 2029 నాటికి యూనిట్ విద్యుత్ రూ.1.19లకే కొనుగోలు చేసేలా లక్ష్యం పెట్టుకుంది. సౌర, పవన విద్యుత్ రంగంలో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 160 మె.వా వాయుశక్తి ఆధారిత హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేశారు. దేశంలో అత్యధికంగా నవ్యాంధ్రలో 2014–19 మధ్య 36లక్షల మోటార్లకు కొత్త కనెక్షన్లు ఇచ్చేలా చేశారు.
కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన విద్యుత్ వైపు మొగ్గు చూపడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం. ఏపీని సోలార్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఆసియాలోనే అతి పెద్దదైన కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్‌లో వెయ్యి మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను స్థాపించారు. పవన విద్యుత్ ఉత్పత్తికి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పెద్ద ఎత్తున విండ్ మిల్స్ ఏర్పాటును ప్రోత్సహించారు. పునరుత్పాదక ఇంధన విప్లవం, పారిశ్రామిక రంగానికి చౌకధరకే విద్యుత్తును అందించడమే లక్ష్యంగా, అపారమైన సూర్యరశ్మి, తీరప్రాంత గాలిని సంపదగా మార్చేందుకు గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024కు శ్రీకారం చుట్టారు. కేవలం విద్యుత్ భారాన్ని తగ్గించడమే కాకుండా, లక్షలాది యువతకు ఉపాధి కల్పించేందుకు ఐదు ప్రధాన విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రీన్ ఎనర్జీ–సోలార్ విండ్–గ్రీన్ హైడ్రోజన్–గ్రీన్ అమ్మోనియా–పంప్డ్ స్టోరేజీ రంగాలలో రూ.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు తీసుకొచ్చారు. చంద్రబాబు లక్ష్యం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ కేవలం విద్యుత్ వినియోగదారుగానే కాకుండా, దేశానికే ఇంధనాన్ని సరఫరా చేసే పవర్ హౌస్‌గా మారబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ చేపట్టిన ఈ ప్రణాళిక రాష్ట్ర రూపురేఖలను మార్చడమే కాకుండా, గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచపటంలో నిలుపుతుంది. సోలార్, విండ్ ఎనర్జీ, భవిష్యత్తు ఇంధనంగా పిలవబడే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడం కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలపై, పరిశ్రమలపై విద్యుత్ చార్జీల భారం తగ్గుతుంది.
సంస్కరణలతో పాటు చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ అమలు చేసి, ప్రజలపై కరెంట్ బిల్లుల భారం తగ్గించారు. ప్రజలపై పడిన రూ.20,288 కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరించి 1.30 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చింది. వాణిజ్య కేటగిరీ వినియోగదారులకు యూనిట్ విద్యుత్ ధరను రూ.12.25 నుంచి రూ.9.95కు తగ్గించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు రూ.1,200 కోట్లతో ఉచితంగా 2కేవీ రూఫ్‌టాప్ సోలార్లు ఏర్పాటుచేసి పేదల పక్షపాతిగా నిలిచారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించారు. చంద్రబాబు తెచ్చిన విద్యుత్ సంస్కరణల విప్లవం వల్ల రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి, సరఫరా స్థిరపడింది. పరిశ్రమలకు నమ్మకమైన విద్యుత్ అందుబాటులోకి రావడంతో పెట్టుబడులు పెరిగాయి. వ్యవసాయం, సేవా రంగాలు లాభపడ్డాయి. మొత్తంగా విద్యుత్ రంగం సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా, అభివృద్ధికి పునాది వేసింది. విద్యుత్ సంక్షోభాన్ని అవకాశంగా మలచి, వ్యవస్థను పునర్నిర్మించిన నాయకుడిగా చంద్రబాబు నిలిచారు.
తొండపు దశరథ జనార్దన్
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు
ఈ వార్తలు కూడా చదవండి..
పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్
For More AP News And Telugu News