Share News

ప్రభుత్వ బడికి అరుదైన సన్మానం

ABN , Publish Date - May 08 , 2026 | 12:29 AM

తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక అరుదైన, విశిష్టమైన కీలక నిర్ణయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలో...

ప్రభుత్వ బడికి అరుదైన సన్మానం

తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక అరుదైన, విశిష్టమైన కీలక నిర్ణయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలో ఆహ్వానించదగ్గ పరిణామం. సాధారణంగా పదో తరగతి ఫలితాలు రాగానే పత్రికల మొదటి పేజీలు కార్పొరేట్ విద్యాసంస్థల అట్టహాసపు ప్రకటనలతో నిండిపోయేవి. అయితే, ఆ అనుభవానికి విరుద్ధంగా ఈసారి ఓ కొత్త దృశ్యం కనిపించింది. అగ్రశ్రేణి దినపత్రికల మొదటి పేజీలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల చిరునవ్వులు, వారు సాధించిన అసాధారణ మార్కులు మెరిశాయి. దీనిని కేవలం ఒక పత్రికా ప్రకటనగా చూడకూడదు; ఇది ప్రభుత్వ బడి ఒడిలో సామాన్యుడి చదువు సాధించిన ఘనవిజయం. ప్రభుత్వ బడుల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలను పటాపంచలు చేసిన వాస్తవం.

ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం పేదరికం, వసతుల లేమికి నిలయమనే భావన క్రమక్రమంగా మారుతోంది. మౌలిక సదుపాయాలతో పాటు విద్యా నాణ్యతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. 600కు 596, 595 మార్కులు సాధించిన విద్యార్థినుల చిరునవ్వుల ఫోటోలను పత్రికా ప్రకటనల్లో చూస్తుంటే, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోవనే వాస్తవం వెలుగు చూస్తుంది. 590 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ బడుల్లో పెరుగుతుండటం, నాణ్యమైన విద్యా బోధనకు నిదర్శనం.

ప్రభుత్వమే స్వయంగా ఈ ఫలితాలను పత్రికల్లో ప్రకటించడం వెనుక లోతైన సామాజిక కోణం ఉంది. పత్రికల్లో తమ ఫోటోలు చూసుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలిగే సంతోషం, గౌరవం, అంతకుమించి ఆత్మవిశ్వాసం వెలకట్టలేనివి. ఇది వారిని భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాల వైపు నడిపిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళుతుంది. అలాగే, ‘‘మా పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే చదువు వస్తుందా?’’ అని సందేహించే తల్లిదండ్రులకు ఈ ఫలితాల ప్రకటన ఒక గొప్ప సమాధానం. ఇది రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని పెంచుతుంది.


కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలి. ఈ ఫలితాల ప్రకటనలు ప్రభుత్వ బడులు కూడా పోటీలో ఉన్నాయని చాటిచెప్పాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని నిస్సందేహంగా పెంపొందిస్తుంది. ప్రభుత్వం ఇలా ఫలితాలను పత్రికల ద్వారా ప్రకటించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కృషి, ప్రతిభ కూడా సమాజానికి తెలుస్తుంది. ఇది ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను నమ్మకంగా చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఫలితాలను ఈ విధంగా ప్రకటించడం వల్ల చిన్న గ్రామాల్లో చదివే విద్యార్థుల్లో ‘‘మనం కూడా టాప్ ర్యాంకులు సాధించవచ్చు’’ అనే నమ్మకం పెరుగుతుంది. ఈ ఒక్క భావన వందలాది పిల్లల జీవితాలను మారుస్తుంది.

ననుబోలు రాజశేఖర్

ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 12:29 AM