Share News

చంద్రబాబు ‘మెట్రో కల’కు కేంద్రం బ్రేకులు!

ABN , Publish Date - Jun 11 , 2026 | 01:52 AM

రాష్ట్రాన్ని విడదీసిన తరువాత విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ఉనికిలోకి తీసుకువస్తే ఈ రెండు నగరాల రూపురేఖలూ మారిపోతాయని కొత్త ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

చంద్రబాబు ‘మెట్రో కల’కు కేంద్రం బ్రేకులు!

రాష్ట్రాన్ని విడదీసిన తరువాత విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ఉనికిలోకి తీసుకువస్తే ఈ రెండు నగరాల రూపురేఖలూ మారిపోతాయని కొత్త ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లోనే కలలుగన్నారు. ఇందుకోసం 2015లోనే మెట్రో రైల్ కార్పొరేషన్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ‘మెట్రో కల’ సాకారం చేయగల సమర్థుడైన అధికారి కోసం వెతికి, ఉమ్మడి రాష్ట్రంలో స్పెషల్ సెక్రటరీగా పని చేసి పదవీ విరమణ చేసిన ఎన్‌.పి.రామకృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్ట్‌ పనిని అప్పగించారు. రాష్ట్రంలోని మైనర్ పోర్ట్‌లు అన్నింటినీ ఆధునికీకరించి, గుజరాత్ ఓడరేవుల తరువాత ఆంధ్రప్రదేశ్ ఓడరేవులను దేశంలోనే రెండో స్థానంలో నిలబెట్టడంలో రామకృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించారు. దీన్ని గుర్తించే చంద్రబాబు మెట్రో రైల్ ప్రాజెక్ట్ బాధ్యతలను రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఇది 2015 నాటి ముచ్చట. ఇప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రి గానీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా కాగితాల్లోనే ఉంది. ఆ కాగితాలు కేంద్ర అనుమతుల కోసం ఎదురు చూస్తూ ఏడాదిన్నరగా ఢిల్లీలోనే ఉన్నాయి.

2019–24 మధ్య వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్ట్ కూడా రాష్ట్రంలో చంద్రబాబు ప్రారంభించిన అమరావతి, తదితర ప్రాజెక్టుల్లాగానే మూలపడిపోయింది. దాని దుస్థితి చూడలేక రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే, రామకృష్ణారెడ్డిని వెదికి పట్టుకొచ్చి మెట్రో రైలును సాకారం చేసే పని మళ్లీ అప్పగించారు.

దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో ప్రజా రవాణా వసతులను మెరుగుపరచడానికి ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులను కేంద్రం ఉనికిలోకి తీసుకువచ్చింది. వీటివల్ల, ఆయా నగరాల్లో మొబిలిటీ పెరిగి, ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. జీడీపీ బాగా పెరుగుతుంది. వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయి.


ఆయా నగరాల జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్) ఒక ఏడాదిలో ఎంత అన్నదాన్ని బట్టి మెట్రో రైల్ ప్రాజెక్ట్ మంజూరు చేయాలో వద్దో కేంద్రానికి ఒక అవగాహన ఏర్పడుతుంది. మన దేశంలో జీడీపీ ఆధారంగా సుమారు 50 నగరాలను ఎంపిక చేశారు. ఈ 50 నగరాల మొత్తం జీడీపీ కలిపితే భారతదేశ జీడీపీలో నలభై శాతం ఉంటుంది. దేశంలో అత్యధిక జీడీపీ అందిస్తున్న జనావాసాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాతి స్థానంలో ముంబై ఉంది. ఆ వరుసలో విశాఖపట్నం పదకొండవ స్థానంలో ఉంది. విశాఖపట్నానికి పైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్, కోయంబత్తూర్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. విశేషం ఏమిటంటే, విశాఖపట్నం కంటే చాలా తక్కువ జీడీపీ ఉన్న నగరాలకు కూడా కేంద్రం మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లను మంజూరు చేసింది. ఉదాహరణకు– నాగపూర్ (మహారాష్ట్ర), జైపూర్ (రాజస్థాన్), కొచ్చి (కేరళ) నగరాలకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. విశాఖపట్నం జీడీపీ రూ.1.74లక్షల కోట్లు ఐతే, నాగపూర్ జీడీపీ రూ.లక్ష కోట్లు, జైపూర్ జీడీపీ రూ.1.49లక్షల కోట్లు, కొచ్చి జీడీపీ 1.3 లక్షల కోట్లు. ఈ నగరాల జీడీపీ విశాఖ కంటే దిగువన ఉన్నప్పటికీ కేంద్రం వీటికి మెట్రో మంజూరు చేసింది. నాగపూర్‌, జైపూర్‌ నగరాలు బీజేపీ పాలనలో ఉండటం ఇక్కడ గమనార్హం.

ఇక అమరావతి విషయానికి వస్తే– దేశంలోని మొదటి 50 నగరాలలో జీడీపీ పరంగా అమరావతి–విజయవాడ రాజధాని ప్రాంతం 16వ స్థానంలో ఉంది. దీనికి మెట్రో రైల్ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టిన కేంద్రం, జీడీపీలో అమరావతి కంటే దిగువన పాట్నా (బిహార్), లక్నో (ఉత్తరప్రదేశ్‌), ఇండోర్ (మధ్యప్రదేశ్‌) నగరాలకు మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లను మంజూరు చేసింది. ఇవి కూడా బీజేపీ పాలిత ప్రాంతాలే. మరి, ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రమే కదా!


ఏపీ మెట్రో రైల్‌కు సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఢిల్లీలో 18 నెలలుగా పెండింగ్‌లో ఉంది. ఎందుకు ఉన్నదో తెలియదు. కొర్రీలు కూడా ఏమీ వేయలేదు. మామూలుగా ఒక మెట్రో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగిన నాటి నుంచి మొదటి దశ పూర్తయింది అనిపించుకోవడానికి ఏడు నుంచి తొమ్మిదేళ్లు పడుతుంది. మెట్రో రైల్వే కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి మూడున్నరేళ్లలోనే మెట్రో మొదటి దశను ఏపీ ప్రజల వినియోగంలోకి తీసుకురాగలమన్న ధీమాలో ఉన్నారు. మరి ఇక తన కలల ప్రాజెక్ట్ అయిన ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టును సాకారం చేయడానికి చంద్రబాబు నాయుడే స్వయంగా పూనుకోవాలి. 1999–2004 మధ్య కేంద్రంలో వాజపేయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి ఉన్న పలుకుబడి కంటే ఇప్పుడు ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉన్నది. ప్రధానిని నేరుగా కలవగలుగుతున్నారు. ఫలితంగానే అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయి. మెట్రో రైల్‌ ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి పలుకుబడే ఇప్పుడు ఎంతో కీలకం.

భోగాది వేంకటరాయుడు

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 01:52 AM